Sunday, November 24, 2024

ఫలించిన సీతాన్వేషణ!

రావణాసురుడు ఆజ్ఞ, రాక్షస స్త్రీల బెదిరింపులు, సీత సమాధానాన్ని, త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతా న్ని శింశుపా వృక్షం మీద కూర్చుని విన్న హనుమంతుడు, ఈమె దేవలోకంలోని నందనవనంలో వుండాల్సిన స్త్రీ గాని, మనుష్య స్త్రీకాదని తలుస్తాడు. వివిధ రకాల ప్రత్యక్ష, పరోక్ష నిదర్శనాల వల్ల, తాను చూసింది సీతనే అని రామ చంద్రమూర్తి సందేశం వినే అర్హత ఈమెకే వుందనీ తీర్మా నించుకుంటాడు. ఇంతవరకు సుగ్రీవుడు అప్పగించిన సీతాన్వేషణ పూర్తయింది. ఇక శ్రీరాముడి కార్యసాధన వుంది. ”సీతాదేవికి ఆమె భర్త యోగక్షేమాలు తెలిపి, ధైర్యం చెప్పి, దు:ఖాన్ని నివారించడం నా ప్రథమ కర్తవ్యం. రామ చంద్ర మూర్తి సీతను ఎప్పుడు చూస్తానా అని ఆసక్తితో వున్నాడక్కడ. ఆయన మాటలు ఈమెకు, ఈమె చెప్పే మాటలు ఆయనకూ చెప్పి ఓదార్చాలి.” అనుకుంటాడు. ”శ్రీరాముడి వృత్తాంతం ఈమెకు చెప్పడం ఆవశ్యకమే అయినా, ఎలా చెప్పాలి? అవకాశం చూసి, సీతాదేవిని ఓదార్చాలి. ఎట్లా జరగాలది? నేను చిన్న ఆకారంలో వున్నా ను. దాన్నిప్పుడు పెంచొద్దు. కోతినైన నేను మనుష్యుల్లా సం స్కృతం మాట్లాడవచ్చా? బ్రాహ్మణుడిలాగా సంస్కృతం మాట్లాడితే, నన్ను రావణుడిగా అనుమానించి అసలే మాట్లా డదేమో! మాట్లాడకుంటే ఆమెను ఎలా ఓదార్చాలి? మాట్లా డాలంటే, ఎలా మాట్లాడాలి? ఈమెకు తెలిసిన ప్రాకృత భాష లోనే మాట్లాడతా. ఎలా చెప్పితే సీత నా మాటలు వింటుంది, నన్ను చూడగానే భయపడకుండా ఎట్లా వుంటుంది?”
ఇలా పరిపరి విధాల ఆలోచించిన హనుమంతుడు, బుద్ధిమంతుడు కనుక, సరైన నిర్ణయానికొస్తాడు. తన్ను చూస్తే నే కదా సీత భయపడేది అనుకుంటాడు. కనిపించకుండా, కొమ్మల్లో దాక్కుని రాముడిని, ధర్మంతోకూడిన, శుభాన్నిచ్చే, తియ్యటి మాటల్తో పొగిడి, ఆమె నమ్మేటట్లు చేస్తే మంచిదని భావిస్తాడు. తన మాటలను ఆమె ఎంతవరకు నమ్ముతుందో చూసిన తర్వాతనే, ముందుముందు ఏమిచేయాల్నో నిర్ణ యించుకోవచ్చు. హనుమంతుడు సీతను చూస్తూ, ఆమె మాత్రమే వినేటట్లు, చెట్టు చాటునుండి, తియ్యగా మాట్లాడ సాగాడు. దశరథుడి పేరు స్మరించేవారెవ్వరూ లంకలో వుండ రు కాబట్టీ, ఆ ప్రస్తావన వచ్చినా కీర్తించే వారెవరూ లేరు కాబట్టీ, దశరథుడితో మొదలెట్టి ఆయన ఉదారకీర్తిని గురిం చిన మాటలు సీత చెవిలో పడేటట్లు చేసి, ఆమె మనస్సును ఆకర్షిస్తాడు హనుమంతుడు. ఈవిధంగా సీతాదేవి మనస్సు ను తనవైపు లాక్కొని, ఇంకేమి చెప్తాడో విందామన్న ఆసక్తి ఆమెలో కలిగిస్తాడు. పరేంగిత జ్ఞానిగా హనుమంతుడు సాక్షా త్కరిస్తాడు. ఎవరో తన మామగారిని పొగడ్తున్న మాటలు విన్న సీత ఇంకేమి వినపడ్తుందో అని ఆలకించింది ఆసక్తిగా.
