10. నిప్పై పాతకతూలశైల మడచున్ నీ నామము న్మానవుల్
దాపున్ దవ్వుల విన్న నంతక భుజా దర్పోద్ధత క్లేశముల్
తప్పుం దీరును ముక్తులౌదురని శాస్త్రంబు ల్మహాపండితుల్
చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! నిప్పు – ఐ – అగ్ని వలె, పాతక – పాతకములు అనే, తూల – దూది, శైలము – కొండను, అడచున్ -నశింప చేయును, నీనామమున్ – నీ పేరును, మానవుల్ – మనుషులు, తప్పన్ – పొరపాటుగా నైనా, దవ్వుల -దూరంగా నైనా, విన్నన్ -విన్నచో, అంతక -యమును యొక్క, భుజాదర్ప-భుజ గర్వము వలన కలిగిన, క్లేశముల్ – మహా దుఃఖములు, తప్పున్ -తొలగును, తరును -తాము కూడా ( అనగా విన్న వారు), ముక్తులు – మోక్ష స్థితిని పొందిన వారు, ఔదురు – అని – అవుతారని, శాస్త్రంబుల్ – అన్ని శాస్త్రాలు, మహాపండితుల్ – గొప్ప విద్వాంసులు, చెప్పన్ – కాన్ – చెప్పుచు ఉండగా, తమకున్ -ఈ మనుష్యులకు, ఇంక – ఇంకను, శంకలు – అనుమానాలు, వలెనా? ఉండ వలసిన అవసరం ఉన్నదా? (సందేహింప పని లేదని భావము)
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నీ నామము పాపములు అనే ప్రత్తి కొండాలని నాశము చేస్తుంది. మానవులు నీ నామాన్ని దూరం నుండి విన్నా సరే యముడి భుజగర్వం వలన కలిగిన గొప్ప కష్టాలు ( నరక బాధలు) తప్పి పోవటమే కాదు, విన్న వారు మోక్షాన్ని పొందుతారు అని శాస్త్రాలు, అవి చదివిన పండితులు కూడా చెపుతున్నారు. మనుషులకు ఇంకా సందేహం ఎందుకు? ( అనగా నామస్మరణ చేయటం ఇంకా ఎందుకు మొదలు పెట్టరు? అని భావము.
విశేషం: ఇందు నామ స్మరణ గొప్పరాణాన్ని గురించి చెప్పబడింది.
పాతకములు అంటే నిష్కృతి లేని గొప్ప పాపాలు, దుష్కర్మలు.
కావాలని కాక పోయినా , పొరపాటుగా నైనా తాను అనక పోయినా, ఎవరైనా అంటుంటే విన్న సరే. నరక బాధలు తొలగి ముక్తి లభిస్తుందిట. మరి, ఇష్టంతో త్రికరణశుద్ధితో నామజపం చేస్తూ, వింటూ ఉంటే ఫలితం ఎంత ఉంటుందో దీనిని బట్టి ఊహించ వచ్చును.
శ్రీకాళహస్తీశ్వర శతకం..
Advertisement
తాజా వార్తలు
Advertisement