Saturday, November 23, 2024

సర్వరక్షాకరం శ్రావణ పౌర్ణమి

ధర్మసింధు ప్రకారము రక్షా బంధనము శ్రావణ పూర్ణిమ శుభఘడియలలో ఎవరి శ్రేయస్సును త్రికరణ శుద్ధిగా కోరుకొనుచున్నారో వారికి బంధనం చేయవలెను. కుడిచేతి మణికట్టుకు రక్షను ధరింపచేయాలి.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల:
తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల
పై శ్లోకమును పఠిస్తూ ముడివేయాలి. శ్రీమహావిష్ణువు వామన మూర్తియై ఆడిన మాట తప్పని బలిచక్రవర్తి నుండి మూడడుగులు దానము గ్రహించి ముల్లోకములను ఆక్రమించా డు. ఆ సందర్భములో తిరిగి విష్ణుమూర్తిని వైకుంఠమునకు రప్పించుటకు శ్రీలక్ష్మి ”దానవు డైన మహాబలుడు బలిని ఎవరైతే వాక్బంధన గావించాడో ఆయన సతినైన నేను నీకు రక్షా బంధనము చేయుచున్నానని” బలికి కట్టినట్లు పౌరాణిక ప్రతీతి. తరువాత శ్రీమహావిష్ణువు తిరిగి వైకుంఠమును చేరుకున్నాడు. ఇంకా ద్రౌపది శ్రీకృష్ణునకు కట్టినట్లు మహాభారతంలో పరోక్షముగా ఉన్నది. ఈ రక్షాబంధనము, రాఖీ, రక్షాసూత్రము మొదలగు నామములతో యుగయుగాలుగా పాటించబడుతున్నదంటే దీని ప్రాశస్త్యము గ్రహించవచ్చు.
రాజమహేంద్రవర అక్షాంశ, రేఖాంశములను బట్టి ఆగష్టు 30,2023 బుధవారం ఉద యం 10:32 నిముషముల నుండి 31 గురువారం ఉదయం 8:03 వరకు శ్రావణ పూర్ణిమ శుభఘడియలు ఉన్నవి. ఈ సమయంలో రక్షలు బంధనం చేయవలెను.
సనాతన ధర్మంలో ఏ పెద్ద శుభకార్యము చేసినా కార్యక్రమ కర్తకు కంకణధారణ చేయ డం పరిపాటి. దీనినే తోరణం అని కూడా అంటారు. ఇక ప్రభుకార్యములు, యుద్ధములకు వెళ్ళేటప్పుడు కంకణబద్ధుడవై నిర్వహించాలని దీవించడం కూడా మనకు తెలుసు. కంక ణం తొడిగి సంకల్ప సిద్ధి కలిగిన బ్రహ్మజ్ఞానులు రాజ్యమును పరిపాలించే రాజుకు కొన్ని ముఖ్య కార్యక్రమములలో ఈ రక్షాబంధనమును కట్టి రక్ష కల్పించేవారు.
ముఖ్యముగా సోదరసోదరీ బాంధవ్యము ఈ రక్షాబంధనముతో మరింత పఠిష్టమగు ను అనడంలో ఎటువంటి సందేహము లేదు. రక్త సంబంధము మాత్రమే ఉండనక్కరలేదు. పరస్త్రీని దేవతగా, తల్లిగా భావించే సనాతన సంస్కృతిలో నేటికీ యువతీయువకులు ఈ రాఖీని పరస్పరము కట్టుకుని తమ సోదరప్రేమను వ్యక్త పరచుకోవడం చూస్తే భారతీయ సంస్కృతి అజరామరం అని భావించవచ్చు.
సోదర భావంతో తమ శ్రేయస్సు కోరి కట్టే రక్షాబంధనము ప్రతి ఒక్కరికి వారి పట్ల ఉన్న బాధ్యతను గుర్తుకు తెస్తుంది. సమాజంలో వారికి రక్షగా నిలవాలని సూచిస్తుంది. అసు ర స్వభావుల నుండి వారికి రక్షణ కల్పించాలని ప్రబోధిస్తుంది. పవిత్రమైన మనస్సుతో కట్టిన వారికి ఖచ్చితంగా శ్రేయస్సు కలుగుతుంది. అలాగే బంధన ఒక రక్షగా స్వీకరించిన వారికి నిలుస్తుంది. ఇక్కడ కానుకలు ఇచ్చి పుచ్చుకునేది ఒక సంప్రదాయం మాత్రమే. ముఖ్యమైన అంశము తమ శ్రేయస్సును కోరే సోదరునకు ఆ భగవంతుడు సదా ఆయురారోగ్య సంపదల ను ఇవ్వాలని కోరుకోవడం. అలాగే తన సోదరిని సదా సంతోషదాయకంగా ఉంచాలని కంక ణబద్ధుడవ్వడం. ఇది దాదాపు అన్ని మతాలవారు జరుపుకోవడమనేది ఈ పండుగ గొ ప్ప తనాన్ని వెల్లడిచేస్తుంది.
