Friday, November 22, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

114. నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్
చేకొంటిన్ బిరుదంబు, కంకణము ముంజే గట్టితిం బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతంబు, నా తనువు కీడుల్ నేర్పులుం ఛీ!
ఛీ!! కాలంబుల రీతి దప్పెడి జుమీ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! నీకుం గాని- నీకు తప్ప, ఎవ్వరికిన్- మరెవ్వరికి కూడ,ఏన్- నేను, కవిత్వము- నా కవిత్వం, ఈ- అంచు- ఇవ్వను అని, మీదు- ఎత్తితిన్- ముడుపు కట్టాను, బిరుదంబు- అనే బిరుదనామాన్ని, చేకొంటిన్- గ్రహించాను/ పొందాను, ముందు- చేన్- ముంజేతికి/ మణికట్టు వద్ద, కంకణము- దీక్షాకంకణము, కట్టితిన్- కట్టుకున్నాను, లోకుల్- ప్రజలు, మెచ్చ- మెచ్చుకునే విధంగా, వ్రతంబు- వ్రతాన్ని, పట్టితిన్- చేపట్టాను/పూనాను, నాతనువు- నా శరీరానికి సంబంధించిన, కీడుల్- దోషాలు, నేర్పులున్- నైపుణ్యాలు, కావు- కావు, కాలంబులరీతి- కాలముల పద్ధతి/ కట్టుబాటు, తప్పెడిన్- చుమీ- తప్పిపోవుచున్నది సుమా! ఛీ! ఛీ!!- అయ్యో! ఎంత నింద్యము!!
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! నీకు తప్ప మఱెవ్వరికి నా కవిత్వం అంకితం ఇవ్వ నని ముడుపు కట్టాను. అదే బిరుదంగా పొందాను. అందుకే దీక్షాకంకణం కట్టాను. అందరూ మెచ్చే వ్రతం పట్టాను. శరీరసంబంధమైన మంచిచెడులు నావి కావు. కాలం క్రమం తిప్పుతోంది సుమా! ( నా మాట నెరవేరేట్టు నీవే చూడాలి సుమా అని అభ్యర్థన. )
విశేషం: తన ప్రతిజ్ఞని మఱొక్క మారు నొక్కిచెప్పాడు ధూర్జటి ఈ పద్యంలో. తన కవిత్వం శ్రీకాళహస్తీశ్వరుడికి చెందినదే – ఇతివృత్తం, అంకితం కూడ. కంకణం కట్టి, వ్రతం కూడా పట్టాడట. అయితే కాలప్రభావం శరీరం మీద పడుతోంది. తాను శ్రీకాళహస్తీశ్వరుడి గూర్చి, ఆయనకే అంకిత మిచ్చి కవిత్వం చెపుతా నని ప్రతిన బూనాడు కనుక, అది నెరవేరెట్టు చేసే బాధ్యత ఆయనదే. ఇదీ శరణాగతి అంటే.
వ్రతము: ఒక నియమాన్ని ప్రవర్తనలో అనుసరించటానికి చేసే సాధన. ఇది వర్తనము లేక ప్రవర్తనకి సంబంధించినది. “సత్యనారాయణ వ్రతం” లేక “ సత్యదేవుడి వ్రతం” అంటే, సత్యమునే నారాయణ స్వరూపంగా ఆరాధించే ప్రవర్తన నియమంగా కలది అని అర్థం. అబద్ధం ఆడకుండా ప్రవర్తించటమే ఆ వ్రతం చేయటం అంటే.
వ్యక్తిగా, కవిగా ధూర్జటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే పద్యం ఇది.

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement