26. నీ పేరున్, భవదంఘ్రి తీర్థము, భవన్నిష్ఠ్యూతతాంబూలమున్
నీ పళ్ళెంబుప్రసాదముంగొని కదా నే బిడ్డ నై నాడ! న
న్నీపాటింగరుణింపుమోపనికనేనెవ్వారికిన్బిడ్డగాన్
జేపట్టందగు( బట్టి మాన దగదో శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! నీ పేరున్- నీ నామాన్ని (జపాన్ని), భవత్- అంఘ్రి- నీ పదములను సోకిన, తీర్థము- పవిత్రజలము, భవత్- నీచేత, నిష్ఠ్యూత- ఉమియబడిన, తాంబూలమున్- విడియమును, నీ పళ్ళెంబు- నీ పళ్ళెం లోని, ప్రసాదమున్- నీకు నివేదన చేయగా నీచే అనుగ్రహించబడిన ప్రసాదాన్ని, కొని- పుచ్చుకొని, నీ బిడ్డన్- నీ కొడుకుని, ఐనాడన్- అయ్యాను, కదా- కదా!ఇకన్- ఇక మీదట, నేను- నేను, ఎవ్వరికిన్- ఎవరికిని, బిడ్డన్- కాన్- కొడుకును కాను (ప్రస్తుతం), ఓపన్- ( కొడుకుగా అగుటకు) సహించను. నన్ను్స నన్ను, ఈ పాటిన్- ఈ మాత్రం, కరుణింపుము- దయచూపుము, చేపట్టన్- తగున్- స్వీకరించటం తగినదే, పట్టి- స్వీకరించి, మానన్- తగదు- వదల కూడదు.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నీ పేరుని, నీ పాదతీర్థాన్ని, నీవు నమలి విడిచిన తాంబూలాన్ని, నీకు నివేదన చేసిన పళ్ళెంలో మిగిలిన ప్రసాదాన్ని స్వీకరించటం చేత నీకు కొడుకుని అయ్యాను. నన్ను దయ తలచి స్వీకరించు. ఒక్కసారి చేపట్టిన తరువాత వదలకూడదు. ఒకసారి నీ కుమారుణ్ణి అయ్యాక మఱెవ్వరికి కొడుకుని అవటం ఇష్టం లేదు. (ఎవరికి కుమారుణ్ణి అనటం, ఇక ముందెవ్వరికి కుమారుడు అవటం అంటే పుట్టటం ఇష్టం లేదు. అనగా పునర్జన్మ వద్దని ప్రార్థన)
విశేషం: పేరుని గ్రహించటం అంటే, నామ జపం చేయటం మాత్రమే కాదు. ఇంటి పేరుగా, తండ్రి పేరుగా గ్రహించటం. శివుడు తప్ప తనకు తల్లితండ్రులు వేరుగా లేరని 24 వ పద్యంలో చెప్పి యున్నాడు కదా! శ్రీకాళహస్తీశ్వరమాహాత్మ్యంలో ప్రబంధానికి ఉన్న లక్షణాలన్నీ ఉన్నా, కవివంశాదిక వర్ణనలు మాత్రం లేవు. “ జక్కయ నారాయణుని పుత్రుడ” నని మాత్రమే ఉంది, ఇంక మిగిలిన వివరాలు లేవు. శివుడి పేరు గ్రహించటం అంటే ఇది.
నమలిన తాంబూలం, ఎంగిలి కంచంలో అన్నం తినేది పిల్లలు మాత్రమే.
తనని బిడ్డగా స్వీకరించ మనటం జన్మరాహిత్యం కావాలని కోరటం మాత్రమే. శ్రీకాళహస్తీశ్వరమాహాత్మ్య ప్రబంధంలో “ భవపరాజ్ఞ్ముఖధూర్జటి” అని చెప్పుకున్నాడు. ఈ జన్మలో “జక్కయ నారాయణ తనూభవు” గా జన్మించినా ఇకపై భవపరాజ్ఞ్ముఖుడుఅనగా పుట్టుక యందు ఇష్టం లేనివాడు, సంసారాన్ని రోసినవాడు అని అర్థం.
శ్రీ కాళహస్తీశ్వర శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement