Saturday, November 23, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

28. కొడుకుల్పుట్టరటంచునేడ్తురవివేకుల్ జీవన భ్రాంతులై
కొడుకుల్పుట్టరెకౌరవేంద్రునకనేకుల్ వారిచే నే గతుల్
వడసెన్? పుత్రులు లేని యా శుకునకుంబాటిల్లేనేదుర్గతుల్
చెడునే మోక్ష పదంబపుత్రకునకున్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!అవివేకుల్- వివేకము (యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం) లేనివారు, జీవనభ్రాంతులు- ఐ- బ్రతుకుపై భ్రమ ( సత్యజ్ఞానం లేకపోవటం) కలవారై, కొడుకుల్- పుత్రసంతానం,పుట్టరు- అట- అంచు- పుట్టలేదు అనుకుంటూ, ఏడ్తురు- ఏడుస్తూ ఉంటారు. కౌరవ- ఇంద్రునకున్- కురురాజైన ధృతరాష్ట్రుడికి, అనేకుల్- అనేకమంది, కొడుకులు-కుమారులు, పుట్టరు- ఎ- పుట్ట లేదా? వారి చేన్- ఆ పుత్రులవల్ల, ఏ గతుల్- ఎట్టి ఉత్తమగతులు, పడసెన్- పొందెను? పుత్రులు- కొడుకులు, లేని- లేనటువంటి, ఆ శుకునకున్-ఆ శుకమహర్షికి, దుర్గతుల్-అథమగతులు, పాటిల్లెను-ఏ- కలిగినవా?, అపుత్రకునకున్- కొడుకులు లేనివానికి, మోక్షపదంబు- ముక్తి అనే పదవి, చెడునా?- దక్క కుండా పోతుందా? ( పోదు అని భావం)
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!కొంతమంది వివేకం లేనివారు కొడుకులు పుట్ట లేదని బ్రతుకు మీద ఉన్న భ్రమతో ( అజ్ఞానంతో) దుఃఖిస్తూ ఉంటారు. ధృతరాష్ట్రుడికి వందమంది కొడుకులు పుట్ట లేదా? వారి వల్ల అతడు ఎటువంటి సద్గతి పొందాడు? కొడుకులు లేని శుకమహర్షికి దుర్గతులు కలిగాయా?లేదు కదా! కొడుకులు లేనివారికి మోక్షము లభించదా? (లభిస్తుంది అని భావం)
విశేషం: “ అపుత్రస్య గతి ర్నాస్తి” అనే శాస్త్రవాక్యాన్ని అనుసరించి ఉత్తమగతులు కావాలనుకునేవారు పుత్రసంతానం కావాలనుకుంటూ ఉంటారు. అది చాలా అవివేకం. అనగా తెలిసిన జ్ఞానాన్ని అన్వయించుకోవటం చేతకాక పోవటం అని అర్థం. తాము శాస్త్రాల నుండి నేర్చిన జ్ఞానాన్ని జీవితానికి, జీవితపరమార్థానికి అనుసంధానం చేసి, అన్వయించటం చాలమంది పండితులకి తెలియదు. వారు జ్ఞానులే కాని, వివేకులు కారు. అటువంటి వారే మగసంతతిలేనివారికి గతులు ఉండవని బాధపడుతూ ఉంటారు. వందమంది కొడుకులున్నధృతరాష్ట్రుడికి ఉత్తమగతులు లభించాయా? అని గాని, కొడుకులు లేని శుకమహర్షి అధోగతి పాలయ్యాడా?అని గాని ఆలోచించరు. ధృతరాష్ట్రుడు కొడుకుల వల్ల సద్గతి పొందలేదు, శుకుడి సద్గతికి కొడుకులు కారణం కాదు అని తెలుసుకోవాలి.
శ్రీమద్భాగవతంలో శుకుడు వివాహితుడని చెప్పబడలేదు.కాని, శ్రీమద్దేవీభాగవతంలో అతడు మిథిలానగరరాజైన జనకుడి బోధతో ‘ పీవరి’ అనే కన్యని వివాహంచేసుకుని సంతానాన్ని పొందినట్లు ఉంది. ఎక్కడైనా శుకుడు ‘ బ్రహ్మచారి’ యే. అనగా ఎప్పుడూ బ్రహ్మభావనయందు ఉండేవాడు అని అర్థం. బ్రహ్మచారి అంటే అవివాహితుడు అని అర్థం కాదు.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement