అయ్యప్ప దీక్షను పురుషులు ఏ వయసులో ఉన్నా కుల, మత భేదం లేకుండా తీసుకోవచ్చు. అమ్మాయిలైతే పదేళ్ల లోపు వారు, మహిళలైతే 55 ఏళ్ల పైబడ్డ వారు మాత్రమే దీక్ష తీసుకునేందుకు అర్హులు. మొదటిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకునే వారిని కన్నె స్వాములుగా, రెండవ సారి తీసుకున్న వారిని కత్తి స్వాములుగా, మూడవ సారి గంట స్వాములుగా, నాల్గవ సారి గద స్వాములుగా, ఐదవ సారికి గురుస్వాములుగా పిలుస్తారు. వీరందరిలో కన్నె స్వాములకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఏటా ఒకరిద్దరు కొత్త వ్యక్తులతో దీక్ష చేపట్టించి తమ వెంట శబరిమలకు తీసుకెళ్తారు. అయ్యప్ప స్వామికి కన్నె స్వాములంటే మహా ఇష్టమని ప్రతీతి.
యాత్ర అంత కష్టమా ?
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి చాలా మంది జంకుతారు. ఎందువల్ల? ఈ ప్రశ్నకు చాలామందికి తెలిసిన జవాబు అది అత్యంత కఠినతరమని. ఇదొక్కటి మాత్రమే కాదు, వారు శబరిమల యాత్ర తప్పనిసరిగా చేయాలి. నలబై ఒక్క రోజులకు బదులు ఏదో కొద్ది రోజులు మాల వేసుకొని, శబరిమల వరకు వెళ్ళకుండా, మరెక్కడో ఒక అయ్యప్పస్వామి ఊరు వెళ్ళి దీక్షను ముగించే వారి గురించి కూడా వింటున్నాం. నిబంధన ప్రకారమైతే దీక్ష ఎంత కఠినమో శబరిమల యాత్ర కూడా అంతే సాహసోపేతం. చాలా మందిని భయపెడుతున్న అంశాలలో ఇదీ ప్రధానమైంది.
నిజానికి శబరిమలయాత్ర అంత కష్టమా? అంటే కాదనే చెప్పాలి. దైవంపై పరిపూర్ణ విశ్వాసం, ప్రేమతో ముందుకు వస్తే అలాంటి భయాలేవీ ఉండవు.
పిల్లలు, వృద్ధ స్త్రీలు, వృద్ధులు, వికలాంగుల సైతం అనేక కష్టాలకు ఓర్చుకుంటూ అడవి మార్గంలో కాలినడకన వెళ్ళగా లేనిది అన్నీ ఉన్న అనేకమంది అందుకు ముందుకు రాకపోవడానికి అసలైన కారణం సంకల్ప లోపం. వారికి నిజంగా దైవం మీద భక్తి ఉంటే ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక శక్తి స్వయంగా వారిని నడిపించుకుంటూ వెళుతుంది. దీక్ష తీసుకున్న వారికి అడుగడుగునా కష్టాలు కలగడం స#హజం. అవి కేవలం స్వామి పరీక్షలే తప్ప మరోటి కాదనుకోవాలి. చివరకు ఆ భగవంతుడి మీదే సమస్త భారాలు వేసి అన్నింటినీ, అందరి నీ వదిలి అడవి మార్గంలో బయలుదేరుతారు. నియమాలు, నిష్ఠల విషయంలో ఏ మేరకు క్రమశిక్షణను పాటిస్తామన్న దాని పైనే వారి భక్తి నాణ్యత ఆధారపడి ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారి దీక్ష తీసుకొనే వారు విధిగా పెద పాదం గుండానే వెళ్ళాలన్న నియమం ఒకటి ఉంది. భయపడే వారు భయపడుతున్నా, ప్రగాఢ భక్తి తత్పరతతో ఆ మార్గం గుండానే వెళుతున్న వారు లక్షల సంఖ్యలో కనిపిస్తారు.
- కామిడి సతీశ్ రెడ్డి