వృత్రాసురుడు స్వర్గలోకాన్ని ఆక్రమించి ఇంద్రునితో సహా దేవతలందరిని తరిమివేసా డు. అప్పుడు శచీదేవీ పర్వత గుహలలో ప్రవేశించిన ఇంద్రుని చూచి దిగులుపడసాగింది. బ్రహ్మవర ప్రసాదియైన వృత్రాసురుడు ఏ రకమైన ఆయుధము వలన మరణము లేకుండా వరమును పొందెను. త్వష్ట ప్రజాపతి కుమారుడు వృత్రాసురుడు. దేవగణ సతస్యుడు త్వష్టప్రజాపతి. వృత్రాసురుని ఆగడములు భరించలేక దేవతలందరూ భగవతి జగదాంబ ను ఆశ్రయించారు. ఇంద్రుడు వృత్రాసురునితో స్నేహము నటించసాగాడు. భగవతి జగ దాంబ సముద్రపు నురుగులో తన శక్తిని ప్రవేశపెట్టింది. విష్ణువు వజ్రాయుధంలో నిక్షిప్తమై నాడు. నురుగుతో కప్పబడిన వజ్రాయుధముతో ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. కానీ బ్రహ్మ హత్యాభయముతో మానసిక వేదనతో మానస సరోవరము నందు ప్రవేశిం చాడు. ఆ స్థితిలోనున్న భర్తను చూసి శచీదేవి చలించిపోయింది. స్వర్గాధిపతి లేనందున అరాజకము ఏర్పడి సర్వవ్యవస్థలు అస్తవ్యస్తములయిపోయినవి. ఇంద్రుని జాడ తెలియ నందున ధర్మాత్ముడైన నహషుని ఇంద్ర సింహాసనముపై అధిష్టింపచేసారు. కాని పదవీ గర్వంతో నహుషుడు ఇంద్రాణినే కోరాడు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో శచీదేవి ఇంద్రునకు భువనేశ్వరీదేవి శక్తితో రక్షాబంధనము చేసి తిరిగి ఇంద్రపదవి దక్కేలా చేసిందని ఒక ప్రచారం కనబడుతోంది. ఈ రక్షాబంధనము అనునది ఒక మంత్రయుక్తమైనదని భావించవచ్చు. మంత్రము మాట అటులవుంచి ఈ యంత్ర యుగములో మాటే మంత్ర ముగా గణించి చిత్తశుద్ధితో ఎవరు ఎవరికి కట్టినా వారికి శ్రేయస్సు కలుగుతుంది. తిరిగి వారు పరస్పరము ఒకరికొకరు రక్షగా నిలబడగలరు.
ఈ శ్రావణ పౌర్ణమి అనునది ఒక పర్వదినము. హయగ్రీవుడు అను అసురుని శ్రీమహా విష్ణువు సంహరించిన రోజు. దేవీ ఉపాసకుడు అయిన హయగ్రీవుడు గుర్రము తల కలిగిన వారు మాత్రమే తనను సంహరించేలా వరాన్ని పొందాడు. వర గర్వంతో ధర్మబ్రష్టుడయిన ఆ అసురుని గుర్రపు తలతో శ్రీమహావిష్ణువు ఆవిర్భవించి సంహరించాడు. తన గంభీరమైన ధనస్సు కొనపై తలపెట్టి నిద్రించుచూ సేదతీరుతున్న విష్ణువు యొక్క ధనస్సు అల్లెత్రాడును వమ్రి అను కీటకము కారకగా అది తెగి ధనస్సు లేగమునకు విష్ణువు తల ఎగిరిపోయెను. మస్తక హీనుడైన విష్ణువును చూసి దేవతలందరూ జగదాంబను అశ్రయించగా, దేవి బ్రహ్మ ను హయగ్రీవమును తెచ్చి అతికించమని ఆజ్ఞాపించింది. వెంటనే బ్రహ్మ తన ఖడ్గముచే ఒ క ఉత్తమాశ్వము యొక్క శిరస్సును ఖండించి విష్ణువు దేహమునకు అమర్చెను. అశ్వశిరస్సు తో సుందరరూపుడై అసురుని అంతం చేసి, కపటము లేని శాస్త్ర జ్ఞానమును దేవతలందరికీ బోధించాడు. అప్పటినుండి సకల శాస్త్రములను అభ్యసించు శక్తిని కోరుతూ హయగ్రీవ రూపుడైన శ్రీమహావిష్ణువును ఉపాసించుచున్నారు. హయగ్రీవ జయంతి అయిన శ్రావణ పౌర్ణమి రోజున మూలమంత్రం జపిస్తే సకల శాస్త్ర పారంగతులు కావచ్చు.
జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిమ్‌
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే
స్పటికములా నిర్మలమైన జ్ఞానమును ప్రసాదించు ఆనందమయుడు, సకల విద్యలకు ఆధారభూతుడైన హయగ్రీవుని సదా ఉపాసించుచున్నాను. దేవతలు అనుగ్రహించిన వరములతో ధర్మమునకు బ్రష్టుపట్టించుచున్న అసురులను తిరిగి కపటోపాయములతో సంహరించుట తప్పనిసరి. ఆ కపట దోషములు లేని శాస్త్ర జ్ఞానము, ధర్మనిష్ట హయగ్రీవ ఉపాసనతో తప్పక లభిస్తాయి. అందువలన శ్రావణ పౌర్ణమినాడు నూతన యజ్ఞోపవీతము ధరించి శుచిర్భూతులై హయగ్రీవుని స్తుతించిన వారికి బ్రహ్మజ్ఞానము లభించుట తథ్యమని మన సనాతనము విశదీకరించుచున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement