సనాతన ధర్మసారమైన అద్వైత మార్గ స్థాపన కోసం సాక్షాత్తు పరమశివుడే శ్రీ శంకరా చార్యులుగా అవతరించారు. ముప్పది రెండు వత్సరములు ఈ అఖండ భారతావ నిలో కాలినడకన తన శిష్యబృందంతో నడయాడి అనేక పుణ్యక్షేత్రములలో తమ శక్తి యంత్రములను ప్రతిష్ఠించారు. తమ అవతారము పూర్ణమయినదని తెలుసుకున్న శ్రీ శంక రులు కేదారనాథ క్షేత్రమునకు వెళ్ళి కైలాసమునకు పయనమయ్యారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆయనకు ఎదురు వచ్చి తన హస్తమును అందించి కైలాసమునకు తీసుకువె ళ్లారు. అద్భుతమైన కాంతిపుంజమై ఆ పరమశివుని సాన్నిధ్యమునకు చేరారు.
అతి పిన్న వయసులో మానవులకు అసాధ్యమైన సర్వ వేదశాస్త్ర అధ్యయనము గావిం చి, అనేక దివ్యమైన గ్రంథములను, స్తోత్రములను రచించి మోక్ష సాధకులకు అందించిన అవతారమూర్తి శ్రీ శంకరాచార్యులు. అటువంటి మహిమాన్విత స్తోత్రములలో శివానంద లహరి ఒకటి. ఆద్యంతం శివధ్యానంతో భక్తి సాగరంలో మునిగేలా చేస్తుంది.
నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్
సదా త్వత్పౌదాబ్జ స్మరణ పరమానంద లహరీ
విహారాసక్తం చేద్ధృదయ మిహకింతేన వపుషా
అనేక జన్మల నుండి విముక్తిని ప్రసాదించు ఓ పరమేశ్వరా! దేవ, మానవ, మృగ, కీటక, పశు, పక్షి మొదలగు ఏ జన్మ లభించినా నీ నామస్మరణ చేయుచూ, నీ పాదారవింద పరమా నంద ప్రవాహంలో సాగిపోగల శక్తి, ఆసక్తి నాకు కలిగించు చాలు. జన్మ ఏదయినా ఫరవాలే దు. పుణ్యవాసనా ఫలితంగా లభించిన ఈ మానవజన్మను సార్థకం చేసుకోవాలంటే, ముక్తిని పొందాలంటే శివనామ స్మరణ, శివార్చన ఒక గొప్పమార్గం అని శంకరులు తెలియచేసారు.
” సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ…”
అను శ్లోకం ఆయన అవతార బ్రహ్మచారి అయినా సామాన్యుని మనసు ఒక మర్కట సమానమయినదని, సంసార వ్యామోహంలో పడి కోరికల చుట్టూ పరిభ్రమించునని అటు వంటి చంచలమైన మనసును భక్తి అనే త్రాడుతో బంధించి నీ ఆధీనం చేసుకోమని అర్థిస్తుంది.
”నాలంవా? పరమోపకార మిదం త్వేకం పశూనాం పతే…”
ఓ పశుపతీ! సమస్త విశ్వం భయంకర హాలాహల జ్వాలలతో భస్మీపటలం అగునపుడు ఆ హాలాహాలాన్ని నీ గొంతులోనే వుంచుకొని నీలకంఠుడయ్యావు. మ్రింగితే నీ అఖండ ఉద రంలోనున్న చరాచర జీవరాశులు నశించిపోయేవి. అందుకే కంఠంలో నిలుపుకొని సమస్త లోకాలను కాపాడగల పరమోపకారివై నిలిచావు. త్రిమూర్తులలో పరమశివునికి గల శక్తిని ఈ శ్లోకం ద్వారా తెలియచేసారు.
”కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ…”
ఓ భూతనాధా! ప్రళయ కాలంలో దేవతలతో సహా, సమస్త జీవకోటి భయంకరంగా నశించిపోతుంటే, నీ వొక్కడివే నిర్భయుడివై వీక్షిస్తూ ఆనం దసాంద్రంగా విహరిస్తున్నావు. అనగా లయకారుడైన పర మశివుని ప్రళయ కాల రుద్రశక్తిని గుర్తు చేసారు. లయకారుడై న శివుని కంటే మిన్నయైన, ముక్తినొసగే దైవం వేరొకటి లేదని భావన.
”భక్తో భక్తి గుణావృతే ముద మృతా పూర్ణే ప్రసన్నేమన:…”
ఓ సాంబశివా! భక్తితో నా శరీర గృహాన్ని శుద్ధి చేసి శుభా న్ని పొందడానికి భక్తియనే నూలుపోగుతో ఆవృతం చేయబ డి, సంతసమనే జలాలతో నింపబడిన నిర్మల మనస్సనే కల శంలో నీ పాద పద్మాలనే మావిచిగుళ్ళపై జ్ఞానమనే నారికేళ ఫలమును వుంచి, సత్త్వగుణ ప్రధానుడనై నీ మంత్రోచ్ఛారణ తో పుణ్యాహ వాచనము ప్రకటించుచున్నాను. ఈ శ్లోకంలో యజ్ఞయాగాదులలో స్థాపించే కలశము యొక్క ప్రాధాన్య తను తెలియచేసారు.
” పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ
మృత్యుంజయ!…”
ఓ మృత్యుంజయా! నా సమస్త పాపాలను నశింపచేసి ఐశ్వర్యమనే ముక్తిని పొందడా నికి నీ నామం జపించుటకు నాలుకను, ధ్యానించుటకు మనస్సును, ప్రణమిల్లుటకు శిరస్సు ను, ప్రదక్షిణ చేయుటకు చరణములను, పూజించుటకు హస్తములను, నిన్ను దర్శించుటకు నా నయనాలను, నీ తాండవ లీలలను వినుటకు నా చెవులను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు నట్లు ఆదేశించు. ఓ మహాదేవా! నీ ఆదేశాలు నెరవేరునట్లు మమ్ములను ప్రేరణ చేయుము. ఇక్కడ శివాజ్ఞ జరిగినా ఆ ఆజ్ఞను పాటించు భక్తి భావన మనసుకు కలిగేలా సాధన చేయాలి. అయితే ఆ సాధనకు కూడా ప్రేరణ శివుడేనని తెలియచేసారు.
” సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిర స్థానాంతరాధిష్టితం…”
సంధ్యా సమయంలో తాండవ నృత్యంతో విజృభించునది, వేదవేదాంగాలలో వర్ణిం పబడినది, ప్రేమపూరిత భ్రమరాంబాదేవిచే కూడి మనోహరమైనది, ఎల్లవేళలా సాధుపుం గవులచే పూజింపబడుతున్నది, సత్త్వగుణ శోభితమైనది, పార్వతీదేవిచే ఆలింగనము చేయబడినదీ అయిన శ్రీశైల మల్లికార్జున మహాలింగాన్ని మేము సేవిస్తున్నాము. ఈ శివానందలహరి శ్రీశైలంలో స్వయంగా స్తుతించి రచించినారని భావించవచ్చు. అందుకే శ్రీశైలమునకు అంత మహాత్మ్యం.
” నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే…”
నిత్యుడను, త్రిగుణ స్వరూపుడు, త్రిపురములను జయించినవాడను, కాత్యాయనీ శ్రేయోదాయకుడును, సత్యస్వరూపుడనూ, మొట్టమొదటి సంసారియును, మునుల హృద యాలలో చిన్మూర్తియును, మాయాశక్తితో ముల్లోకాలను సృజించినవాడును, వేదసంచారి యును, సంధ్యాసమయ తాండవకేశిలో అభిలాష గలవాడును, జఠాధారిని, శంభుని మేము ఆరాధిస్తున్నాము. ఈ శ్లోకం శివుని సర్వవ్యాపికత్వాన్ని వివరిస్తుంది. అలాగే ఆదిదంప తులు పార్వతీ పరమేశ్వరులు అనే రహస్యాన్ని విప్పుతుంది.
”హంస: పద్మవదనం సమిచ్ఛéతి యథా, నీలాంబుదం చాతక:…”
ఓ విశ్వనాథ! పద్మాలను హంస, నీలమేఘాన్ని చాతకపక్షి, ఆదిత్యుని చక్రవాక పక్షి, చంద్రుని చకోరపక్షి కోరినట్లు మా చిత్తము కైవల్య సౌఖ్యాన్ని ప్రసాదించునది, జ్ఞానపథమున అన్వేషింపదగినదీ అయిన నీ పాదయుగళములను కోరుకొనుచున్నది. ఈ శ్లోకము సమస్త జీవరాశుల లక్షణములు తెలిసన సాక్షాత్తు శంకర భగవానుడే శ్రీ శంకరాచార్యులనే సత్యాన్ని ప్రకటిస్తున్నది.
”క్రీడార్థం సృజసి ప్రపంచ మఖిలం క్రీడా మృగాస్తే జనా:…”
ఓ శంభుదేవా! ఈ సృష్టి నీ క్రీడార్థం జరిగింది. జీవులన్నీ నీకు క్రీడా వస్తువులు. క్రీడా ప్రాణులను సంరక్షించడం కూడా నీకొక క్రీడాకర్తవ్యం. ఈ శ్లోకం ”బ్రహ్మసత్యం, జగన్మిథ్య” అను శంకర భాష్యాన్ని ఋజువు చేస్తుంది.
చివరిగా సర్వశివమయమనే సత్యమును చెపుతూ శివదేవుడే ప్రథముడని, అగ్రగణ్యు డని ముగిస్తారు. ఓం నమ:శివాయ.
శివధ్యానానంద లహరి
Advertisement
తాజా వార్తలు
Advertisement