”అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే
సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణ నమ:”
అంటే సమస్త జగత్తుకు ఆధారభూతమైన ఏ అనంత శక్తి ఉందో అది ఆలో చనలకు, భావాలకు అందనిది. వ్యక్తపరుద్దామంటే అవ్యక్తమైంది. గుణరహిత మైనది. సమస్త మంగళకర పనులకు ఆలవాలమైనదీ ‘పరబ్రహ్మ’ స్వరూపమే. ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే ”గురువు” అనే పర్యాయపదం పరమేశ్వరుడు ఆపా దించారు. శివుడు జ్ఞానగురువుగా, విశ్వ గురువుగా ‘దక్షిణామూర్తి’ రూపంలో గోచరిస్తుంటే, శ్రీ కృష్ణ పరమాత్మ ‘జగద్గురువు’గా కీర్తించబడుతున్నారు. ఈ కలియుగంలో మతకలహాలు, స్వార్థ చింతనతో మనిషి తనను ఆశ్రయించి ఉన్న కామ-క్రోధ- లోభ- మోహమనే ఆరు అరిషడ్వార్గాలలో చిక్కుకొని, నడవబట్టే ధర్మం తప్పిన ప్రజలను కొంతవరకైనా, సన్మార్గం వైపు నడిపించడానికి వచ్చిన షిరిడీసాయి ‘సద్గురువు’గా మనకు పరిచయమే. సాయి కూడా శివునిలా పరబ్రహ్మ స్వరూపంగానే భావించాలి. ఎందుకంటే మేఘా అనే భక్తునకు శివ రూపం లో దర్శనమిస్తే, రామునిగా, మారుతిగా, విఠలునిగా, దత్తాత్రేయుడు.. ఇలా ఎ న్నో రూపాలతో భక్తులకు దర్శనమిచ్చి ‘త్రిమూర్తి’ స్వరూపం అని ఋజువు చేసా రు సాయి.
”శంకరా! పరమాత్మా! నీవే మాకు దిక్కయ్యా నీలకంఠా! అని మనసారా స్మ రిస్తే మహేశ్వరుడు భక్తులను అనుగ్రహించినట్లే, సాయి దర్శనానికి వెళ్ళినపుడు విశ్వాసమనే జలం, భక్తి అనే పుష్పాలు, నమ్మకం అనే పత్రాలు సమర్పించి ”అం తా నువ్వే సాయి! అని వేడితే భక్తులను అక్కున చేర్చుకొనే మహేశ్వరుడే సాయి. ‘శివం’ అంటే శుభం, సౌమ్యం, ఇలా అర్థాలు ఉన్నాయి. అలాగే ‘సాయి’ అంటే శు భం. రక్ష. శివుడు గుణాత్మక రహితుడు. అంటే సత్త్వ- రజో- తమో గుణాలకు అతీ తులు. మనలో ప్రతీ ఒక్కరిలో ఈ మూడు గుణాలు ప్రభావితం అవుతాయి. సత్త్వ గుణం సత్కర్మలు, ధర్మాచరణ వల్ల, రజోగుణం వల్ల ఎప్పుడూ ఏవో కోరికలతో, మనస్సుకు అశాంతిని, తమో గుణం వల్ల సోమరితనం, మూర్ఖత్వం, ఏర్పడి మన జీవన మార్గంలో అల్లకల్లోలం చేస్తున్నాయి.
కాని, త్రిమూర్తులలో లయకారుడైన శివునిలో ఈ గుణాలు ఎందుకుంటా యి? ఉండవు. అందుకే ఆయన గుణాతీతుడు. సాయి దైవాంశ సంభూతుడు. అందుకే ఈ మూడు గుణాలకు సాయి కూడా అతీతుడే. గుణాతీతుడు. గుణాల కు మూలకారణమైన మోహాన్ని (కోరికలు) త్యజించమని బోధించేవారు. మో హాన్ని వదిలిన భక్తులను ఎక్కువగా ఆదరించేవారు. పరమేశ్వరుడు జ్ఞానయోగి. ఎప్పుడూ ధ్యానం చేస్తూంటారు. సమాధి స్థితిలోనే ఉంటూ తన కర్తవ్యాన్ని నిర్వ హస్తారు. అలాగే సాయి కూడా నడుస్తున్నా, పడుకున్నా, ద్వారకామాయిలో భక్తులతో మాట్లాడుతున్నా, శూన్యంలోకి, ఆకాశంలోకి చూస్తూ చేత్తోకాని, వేలు తోకాని, చూపిస్తూ ఉండేవారు. అంటే
ఆయన ధ్యాన యోగంలో ఉంటూనే, భక్తులతో సంభాషించడం, దూరం గా ఉన్న భక్తుల యోగక్షేమాలు వీక్షించడం ఈ ధ్యాన సిద్ధితో పరికించేవారు. పర మేశ్వరుడు వారణాసిలో ఆయన సతీమణి అన్నపూర్ణాదేవి వద్ద తొలి భిక్షాటన స్వీకరించేవారు. ఇప్పటికీ స్వీకరిస్తున్నారనే విశ్వాసం. పురాణాలు అదే చెపుతు న్నాయి. అలాగే సాయి కొన్ని నిర్థుష్టమైన ఇళ్ళలో మాత్రం భిక్ష స్వీకరించేవారు. ఆహారం విషయంలో జీవులందరూ ఒక్కటేనని, సమదృష్టితో ముందుగా పక్షు లకు, తనను ఆశ్రయించి ఉన్న జంతువులకు ఆహారాన్ని అందించే, మిగిలిన దాని ని భుజించేవారు.
యోగశాస్త్ర ప్రకారం పరమేశ్వరుడు అగ్నితత్త్వంతో వెలుగొందుతాడు. ఈ అగ్ని ఐదు రకాలు. అవి బడబాగ్ని, జఠరాగ్ని, కాష్ఠాగ్ని, వజ్రాగ్ని, సూర్యాగ్ని. ఈ ఐదింటిలో వజ్రాగ్ని ఇంద్రుడు వద్ద, సూర్యాగ్ని సూర్యుని వద్ధ ఉన్నాయి. బడబాగ్ని సముద్రంలో నిక్షిప్తం అయి ఉంటుంది. ఇది ప్రకృతి తత్త్వం. మిగిలిన కాష్ఠాగ్ని అంటే ఎండు కట్టెలతో రాపిడి వల్ల అగ్నిని పుట్టించి, యజ్ఞాలు, యాగా లు, హోమాలు చేస్తారు.
అలాగే సాయి ద్వారకామాయిలో ‘ధుని’ పేరిట నిత్యాగ్నిని అందించారు. యజ్ఞ యాగాదులు వల్ల పుణ్యం సంప్రాప్తమైనట్లు, సాయి ఏర్పాటు చేసిన ధుని లో కట్టెలు వేసిన వారి పాపాలు నశించి పుణ్యం సిద్ధిస్తుంది. అందులోనుంచి వచ్చే భస్మాన్నే ‘ఊదీ’ పేరుతో రోగాలను నయం చేసిన మహనీయుడు సాయి. జఠరాగ్ని గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆకలి బాధ తీర్చడమే. పంచభూతాలను అదుపులో ఉంచగల శక్తమంతుడు బాబా. అటువంటప్పుడు సాయి శివ స్వరూ పుడుకాక మరేమిటి? పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు. అందుకే ఆయన ద్వాదశ జ్యోతిర్లింగాలతో ఆయన లోకాన్ని వీక్షిస్తున్నాడు.
సాయి కూడా జ్యోతిర్లింగ స్వరూపుడే. ఎందుకంటే సాయి ద్వారకామాయి లో నిత్యమూ జ్యోతులను వెలిగిస్తూ జ్ఞానమనే జ్యోతిని తెలుసకొమ్మని చెప్పిన జ్యోతిస్వరూపుడు. పరమాత్మ శివుడు సాకారుడు. నిరాకారుడు కదా. అదేవిధం గా సాయి కూడా సాకారుడు. నిరాకారుడు. తను జీవించినంతకాలం సాయి సాకార రూపంలోనే భక్తులను ఆదుకొంటే, ఇప్పుడు నిరాకార రూపంలో సమా ధి నుండే భక్తులను ఆదుకుంటున్న మహనీయుడు.
”ఓం అగ్నిరితి భస్మ వాయురతి భస్మ జలమితి భస్మ
స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ సర్వంహవా ఇదం
భస్మ మన ఏతాని చక్షూ:షి” అనే మంత్రం ఉచ్ఛరిస్తూ శివభక్తులు భస్మధా రణ చేస్తూంటారు. సాయి ఏర్పాటు చేసిన నిత్యాగ్నిహూత్రం (ధుని) నుండి వచ్చిన భస్మాన్ని—
”మహాగ్రహ పీడాం మహూత్పాతపీడాం
మహారోగ పీడాం మహాతీవ్ర పీడాం|
హరత్యాశుతే ద్వారకామాయి భస్మం
నమస్తే గురుశ్రేష్ఠ సాయీశ్వరాయ||
పరం పవిత్రం బాబా విభూతిం
పరమం విచిత్రం లీలావిభూతిం|
పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం
బాబా విభూతిం ఇదమాశ్రయామి||
ధారయా మ్యహమ్” అంటూ బాబా భక్తులు ఊదీని ధరిస్తారు. ఇలా చూస్తుంటే సాయి శివతత్త్వాన్ని కలిగి ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటువంటి త్రిమూర్తి రూపుడైన శ్రీసాయినాథునికి
భక్తితో పూజించి తరిద్దాం.