45. పవి పుష్పం బగు, నగ్నిమంచగు, నకూపారం బగు భూమీ స్థలం
బవు, శత్రుండతిమిత్రుడౌ, విషము దివ్యాహారమౌనెన్నగా
నవనీ మండలి లోపలన్శివశివేత్యాభాషణోల్లాసికిన్
శివ! నీ నామము సర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! శివ!- శివా!, అవనీమండలిలోపలన్ – భూమండల మందు, శివ శివ-ఇతి – శివ శివయని, ఆభాషణ – ఉల్లాసికిన్ – పలుకుతూ ఆనందించేవాడికి, పవి – వజ్రాయుధం, పుష్పంబు – అగున్ -పువ్వుగా మారిపోతుంది. అగ్ని – నిప్పు, మంచు – అగున్ – మంచు లాగా చల్లబడి పోతుంది. అకూపారంబు – సముద్రం, భూమీస్థలంబు – అవు – నేల అవుతుంది. శత్రుండు – శత్రువు, మిత్రుడు – ఔన్ – స్నేహితుడవుతాడు. విషము – విషం, దివ్య – ఆహారము – ఔన్ – దేవతల ఆహారం అయిన అమృతం వలె అవుతుంది. ఎన్నగాన్ – ఎంచి చూస్తే, నీ నామము – నీ పేరు, సర్వవశ్యకరము – ఔన్ – సమస్తాన్ని వశం చేసుకుంటుంది కదా!
తాత్పర్యం: శుభప్రదుడవైనశ్రీకాళహస్తీశ్వరా!ఈ భూమండల మందు “ శివ! శివ!” యని నీ నామము నుచ్చరించి ఆనందించేవాడికి (శివనామస్మరణము నందు అభిలాషగల వాడికి) వజ్రాయుధం పువ్వు వలె మెత్తగా మారిపోతుంది. అగ్ని మంచు లాగా చల్లగా అవుతుంది. సముద్రం నేలగా మారిపోతుంది. శత్రువు మిత్రుడు అయిపోతాడు. విషం అమృతం అవుతుంది. పరికించి చూస్తే నీ నామం సమస్తాన్ని వశం చేసుకుంటుంది కదా!
విశేషం: ‘శివ’ శబ్దానికి మంగళప్రదు డని అర్థం. ఆ నామాన్నే నిరంతరం జపించేవాడికి అంతా శుభమే. కనుక అశుభాలనిపించేవన్నీ శుభప్రదాలుగా మారిపోతాయి. వజ్రాయుధం అన్నింటి కన్న కఠినమైన ఆయుధం. ఇది దధీచి వెన్నెముక నుండి విశ్వకర్మ చేత తయారు చేయబడింది. ఇంద్రుడి చేతిలో ఉండే దీనికి తిరుగు లేదు. శివనామం జపించేవాడికి లోకం అంతా శివమయంగా కనిపిస్తుంది. అప్పుడు శత్రువు ఎవరు? కంఠాన విషమున్న దైవాన్నే పూజించేవారికి మామూలు విషం ఒక లెక్క లోనిది కాదు కదా! ఈ మహత్తు అంతా శివుడిది కాదు. శివ నామానిదట!
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement