Saturday, November 23, 2024

సంతాన… సౌభాగ్య వ్రతం

శ్రావణ కృష్ణ అమావాస్యను తెలుగు ప్రజలు ”పోలా అమావాస్య లేక పోలాల అమావాస్య”గా వ్యవహరిస్తారు. ఈరోజు చేసే పోలాల అమావాస్య వ్రతం ఎంతో విశిష్టమైనది. ”పోలాంబ, పోలకమ్మ, పోలేరమ్మ” పేరుతో దేవీ పూజలు చేస్తారు. పెళ్లయి చాలా కాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు పోలాల అమావాస్య రోజు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం, పిల్లలకు అకాల మృత్యు భయముండకుండా, ఆయురారోగ్యాలతో ఉండాలని, తమ కుటుంబ శ్రేయస్సుకు స్త్రీలు ఈ వ్రతాన్ని చేయాలి.
సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణమైన గ్రామ దేవతల కరుణా కటాక్షాలు ఉండాలని, అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవ డానికి పండుగల రూపాలలో ఎన్నో అవకాశాలు కల్పించారు. అటువంటి గ్రామ దేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన దేవత. పోలేరమ్మగా కొలవబడే గౌరీదేవిని పూజించాలి.
పూజా విధానం
పోలాల అమావాస్య వేడుకల నిర్వహణ సనాతన ఆచారంగా వస్తున్నది. పూజచేసే చోట ఆవుపేడతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, రెండు కందమొక్కలను (తల్లి, పిల్ల) వుంచాలి. కంద మొక్క దొరకకపోతే పిలకలు వున్న కందగడ్డను అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు., పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ వుంచి, ముందుగా పసుపు వినాయకుని పూజించి, తర్వాత ఆ కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని, సంతానలక్ష్మీ దేవినిగాని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించి, ఏడు పూర్ణం బూరెలు, గారెలు, ఏడు రకాల కూరగాయలతో చేసిన పులుసు నైవేద్యంగా సమర్పి స్తారు. పనస ఆకులతో తయారుచేసిన బుట్టలలో ఇడ్లీపిండి వేసి ఆవిరిమీద ఉడకబెడతారు. వీటిని పొట్టెక్కబుట్టలు అంటారు. వీటిని కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు. పూజ అయిన తర్వాత కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి. తర్వాత బ#హు సంతానవతి అయిన పెద్ద ముత్త యిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని ఏడు పూర్ణం బూర్లు, ఒక తోరాన్ని అమ్మవారికి వాయనంగా సమర్పించి దీవెనలు అందుకుం టారు. కథ అక్షంతలు పిల్లల తలమీద కూడా వేయాలి. పసుపుకొమ్ము కట్టిన తోరాన్ని పిల్లల మొలతాడుకు కట్టవచ్చు. లేదా మెడలో వేయవచ్చు. ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా, మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక్క తల్లి పిల్లలను కాపాడుతుందని విశ్వాసం.
వ్రతకథ
పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు కొడుకులు. అందరికీ వివాహం అయింది. కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడ ళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు. కానీ ఆఖరి కోడలుకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోవడం జరిగేది. అలా ఆరు సంవత్సరాలు శ్రావణ అమావాస్య రోజు నే జరిగేది. అందువల్ల బ్రాహ్మణుడి కోడళ్లు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవ డానికి కుదరలేదు అందుచేత ఆఖరి తోడికోడలు అంటే మిగిలిన అందరికీ కోపం. సూటిపోటి మాటలతో ఆమెను బాధించేవారు. ఏడవ సంవత్సరం కూడా ఆఖరి కోడలు గర్భవతి అయింది. ఈసారి ఆమెను వ్రతం చేసుకోవడానికి పిలవలేదు. సరిగ్గా శ్రావణ అమావాస్య రోజునే ఆమెకు ప్రసవం అయి మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న బట్టల మూటను పెట్టుకొని తోటికోడళ్ళతో కలిసి పూజ చేసుకుంది. ఆ తర్వాత తన గదికి వెళ్ళి చనిపోయిన పిల్లవాడిని ఎత్తుకుని స్మశానానికి వెళ్లి గతంలో మర ణించిన తన పుత్రుల సమాధుల దగ్గర ఏడుస్తూ కూర్చుంది. అప్పటికి చాలా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ ఆమె దగ్గ రకు వచ్చి, కారణం తెలుసుకుంది. బాధపడవద్దని చెప్పి, సమాధుల దగ్గ రకు వెళ్ళి పిల్లలకు ఏ పేర్లు పెట్టాలనుకుందో ఆ పేర్లతో పిలవమని చెప్పింది పోలా లమ్మ. ఆమె సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరుపేరు నా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తల్లిని కౌగిలించుకు న్నారు. పిల్లలందరినీ వెంటపెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినది అందరికీ చెప్పింది. తోటి కోడళ్ళందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లాపాలతో ఆనందంగా జీవించారు.
గో — వృషభ పూజ
భారతావని ప్రాచీనకాలం నుండీ వ్యవసాయ ప్రధాన దేశం కావడం గ్రామీ ణులలో అధిక సంఖ్యాకులు రైతుల కావడం, ఎడ్లు నాగళ్ళతో విడదీయ రాని బంధం, అనుబంధాన్ని ఏర్పరచుకున్న రైతులు వాటికి కృతజ్ఞతను తెలుపుతూ పూజ చేస్తారు. గ్రామదేవతను ఆరాధిస్తూ… వ్యవసాయానికి సహకరించే పశువు లను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. పోలాల అమావాస్య సందర్భంగా గృహణులు మట్టితో ఎడ్లను, పశువుల కాపరి మృణ్మయ మూర్తులను తయారుచేసి, పూజలు నిర్వహస్తారు. సర్వ బాధల, సకల రోగాల నివారణార్థం, సర్వజనులు సుఖశాంతులలో వర్ధిల్లాలని గ్రామ దేవతయైన పోచమ్మను ప్రార్థి స్తూ పూజ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement