Monday, November 25, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

64. అకలంక స్థితి నిల్పి, నాద మను ఘంటా రావమున్ బిందు దీ
పకళాశ్రేణి వివేకసాధనము లొప్పం బూని యానంద తా
రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా
రికిగా వీడు భవోగ్ర బంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! బిందు- బిందుస్థానము ( సహస్రారం) లోని, దీప- జ్యోతిస్వరూప మైన పరమేశ్వరికి చెందిన, కళాశ్రేణి- నిత్యాదేవతలు (కిరాణసముదాయం), వివేకసాధనములు- జ్ఞానసముపార్జనా పరికరాలుగా, ఒప్పన్- చక్కగా, పూని- గ్రహించి, (సమకూర్చుకొని), నాదము- అను- ప్రణవనాదం అనే, ఘంటారావమున్- ఘంటాధ్వనిని, అకలంక స్థితిన్- నిర్మలమైన (కదలిక లేని స్థితిలో), నిల్పి- ఉంచి (మనసులో న్యాసం చేసి), ఆనంద- ఆనందస్వరూప మైన, తారక- సంసారసముద్రాన్ని తరింప చేసే, దుర్గాటవిలో- దుర్గమమైన అడవిలో (దుర్గాదేవి వనంలో) మనోమృగము- మనస్సు అనే లేడి యొక్క, గర్వస్ఫూర్తిన్-గర్వస్ఫురణని (అహంకారం యొక్క విజృంభణని), వారించువారికిన్- నివారించేవారికి, భవ- సంసారం అనే, ఉగ్ర- భయంకరమైన, బంధలతికల్- బంధాలు అనే తీగలు, వీడున్- విడిపోతాయి, కాన్- కదా!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! సహస్రారం లోని బిందుసరం అని చెప్పబడే కేంద్రస్థానంలో జ్యోతిస్వరూపమైన పరమేశ్వరికి చెందిన కిరాణసముదాయాన్ని లేక నిత్యాది పదునారుదేవతలని యుక్తాయుక్తవివేకం పొందటానికి తగిన సాధనాలుగా గ్రహించి, ప్రణవనాదం లేక ఓంకారం అనే ఘంటారావాన్ని నిర్మలమైన, నిశ్చలమైన మనసులో న్యాసం చేసి, ఆనంద స్వరూపమై, సంసారాన్ని తరింప చేసే దుర్గమమైన దుర్గాదేవియొక్క వనంలో చరించే మనస్సు అనే లేడి యొక్క అహంకార విజృంభణాన్ని నివారించే వారికి సంసారం అనే భయంకరమైన బంధాలు విడిపోతాయి కదా!
విశేషం: ఈ పద్యంలో సంసారబంధవిచ్ఛేదానికి చక్కటి మార్గాన్ని సూచించాడు ధూర్జటి. ఇది ధూర్జటి శ్రీవిద్యోపాసనకు మచ్చుతునక. శ్రీవిద్యోపాసకులు లలితాదేవిని లేక పరాశక్తిని సహస్రారంలోని కేంద్రబిందువులో సదాశివుడితో క్రీడిస్తున్నట్టుగా ధ్యానిస్తారు. శ్రీచక్రం అమ్మవారి యొక్క యంత్రరూపం. నవావరణలు గల శ్రీచక్రంలో కేంద్రస్థానంలో ఉన్న బిందువే శ్రీమాతస్థానం. అక్కడే నిత్యాదేవతలు పదహారుమంది ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు. వారు చంద్రుడికి చెందిన 16 కళలు. అవి చంద్రుడికి, చంద్రుడి అధీనంలో ఉన్న మానవుడి మనస్సుకి వెలుగుని పూర్ణతని ఇస్తాయి. ఆ వెలుగులని సాధనాలుగా చేసుకుంటే మనస్సు సరైనమార్గంలో నడచి వివేకం కలుగుతుంది. అపుడు నిశ్చలత సిద్ధిస్తుంది. ఆ స్థితిలో ప్రణవం అనే నాదంతో మనోమృగాన్ని ఆకర్షించాలి. పంచేంద్రియ విషయాలలో నాదం లేక ధ్వని లేక సంగీతం అనే దానికి లోబడి పోయే జంతువు లేడి. లేడిని వేటాడేవారు దాన్ని ఆకర్షించటానికి మంచిపాటలు, సంగీతం వినిపిస్తారుట! మనోమృగం గర్వాన్ని పోగొట్టి దాన్ని అధీనంలోకి తెచ్చుకున్నవారికి భవబంధాలు తెగిపోతాయి.
ఇందులో శ్రీచక్రోపాసన మాత్రమే కాదు, నాదబిందుకళారాధనా పద్ధతి కూడ సూచించబడింది. పరమాత్మని ప్రణవరూపంగా, అంటే, ఓంకారరూపంగా ఆరాధించటం. పరమాత్మ ఉచ్చరించిన ‘ఓం’ నుండి ఈ సృష్టి అంతా ఉద్భవించిం దని, వేదాలు పురాణాలు చెపుతున్నాయి. ఉచ్ఛ్వాస (సో), నిశ్శ్వాస (హం) రూపంగా జీవి అనుక్షణం ఉచ్చరించే ‘సోహం’ లోని భౌతికత అనగా హల్లులు ఐన ‘స’, ‘హ’ పోగా మిగిలేది ‘ఓం’. దీనిని ప్రతిజీవి అప్రయత్నంగా ఉచ్చరిస్తున్నా, దానితో మనసుని ఆకర్షించి, కట్టి పడేసి సహస్రారంలో నిలపటం జరగదు. అంటే, మనోవ్యాపారం నశించి, ఉచ్ఛ్వాస, నిశ్శ్వాస రూపంలో ఉన్న ‘ఓం’కారాన్ని జీవప్రజ్ఞలో లయం చేసి, సహస్రారంలో చేర్చి, నిలపటం జరగదు.
ఓంకారాన్ని సూక్ష్మపంచాక్షరి అంటారు. స్థూలపంచాక్షరి ‘నమశ్శివాయ’శివ పురాణాన్ని అనుసరించి ప్రథమంగా శివుడి ముఖ్యం నుండి ఓంకారం పుట్టినదట. అది శివస్వరూపమే. శివుడు ఓంకార వాచ్యుడట. ముందుగా ఉత్తరముఖం నుండి ‘అ’ కారం, పశ్చిమముఖం నుండి ‘ఉ’కారం, దక్షిణముఖం నుండి ‘మ’ కారం, తూర్పుముఖం నుండి ‘బిందువు’, మధ్యముఖం నుండి ‘నాదం’ పుట్టాయి. కలిసి పంచముఖుడైన శివస్వరూపంగా ఓంకారం రూపు కట్టిందట! ఇది పంచభూతాత్మక మైనదట!
దుర్గాటవి అనటంలో చక్కని శ్లేష ఉంది. దుర్గమ మైన అడవి, దుర్గాదేవి యొక్క అడవి అని రెండర్థాలు. మనోమృగము రూపకాలంకారం.
చతుష్షష్షట్యుపచారాఢ్య, చతుష్షష్టికళామయి అయిన దుర్గాదేవిని, లలితాపరాభట్టారికను 64 వ పద్యంలో స్తుతించటం ఎంతో సమంజసం.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement