Monday, January 27, 2025

తెలుగు సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండుగ

యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న క్షీర ధార హైందవ సంస్కృతి. ఆ పాల వెల్లువలో పెల్లుబికిన మీగడ తరగలే మన సాంప్రదాయాలు. హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు పండగ కేంద్ర బిందువు, పండుగలు శుభ సూచకాలు. ప్రతి కుటుంబంలో కష్ట నష్టాలను మరపించి, నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. పండగలు పురాణేతిహాస, రుతు సంబంధాలు, శీతోష్ణస్థితుల, సామాజిక జీవన విధానాధారాలుగా ఏర్పడ్డాయి. ప్రతి పండగలో పరమార్థం ఉన్నందునే అవి సాంప్రదాయాలుగా మారాయి. డోలు సన్నాయి వాద్యాలు, వాటి రాగాలకు అనుగుణంగా విన్యాసాలు చేసే అలంకృత గంగిరెద్దులు, హరిలో రంగ హరీ అంటూ, నడినెత్తి నుండి నాసిక దాకా తిరుమణి శ్రీచూర్ణ పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లు ఘల్లుమనగా, బోడి తలపై రాగి అక్షయపాత్ర కదల కుండా, చిందులు తొక్కే #హరిదాసులు, అడుగడు గునా ముంగిళ్లలో రంగుల ఆకతులు, భోగిమంటలు, కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, బొమ్మల పండుగలతో కలబోసిన గ్రామీణ సుందర మనోహర దృశ్యాలు తెలుగు వారికే ప్రత్యేకమైన సాంప్రదాయ ప్రతీకలు.
చాంద్రమానం పాటించే తెలుగువారు ”సౌరమానం” ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి, ”తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమ కేశు సంచరత: సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తర: రాశౌ సంక్రమణ ప్రవేశ: సంక్రాంతి”. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. కర్కాటకం నుంచి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభి ముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని ‘దక్షిణాయణం’ అంటారు. మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి వరకు ఉత్తరాభి ముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని ‘ఉత్తరాయణం’ అని అంటారు. దేవతలకు ఉత్తరాయణం ఉత్తమ కాలమని, దక్షిణాయణం పితదేవతలకు ముఖ్య కాలమని భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగు తుందంటారు. అందుకే అంపశయ్యపై భీష్మా చార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడని మహా భారతం చెబుతోంది..
మకర సంక్రాంతి సూర్యుడు ఉత్తర గతుడు కావడంతో ఉత్తరాయణ ప్రవేశమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు అర్హమైన కాలం, ఈ అయనంలో మృతి చెందిన వారు పుణ్యాత్ములై, సూర్య సాయుజ్యం పొందగలరని వేద వచనం. సూర్య సంచారమును బట్టి ఏర్పడిన పండుగ. ఆడపిల్లలు తెల్లవారు జామున లేచి పెట్టే గొబ్బిల్లు, ఆర్ష కర్మలలో ప్రాముఖ్యం కలిగిన కళా భిజ్ఞత ఉట్టిపడే ముగ్గులు, పళ్ళ నైవేద్యాలు, బాజా భజంత్రీల వాద్యాలు, ఎక్కడ చూసినా ఈనాడు దర్శనమిస్తాయి. రెండవ నాడు జరిపే మకర సంక్రాంతి అత్యంత పురాతనమైనది. సంక్రాంతి నాడు గంగలో స్నానం చేసి, బ్రాహ్మణునికి పెరుగు దానం చేయాలనే నియమాన్ని పాటించిన యశోదకు కృష్ణుడు జన్మించాడని దుర్వాసముని ద్వారా వివరింపబడి, ఆయన సూచనపై ద్రోణాచార్యుని సతి కృపి, సంక్రాంతి పర్వాన్ని జరిపి, పెరుగు దానం చేయడం ద్వారా అశ్వత్థామకు జన్మనిచ్చినట్లు పురాణ కథనం. ఈ సందర్భంగా నువ్వుల ముద్దలతో నలుగు పెట్టుకుని, తలంటి స్నానాలు చేసిన ముత్తయిదువలు, అలంకృతులై, ఐదు మట్టి ముంతలు పుచ్చుకుని, ఒక్కొక్క ముంతలో బియ్యం, పప్పు దినుసులు, చెరుకు, క్యాబేజీ ముక్కలు, రేగుపళ్ళు, నువ్వులు ఉంచి, మూకుడు మూతతో ఉంచి, ఎరిగిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఇస్తారు. నువ్వులతో చేసిన భక్ష్యాలతో భోజనం చేస్తారు. చిన్నపిల్లలకు మిఠాయి ఉండలు, రేగు పళ్ళు పంచుతారు. మకర సంక్రాంతినాడు రాముని పూజచేసి ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు సూర్యుని ఆరాధించి, తిలలు, కూష్మాండాలు, భాండాలు, కంబళి, ధాన్యాలు, లోహాలు, వస్త్రాలు, తైల దీపాలను దానం చేయాలని శాస్త్ర వచనం. భోజనానికి బంధు మిత్రులను ఆహ్వానించడం, నగలతో అలంకరించుకుని సూతన వస్త్ర ధారణ గావించిన ముత్తయిదువలు పంచదారలో నువ్వులు కలిపి చిమ్మిలి చేసి, పంచి పెడతారు. సంవత్సరం పొడువునా, స్నే#హతులై ఉండాలని ఆకాంక్షిస్తూ, శుభ, సుఖ ప్రదం కావాలని దీవనలను పెద్దవారి నుండి పొందడం ఆచారం.

  • రామకిష్టయ్య సంగనభట్ల
Advertisement

తాజా వార్తలు

Advertisement