”దశరథ మహారాజు పెద్దకొడుకే శ్రీరామచంద్రుడు. (ఎవరో తన మగడి పేరు చెబుతున్నారే అని, మరింత ఆసక్తిగా మనస్సు పెట్టి వినసాగింది సీత.) శ్రీరాముడు తండ్రి ఆజ్ఞప్రకా రం, తమ్ముడు, భార్య తోడు రాగా అడవులకెళ్లాడు. రావణు డు మాయలేడి నెపంతో, మోసంచేసి, శ్రీరాముడి భార్యను అపహరించాడు. ఆమెను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణు లు వానర రాజైన సుగ్రీవుడితో స్నేహం చేసారు. వాలిని చంపి, రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగించాడు రాముడు. సీతాదేవిని వెతికేటందుకు, సుగ్రీవుడు పంపిన, వానరులలోె ఒకడినైన నేను, జటాయువు సోదరుడు సంపాతి సలహా మేరకు నూరా మడల పొడవున్న సముద్రాన్ని దాటి లంకకొచ్చాను. సీతాదేవి ని ఇక్కడ వెతుకుతున్న నాకు, నా పూర్వ పుణ్య ఫలంవల్ల, శ్రీరా ముడు చెప్పిన ఆకారం, వర్ణన, కాంతి, గుణం, సౌందర్యం వున్న పతివ్రత కనిపించింది.”
ఇలా హనుమంతుడు మాటలను విన్న సీతాదేవి, తల పైకెత్తి, ఎవరీ మాటలు చెబుతున్నారా అని చెట్టు వైపు చూసిం ది. రావణుడి మాయేమో అనుకుని, భయం, భయంగా, రాముడిని స్మరించుకుంటూ, చెట్టుకింద, మీద, ప్రక్కన చూడ సాగింది సీత. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతమ్మకు హనుమం తుడు చేసిన రామ గుణగానం, రామనామస్మరణ జీవితం పైన ఆశలు చిగురింప చేసింది. చెట్టుకొమ్మల్లో కనిపించిన కోతిని చూడగానే వళ్లు జలదరించింది. తనకేం కీడు జరగ బోతున్నదోనని భయపడింది. అయితే తాను చూసింది హనుమంతుడనే విషయం ఆమెకు తెలియదు. రెండు చేతులు జోడించి, బ్రహ్మకు, అగ్నికి, బృహస్పతికి నమస్కరి స్తుంది. కోతి చెప్పిన మాటలన్నీ నిజం కావాలని, భిన్నంగా జరుగ వద్దని కోరుకుంటుంది.జానకి మనస్సుకు తాను నిజమైన కోతే నన్న నమ్మకం కుదిరింది కానీ పూర్తిగా కాదు అనుకుంటాడు.
హనుమంతుడు పైకొమ్మ నుండి కింది కొమ్మకు దిగి, వినయంతో- ”అమ్మా నన్ననుగ్రహించి నువ్వెవరివో, ఎందు కిట్లా మాసిన పట్టువస్త్రం కట్టుకుని, కొమ్మను పట్టుకుని, నిల బడి వున్నావో చెప్పు తల్లీ? అమ్మా! ఎక్కడనుండి నీవిక్కడకు వచ్చావు? ఎందుకు దు:ఖిస్తున్నావు? నీవు క్షత్రియ స్త్రీవని భావిస్తున్నాను. రావణాసురుడు బలాత్కారంగా ఎత్తుకొచ్చిన సీతవు కావుకదా! నిజంచెప్పు. నీవు రాముడి భార్యవన్న సందేహం కలుగుతున్నది. నా అభిప్రాయం నిజమేకద!” అంటాడు.
హనుమంతుడు తన భర్తను కీర్తించినందుకు సంతోషిం చిన సీత, ఆయనతో తన గురించి చెప్పసాగిందిలా- ”దశర థుడి కోడల్ని. జనకరాజు కూతుర్ని. రామచంద్రుడి భార్యను. నా పేరు సీత. భోగభాగ్యాలన్నీ అనుభవిస్తూ పన్నెండు సంవ త్సరాలు శ్రీరాముడింట్లో వున్నాను. పదమూడో ఏట దశరథు డు నా భర్తను రాజును చేయాలనుకున్నాడు. దశరథుడి ముద్దుల భార్య కైకేయి. రామచంద్రమూర్తిని అడవులకు పం పాలని కోరుతుంది. దశరథుడు భార్యకు చెప్పలేక, బాధగానే తన పెద్దకొడుకును రాజ్యం వదిలి పొమ్మంటాడు. తండ్రి పై నున్న భక్తి, గౌరవాల వల్ల, శ్రీరాముడు, ఆయనతో కలసి మేమి ద్దరం వనవాస దీక్ష తీసుకుని అడవిలో ప్రవేశించాం. రాముడి భార్యనైన నన్ను రావణాసురుడు ఎత్తుకొచ్చాడు. పన్నెండు నెలలు గడువిచ్చాడు. అందులో ఇంకా రెండు నెలలే మిగిలి ఉన్నాయి. ఆ గడువు ముగిస్తే చస్తాను. ఈ లోపల రాముడు రాకపోతాడా అన్న ఆశతోనే బ్రతికున్నాను.”
సీతాదేవి మాటలు విన్న ఆంజనేయుడు, ఊరడిస్తూ, ”అమ్మా! రామచంద్రమూర్తి దూతగా నేనిక్కడకు వచ్చాను. ఆయన క్షేమమని నీతో చెప్పమన్నాడు. నీ క్షేమం తెలుసుకుని రమ్మన్నాడు. లక్ష్మణుడు, నీకు సాష్టాంగ నమస్కారం చెప్ప మన్నాడు.” ఈ మాటలను విన్న సీతాదేవి సంతోషపడుతుం ది. హనుమంతుడిపై ప్రేమ కలుగుతుంది. మాట్లాడుకోవడం ప్రారంభించారు. సీతాదేవిమాటలు విన్న హనుమంతుడు, తన మీద నమ్మకం కుదిరిందన్న విశ్వాసంతో, ఆమెను బుజ్జ గిస్తూ, దు:ఖాన్ని అణచటానికి, కొద్దికొద్దిగా ఆమె దగ్గరకు పోసాగాడు. ఆయనలా దగ్గరకు వస్తుంటే, రావణాసురుడే ఈ వేషంలో తనతో మాట్లాడడానికి వచ్చాడన్న భయం కలిగింది సీతాదేవికి. అప్పుడు హనుమంతుడితో ఇలా అంటుంది.
”నీవు నిజంగా రామదూతవే అయితే నాకు ప్రియమైన ఆయన గుణాలు వర్ణించు. రావణుడైతే రామచంద్రుడిని కీర్తిం చడుకద!” సీతాదేవి సందేహస్తున్నదనుకున్న హనుమ, అది పోగొట్టడానికి రాముడి గుణగణాలను వర్ణిస్తాడు.
”త్వరలో నువ్వు రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని లంకలో చూస్తావు. నేను మాయలమారి రావణుడిని కాను. నీకు కనిపిస్తున్న రూపమే నా అసలు రూపం. నేను కోతినే. పేరు హనుమంతుడు. వానరరాజు సుగ్రీవుడికి మంత్రిని. నీ కొరకై, రామాజ్ఞ ప్రకారం సముద్రాన్ని దాటాను. లంకలో ప్రవే శించాను. నిన్ను చూడటానికి వచ్చాను. నన్ను నమ్ము. సందేహం మాని, నీ దాసుడైన నాతో, నీబిడ్డతో మాట్లాడినట్లే మాట్లా డు” అంటాడు హనుమంతుడు.
సందేహ నివృత్తికై హనుమంతుడిని ఈవిధంగా ప్రశ్ని స్తుంది- ”శ్రీరామచంద్రమూర్తికీ, నీకూ స్నేహమెలా కలిగిం ది? లక్ష్మణుడెట్లు తెలుసు? ఎట్లా మీరిరువురూ ఒకచోట చేరా రు? అన్నదమ్ములిద్దరికి ఎలాంటి గుర్తులున్నాయి? రాముడి కీ, లక్ష్మణుడికీ తొడలెలా వుంటాయి? చేతులెట్లా వుంటాయి? నీవు నిజమైన వానరుడవైతే, రామదూతవే అయితే చెప్పు?”
సీతాదేవి హనుమంతుడికి వేసిన ఈ ప్రశ్న ఒక విషమ ప్రశ్న. అందులో రెండు భాగాలున్నాయి. చేతుల విషయం ఎవరైనా చెప్పొచ్చు. అందరికీ కనిపిస్తాయి కాబట్టి. ”తొడలె లా వుంటాయని” కూడా అడుగుతుంది. దీంట్లో గురువును పరీక్షించే తీరు కనిపిస్తుంది. జవాబు చెప్పేటప్పుడు ఔచిత్యం కనబరుస్తాడా? లేదా అని పరీక్షించదల్చింది. దీనర్థం- ”ఆచా ర్యుడు”, భగవత్‌ తత్వాన్ని ఆమూలాగ్రంగా, రహస్యాలతో సహా తెలిసినవాడై వుండాలని.
జవాబుగా హనుమంతుడు- ”నా అదృష్టం కొద్దీ, నేను రావణుడను కానని నమ్మి, నీ భర్త గుర్తులు, లక్ష్మణుడి చిహ్నాలు చెప్పమని అడిగావు. చెపుతా విను”అంటూ ఆమెకు నచ్చేవిధంగా అన్నీ చెప్తాడు. హనుమ మొదట శ్రీరాముడి ఆత్మగుణాలను వర్ణించి, తర్వాత దేహగుణాలను వర్ణిస్తాడు. ”తేజస్సు, యశస్సు, శ్రీ” ల వల్ల వ్యాపించిన వాడంటాడు. బ్రహ్మచర్య నిష్ఠ కలవాడంటాడు. రాముడిని వర్ణించిన హనుమ, ఆయన్ను గురించి చాలా నిగూఢగా చెప్పి పరీక్ష నెగ్గాడు. సీతకు విశ్వాస పాత్రుడైనాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందారం ఆధారంగా)

  • వనం జ్వాలా నరసింహారావు
    8008137012
Advertisement

తాజా వార్తలు

Advertisement