Friday, November 22, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

48. తనువెందాక ధరిత్రి నుండుననునందాకన్మహారోగ దీ
పనదుఃఖాదుల( బొంద కుండ ననుకంపా దృష్టి వీక్షించి, యా
వెనుకన్ నీ పాద పద్మముల్తలచుచున్విశ్వప్రపంచంబు( బా
సినచిత్తంబుననుండజేయగదవేశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, తనువు -శరీరం, ఎందాక – ఎంతవఱకు, ధరిత్రిన్ – ఉండున్ – భూమిపై ఉండునో, అందాకన్ – అంతవఱకు, ననున్ -నన్ను, మహారోగ – పెద్దరోగముల, దీపన- ఉద్రిక్తత వలన కలుగు, దుఃఖ – ఆదులన్ – బాధలు మొదలైన వాటిని, పొందక – ఉండన్ – అనుభవించ కుండ, అనుకంపాదృష్టిన్ – దయాదృష్టితో, వీక్షించి -చూచి, ఆ వెనుకన్ – ఆ తర్వాత, నీ పదపద్మముల్ – నీ పాదాలు అనే తామర పూలను ( నీ తామరపూల వంటి పాదాలను), తలచుచున్ – ధ్యానంచేస్తూ, విశ్వప్రపంచంబునన్ – సమస్త ప్రపంచాన్ని, పాసిన -వదలిన, చిత్తంబునన్ -మనసులో, ఉండన్ – చేయన్ – కదవే – ఉండేట్టుచేయవా?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!ఈ శరీరం భూమిపై ఎంత కాలం ఉంటుందో, అంత వరకు పెద్ద రోగముల ఉద్రిక్తత వలన కలిగే బాధలు మొదలైన వాటిని అనుభవించ కుండ ఉండేట్టుదయాదృష్టితో చూచి చివరకు నీ పాదపద్మాలని ధ్యానిస్తూ ఈ ప్రపంచాన్ని వదలిన (అంటని) మనసుతో ఉండేట్టు కరుణించు.
విశేషం: ఎవ్వరైనాకోరదగినది బాధలు లేని జీవనం. అనాయాస, సుఖమరణం. నిజానికి జీవిత మంతాచేసే సాధన మరణసమయంలోబాధపడకుండా ఉండటానికే, చివరి క్షణాల్లో భగవంతుడిపై మనసు లగ్నం అయి ఉండటానికే. రాబోయే జన్మలుతత్సంబంధమైనవిగాఉంటాయట. చివరిక్షణాల్లో ప్రపంచంతో సంబంధాలు పోయి, మనసు శివపాదధ్యాన మగ్నమైతే, శరీరత్యాగం తర్వాత లభ్యమయ్యేదిశివచరణాలే. అలా ధ్యానం చేయ గలగాలంటే, జీవికి చివరిక్షణాల్లో కూడా మనసు ఆరోగ్యంగా, తన చెప్పుచేతల్లో ఉండాలి. కనక రోగం యొక్క ఉద్రిక్తత వల్ల కలిగే దుష్ఫలితాలు కలిగించ వద్దని ప్రార్థన. శరీరం అన్నాక రోగాలు రావటం సహజమే. చిన్నచిన్నవిపరవాలేదు కాని, మనసుని నిర్వీర్యం చేసేవి కాకుండా ఉంటే చాలు. శివనామస్మరణంమరవకుండేట్టు ఉంటే చాలు నని ధూర్జటి భావం.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement