Saturday, November 23, 2024

శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌ర శ‌త‌కం..

  1. స్వామి ద్రోహము చేసి, వేరొకని గొల్వంబోతినో కాక నే
    నీమాట న్విన నొల్ల కుండితినొ నిన్నే దిక్కుగా జూడనో
    ఏమీ యిట్టి వృథాపరాధి నగు నన్నీ దుఃఖవారాశి వీ
    ఛీ మధ్యంబున ముంచి యుంపదగునా శ్రీకాళహస్తీశ్వరా!

    ప్రతిపదార్థం:
    శ్రీకాళహస్తీశ్వరా! స్వామిద్రోహము = నమ్మిన దైవమునకు ద్రోహము చేసి, వేఱు + ఒకనిన్ = మఱి యొకని, కొల్వన్ + పోతిన్ + ఓ = సేవించటానికి వెళ్ళినానా? ( లేదే అని భావం), కాక = అట్లు కాక పోయిన ట్లయితే, నీ మాటల్ = నీవు చెప్పిన మాటలను, నీ ఆజ్ఞలను, లేక వేదాలను, ఒల్లక + ఉండితినో = అంగీకరించకుండా ఉన్నానా?, నిన్ను + ఏ = నిన్ను ఒక్కడినే, దిక్కుగా = రక్షకుడ వని, చూడను + ఓ = భావించ లేదా?, ఏమి?= ఏమనుకొంటున్నావో ఏమో ?, ఇట్టి =ఇటువంటి, వృథ + అపరాధిన్ + అగు = ఏ తప్పులు చేయనటువంటి, నన్ను = నన్ను, ఈ దుఃఖ వారాశి = ఈ దుఃఖము అనే సముద్రపు, వీచీ = అలల, మధ్యంబున = మధ్యలో, ముంచి = మునుగునట్లు చేసి, ఉంపన్ = ఉంచగా, తగునా = న్యాయమా? ( న్యాయము కాదు, ఉద్ధరించ వలయును అని భావం)

    తాత్పర్యం:
    శ్రీకాళహస్తీశ్వరా! నమ్మిన దైవమునకు ద్రోహము చేసి, మఱొక దైవమును పూజించుటకు వెళ్లలేదు కదా. నీ మాటలను వినుటకు ఇష్టపడక పోలేదుకదా. ( వేదప్రామాణ్యమును అంగీకరింపక నాస్తికుడను కాలేదు కదా అని భావము.) నీవే రక్షకుడ వని ఆశ్రయించ లేదా? ఎట్టి అపరాధమును చేయలేదే! అటువంటి నిరపరాధినైన నన్ను దుఃఖసముద్రమపుటలలో ముంచి తేల్చుట, భవసాగరమున పడవేయుట తగునా? కాదని భావము.

    విశేషం:
    ఎవరు ఏ రూపంగా భగవంతుణ్ణి ధ్యానం చేస్తేయ రూపంగానే ఉద్ధరిస్తాడని ప్రతీతి. సమయానుగుణంగా దైవస్వరూపాన్నో, దేవతామూర్తులనో, మార్గాన్నో మార్చటాన్ని సనాతనధర్మం ప్రోత్సహించదు. ధూర్జటి తాను అటువంటి పని చేయ లేదని నొక్కి వక్కాణించాడు. అది వాస్తవమే కదా. తనని ఆస్థాన కవులలో ఒకడిగా పోషించిన చక్రవర్తి శ్రీవైష్ణవ మతాభిమాని అని శివ భక్తుడైన తానూ విష్ణువుని సేవించటం ప్రారంభించ లేదు కదా.
    వేదాలు పరమేశ్వరుడి ముఖం నుండి పుట్టినవి. వేదప్రామాణ్యాన్ని అంగీకరించిన వారు ఆస్తికులు. అంగీకరించని వారు నాస్తికులు. తాను నాస్తికుణ్ణి కానని, వేద ప్రమాణాన్ని అంగీకరిస్తున్నానని తనదీ సనాతన ఆర్ష ధర్మమార్గమే నని నొక్కి చెప్పాడు.
    “ నిన్నే నా దిక్కుగా చూడనా ?” అనటంలో ధూర్జటి శరణాగతి ప్రాకటం అవుతుంది. శరణన్న వారిని బ్రోచు బిరుదు కలవాడు కదా శంకరుడు.
డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement