మహాభారతం కథగా చూస్తే చెప్పుకునేందుకు పెద్దగా ఏమీలేదు. ఎన్నో రాజకుటుంబాలలో జరిగే అంతర్యుద్ధాలు, మారణకాండలు, వ్యూహ ప్రతివ్యూహాలు మాత్రమే భౌతికంగా చూస్తే కనిపించేవి. కాని, దృష్టిని మార్చుకొని చూస్తే, తాత్త్వికమైన అంశాలు ఎన్నో ఇందులో కనిపిస్తాయి. మానవ జీవన పరమార్థమైన మోక్షానికి దారిచూపేవి వేదాలు. అపారమైన వేదరాశిని, వ్యాసమహర్షి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదములుగా విభాగించి, వాటి సారాన్ని పంచమవేదంగా, మహాభారత ఇతిహాసంగా అందించాడు. ధర్మమార్గంలో అర్థకామాలను సాధించి మోక్షాన్ని పొందమని వేదసాహిత్యం చెపుతుంది.
మోక్షాన్ని పొందడం అంటే.. వ్యష్టి భావన నుండి సమష్టి భావనకు పరివర్తన చెందడమే. సత్వరజస్తమో గుణాల సమ్మేళనంతో, అగాధమైన సంసారమనే సముద్రంలో కొట్టుమిట్టాడే వ్యక్తి తన దృష్టిని, త్రిగుణాలకు అతీతమైన భగవంతుని వైపుకు మళ్ళించుకునేందుకు ప్రయత్నం చేయాలి. వ్యాసమహర్షి తాను దర్శించిన మహనీయ సత్యాన్ని సాధారణ జనాలకు అందించి వారు తరించేందుకు మార్గం సుగమం చేసే ప్రయత్నంలో వెలుగు చూచిందే మహాభారతం.
మహాభారతం సర్పయాగంతో ఆరంభమౌతుంది. తక్షకుడు అనే సర్పరాజు ఉదంకుడు అనే మహర్షికి అపచారం చేయడం, పరీక్షిత్తు అనే రాజును కాటు వేయడం కారణాలుగా సర్పయాగానికి అంకురార్పణం జరుగుతుంది. ఉదంకుని ప్రేరణతో పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. ఆ యాగంలో మంత్రోఛ్ఛారణతో ఆమంత్రితమై ఒక్కొక్క సర్పము వచ్చి హోమగుండంలో ఆహుతి కావడం జరుగుతుంది. దానితో సర్పజాతి అంతరించి పోతుందనే విషయాన్ని గమనించిన ఆస్తీకుడనే ముని బాలకుడు వచ్చి జనమేజయుని అర్థించి సర్పయాగాన్ని ఆపిస్తాడు. దానితో తక్షకుడు రక్షితుడౌతాడు. ఇది సర్పయాగం గూర్చిన చిన్న కథ. పైకి కనిపించే కథగా కాక దీనిని వేద ప్రతిపాదితమైన తాత్త్విక భావనతో పరిశీలించడం వల్ల దానిలోని అంతరార్థాన్ని గ్రహించగలుగుతాము. జీవితాలను ఉన్నతీకరించుకో గలుగుతాము.
నిజానికి సర్పయాగంగా చెప్పబడింది భౌతిక యాగం కాదు. దానిని జ్ఞాన యజ్ఞంగా భావించాలి. అక్కడ హోమగుండాలు, అగ్నిహోత్రాలు లేవు. ఋత్వికులూ లేరు. నోరులేని జీవాల బలులూ లేవు. ఇక్కడ యజమాని సాధకుడు. ఋత్విజుడు మార్గదర్శియైన, సమర్ధుడైన గురువు. హోమగుండ మనేది సాధకుని విజ్ఞానమయ కోశమే. జ్ఞానమనే అగ్నిజ్వాలలు సాధకుని సాధనలో జరిగే పరిణామం… పరిణతి. అందులో ఆహుతులయ్యే సర్పాలు… సాధకునిలోని అసురీ భావనలు. జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యేవి అహంకార మమకారాదులు. తపనలో జనించే యోగాగ్నిలో దగ్ధమయ్యేవి సకల కర్మల ఫలితాలు. యాగఫలితం సాధకునికి ముక్తిమార్గాన్ని చేరడం. ఒక్కొక్కటిగా అజ్ఞానమనే సర్పాలు విజ్ఞానమనే అగ్నిజ్వాలలలో దగ్ధమౌతూ సాధకుడిని పునీతుని చేస్తున్నాయి. ప్రతి సర్పాన్నీ ఆమంత్రణం చేస్తారు. అంటే… మంత్రపూతమైన భావనలను సాధనచేస్తూ, ఆంతర్యాన్ని గ్రహస్తూ, వాటిని నిజజీవితంలో ఆచరించే విధానంగా చెప్పుకోవాలి. ఆ మంత్రాలను పఠిస్తూ సాధకుని ఉన్నతిలో ఉత్ప్రేరకంగా పనిచేసే వారే సభాసదులు.
సర్పయాగం ఆస్తీకుని అభ్య్యర్ధనతో ఆగిపోతుంది. తక్షకుడు రక్షింపబడతాడు. తక్షకుడు అనేది కాలానికి ప్రతీక. కాలమనేది ఆవరణగా చెపుతారు. ఆవరణాన్నే అజ్ఞానంగా చెప్పుకుంటాము. అస్తీకుడు అనేది అవరోధం. ఎంతగా సాధన చేసినా బలమైన అజ్ఞానమనే ఆవరణ నుండి సాధకుడు బయటకు రాలేకపోయాడు. ఆ ఆవరణను అధిగమించేందుకు అవసరమయ్యేది తాత్త్విక విషయ శ్రవణం, మననం. అందుకే వ్యాసమహర్షి జనమేజయునికి భారతగాథను శ్రవణం చేయమని చెప్పాడు. దానికి తన శిష్యుడైన వైశంపాయనుని నియమించాడు. కథగా దానిని చెప్పడం లేదా వినడం వల్ల ప్రయోజనం లేదు. దానిలోని అంతరార్థాన్ని అవగాహన చేసుకోవడమే భారతగాథను ప్రవచించడంలోని పరమార్థం.
సర్పాలు సాధకుని భౌతిక జీవన పరిమితులలో, వివిధ ముఖాలుగా ప్రసరిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, ఉన్నతిని ఆడ్డుకునే భావనలకు, ఆశలకు, కోరికలకు ప్రతీకలు. వాటిని లయం చేసుకుంటేనే ముక్తి.
అజ్ఞానమనే సర్పాలను విజ్ఞానమనే అగ్నిలో ఆహుతిచేసి మోక్షమనే ఫలితాన్ని పొందాలని భారతం ప్రపంచానికి ప్రబోధచేసింది. ఆచరించలేని వారికి కనీసం వినడం, విన్నదానిని మననం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- పాలకుర్తి రామమూర్తి