Friday, November 22, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

  1. ఆలంచున్ మెడ గట్టి, దానికి నపత్య శ్రేణి గల్పించి త
    దద్బాల వ్రాతము నిచ్చి పుచ్చుకొను సంబంధంబు గావించి, యా
    మాలా కోటిని బాంధవంబనెడిప్రేమంగొందఱంద్రిప్పగా
    సీలన్ సీల నమర్చినట్లొసగితో! శ్రీ కాళహస్తీశ్వరా!
    ప్రతిపదార్థం : శ్రీకాళహస్తీశ్వరా!, ఆలు- అంచున్- భార్య అనే పేరుతో, మెడన్- కట్టి- మెడకు తగిలించి, దానికిన్-ఆ భార్య యందు, అపత్యశ్రేణిన్- సంతానాన్ని, కల్పించి- కలిగించి, తత్- ఆ, బాలవ్రాతమున్- పిల్లల సముదాయాన్ని, ఇచ్చి పుచ్చుకొను-కూతుళ్లను ఇవ్వటం, కోడళ్లను తెచ్చుకోవటం అనే, సంబంధమున్- చుట్టఱికాన్ని, కావించి- ఏర్పరచి, ఆ మాలాకోటిని- ఆ మాలలోని కొలికి పూస చుట్టూ, బాంధవంబు- అనెడి- చుట్టఱికం అనే, ప్రేమన్- ప్రేమతో, కొందఱన్- కొంత మందిని, త్రిప్పగాన్- త్రిప్పటానికి, సీలన్- ఒక సీలతో, సీలన్-మఱియొక సీలని, అమర్చిన- అట్లు- కలిపినట్టు, ఒసగితి- ఓ- అందించినావు కదా! ( ఏర్పరచినావు కదా!)
    తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! భార్య అనే పేరుతో ఒకరిని మెడకి తగిలించి, ఆమె యందు సంతానాన్ని కలిగించి, అ తర్వాత ఆ పిల్లలని ఇచ్చి (ఆడపిల్లలకు పెండ్లిండ్లు చేసి) పుచ్చుకొనే (కోడళ్ళని తెచ్చుకొని)చుట్టఱికాలని కల్పించి, జపమాలలోని కొలికిపూస చుట్టూ మిగిలిన పూసలు తిరిగేట్టు ప్రేమ అనే సూత్రంతో కొంతమందిని త్రిప్పుతూ, ఒక సీలతో మఱొక సీలని కలిపి త్రిప్పేట్టు ఈ సంసారచక్రాన్ని కూర్చావు కదా!
    విశేషం: మానవుడు పుట్టినప్పుడు స్వేచ్ఛాజీవి. ఒంటరి. కాని, రాను రాను బంధాలు పెంచుకుంటాడు. బయటి నుండి వచ్చే బంధాలలో మొదటిది, గట్టిదిభార్యాభర్తృసంబంధం. అటువంటి దాన్ని కల్పించి, పిల్లలు, వారిపిల్లలు అనే బంధాలని కల్పించి, అవన్నీ ఒకదానిలో ఇంకొకటి ఇమిడి పోయేట్టుగా చేయటం పరమశివుడికల్పనాచాతురి. సంసారచక్రాన్ని ఆ దృష్టితో చూస్తే పరమేశ్వరుడి చాతుర్యానికి ఆనందమే కలుగుతుంది కదా!
డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement