ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: ఉప్పొంగిన భక్తపారవశ్యం.. తన్మయత్వంలో భక్తజనం.. ఆదివాసీల ఆరాధ్య దైవం, భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం, ఆదిపరాశక్తి నిండు పున్నమి సమ్మక్క తల్లి రావడంతో జాతర ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. తల్లి రాకను స్వాగతిస్తూ మేడారం శివసత్తుల పూనకాలు, భక్తుల సమ్మక్క తల్లి నామస్మరణతో మార్మోగింది. చిలుకల గట్టు నుండి ఆదిపరాశక్తి దిగి వస్తున్న అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు అశేష భక్తజనం పోటీ పడ్డారు. చిలుకల గట్టు నుండి మేడారం వరకు దారికి ఇరువైపుల భక్త జన ప్రవాహం కొనసాగింది. చిలుకల గట్టు నుండి సమ్మక్క తల్లి దిగివస్తున్న సందర్భాన్ని తెలియపరుస్తూ ములుగు జిల్లా ఎస్పి సంగ్రామ్ సింగ్ పాటిల్ జీ ఏకే 47ను గాలిలోకి కాల్చడంతో ఒక్కసారిగా మేడారం భక్తుల పూనకాలు సమ్మక్క నామ స్మరణలతో ఊగిపోయింది. ఆదిపరాశక్తి సమ్మక్క తల్లికి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ములుగు శాసన సభ్యురాలు దనసరి సీతక్క, జిల్లా ఎ స్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, జెడ్పీవైస్ ఛైర్ పర్సన్ బడె నాగజ్యోతి, దేవాదా య కమీషనర్ అనీల్ కుమార్, మేడారం ఈవో రాజేందర్ స్వాగతం పలికారు.
తన్మయత్వంలో భక్తజనం
భక్తుల ఇలవేల్పు సమ్మక్కతల్లి చిలుకల గట్టు నుండి మేడారానికి తరలివస్తున్న అపూర్వ ఘట్టాన్ని తిలకిస్తున్న భక్తులలో ఉప్పొంగిన భక్తి పారవశ్యంతో తన్మయత్వానికి లోనయ్యారు. సమ్మక్క తల్లి చల్లంగా చూడాలి అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో మేడారం అంతా దద్దరిల్లింది. శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క నడిచివస్తుండగా భక్తులు ఎదురెళ్ళి ఎదురుకోళ్ళతో స్వాగతాలు పలికారు. అడు గడుగునా కోళ్ళు, మేకపోతులు బలిచ్చి బెల్లం కళ్ళు శాఖ ఆరగించి తమ మొక్కులను తీర్చుకున్నారు.
అడుగడుగునా స్వాగతాలు
చిలుకల గట్టులో కొలువై ఉన్న సమ్మక్కను మేడా రం తీసుకువచ్చేందుకు గ్రామాన్ని శుధ్ధి చేయడంతో పాటు గద్దెల ప్రాంగణాన్ని మొత్తంశుద్ధి చేశారు. అప్ప టికే గద్దెలపై కొలువైన సారలమ్మ, పగిడిద్ద రాజు, గొవింద రాజుల గద్దెలను అందంగా అలంకరించారు. సమ్మక్క గద్దెను శుద్ది చేయడంతో పాటు కంకవనం నుండి వెదురు తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్ర మాలు నిర్వహించి గద్దెపై ప్రతిష్టించారు. సమ్మక్క తరలివస్తున్న సం దర్భాన్ని పురస్కరించుకుని శివసత్తుల విన్యాసాలు, భక్తుల పూనకాలు అపూర్వ మైన సన్నివేశాలను తల పించే విధంగా కనిపించాయి. అయితే తల్లి నడచి వసు ్తండగా తమ ఇలవేల్పయిన సమ్మక్కను తాకేందుకు భక్తులు రోడ్డు పై కి దూసుకువస్తుండగా వారిని అదుపు చేయడం పోలీసులకు ఇబ్బంది కరంగా మారింది.
తరలివచ్చిన దేవరలు
సమ్మక్క తల్లి గద్దెల పై కోలువయ్యే సందర్భాన్ని పురస్కరించుకుని ఎదురెళ్ళి స్వాగతం పలికేందు కోసం వివిధ ప్రాంతాల్లో కొలువైన లక్ష్మీదేవరలు, గట్ట మ్మలు, గ్రామదేవతులు మేడారంకు తరలివచ్చారు. సమ్మక్క ఆగమనాన్ని పురస్కరించుకుని ఎదురెల్లి స్వాగతం పలికారు. పూనకాలతో శివసత్తులు రోడ్ల పైన చేస్తున్న విన్యాసాలు తల్లిరాక కొంత ఆటంకంగానే మారింది.
7.16 నిమిషాలకు వనం నుండి జనంలోకి…
చిలుకల గట్టు పైన సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య , సిద్దబోయిన మునిందర్, సిద్దబొ యిన అరుణ్, తదితర పూజారుల ఆధ్వర్యంలో నమిలి నార చెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వ హించారు. మేడారం సమ్మక్క గుడి నుండి 5 గంటలకే చిలుకల గట్టుకు చేరుకున్న పూజారులు ఆదివాసి సాంప్రదాయాలను పాటిస్తూ వనం నుంచి జనంలోకి తల్లిని తీసుకువచ్చేందుకు పూజా తంతును పూర్తి చేసినప్పటికి తల్లిని తీసుకురావడం కొంత ఆలస్యం అయింది. పూర్తి స్థాయిలో అధికారిక లాంఛనాలతో తల్లికి స్వాగత ఏర్పాట్లు చేయలేదని కినుక పూజారుల్లో స్పష్టంగా కనిపించింది. ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకే చిలుకల గట్టు నుండి దిగి మేడారానికి బయలు దేరాల్సిన సమ్మక్క 7.16 నిమిషాలకు చిలుకల గట్టునుంచి దిగివచ్చింది. దారి వెంట భక్తుల కోలాహలాన్ని మొక్కుల చెల్లింపులను తిలకిస్తూ చెలపయ్య గుడికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజా తంతును నిర్వహించి మేడారంలోని సమ్మక్క గుడికి తీసుకువచ్చారు.
తల్లుల దర్శనం కోసం పోటీపడిన భక్తులు
గద్దెల పై తల్లీ బిడ్డలు ఆశీనులు కావడంతో వారి దర్శణ భాగ్యం కోసం దేశ నలుమూలల నుండి వచ్చిన భక్తులు పోటీపడ్డారు. సమ్మక్క రాక సందర్భంగా కొద్ది సేపు గద్దెల ప్రాంగణంలో దర్శణాలను నిలిపివేశారు. గద్దెల ప్రాంగణంలోకి అడుగిడుతున్న సమయంలో క్యూలైన్లోని భక్తులు సమ్మవ్వ తల్లి చల్లంగా చూడంటి అంటూ జేజేలు పలుకగా శివసత్తులు క్యూనైన్లలో పూ నకాలతో ప్రాంగణం హోరెత్తింది.