Tuesday, November 26, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

62. సంతోషించితి( జాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్
శాంతిం బొందితి( జాలు బహురాజద్వార సౌఖ్యంబులన్
శాంతిం బొందెద( జూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుడ నౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, రతిరాజ- రతీపతి అయిన మన్మథుడి, ద్వార-వాకిలి (స్త్రీ), సౌఖ్యంబులన్- సుఖాలవల్ల, సంతోషించితిన్- సంతోష పడ్డాను. చాలున్-చాలున్- సరి సరి, బహు- అనేక, రాజద్వార- రాజులగుమ్మాల లోని, సౌఖ్యంబులన్- సుఖాలవల్ల (రాజభోగాలవల్ల) శాంతిన్- ప్రశాంతతను, పొందితిన్- పొంది ఉన్నాను,చాలున్- చాలున్- సరి సరి, బ్రహ్మపద- మోక్షం అనే, రాజద్వార సౌఖ్యంబు- రాజమందిరద్వార మందున్న సుఖాన్ని, చూపు- ప్రసాదించు, శాంతిన్- తాపత్రయాలు ఉపశమించిన స్థితిని, పొందెదన్- పొందుతాను, నీ కరుణ చేన్-నీ దయ చేత, నిశ్చింతన్- ఎటువంటి ఆలోచన (విచారం) లేక, శాంతుడన్- దుఃఖవిముక్తుణ్ణి, ఔదున్ ్స అవుతాను.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! స్త్రీలతో రతిసౌఖ్యాలవల్ల, రాజద్వారసౌఖ్యాల (రాజభోగాల)వల్ల సంతోషించి, తృప్తి పొంది ప్రశాంత చిత్తుడ నయ్యాను. అవి చాలు. నీవు కరుణించి మోక్షద్వార మందున్న సుఖాన్ని ప్రసాదిస్తే ఎటువంటి చింత లేక ప్రశాంతతని పొందుతాను.
విశేషం: లౌకిక, భౌతిక భోగాలు అనుభవిస్తే విరక్తి కలుగుతుంది. ఒకదాని తరువాత మరొకటి కావా లనిపిస్తుంది. కోరికలు సముద్రంలోని అలలలాగా పుడుతూనే ఉంటాయి. కాని, ముక్తి లభించిన తరువాత – ఆ ఆనందంలో ఆలోచన ఉండదు (నిశ్చింత) కనుక కోరిక లుండవు. ఆ స్థితి కోరికలు శమించిన (అణిగిన) స్థితి. అదే శాంతి. ఆ స్థితియే కైవల్యం. అది కావాలని కోరాడు ధూర్జటి.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement