సోమవారం ఉదయం యాగశాల ప్రాంగణంలోని ఆచార్య సన్నిధిలో ప్రధమంగా గురుపరంపర అనుసంధానం జరిగింది. తర్వాత అంగన్యాసం, కరన్యాసం సహిత మంత్ర అనుష్ఠానం భక్తులతో చేయించారు. యాగశాలలో భగవంతుని ఆరాధన సేవా కాలం, శాంతిపాఠం, వేద విన్నపాలు, వేద పారాయణాలు ఆరంభమయ్యాయి. పెరుమాళ్ల పాద తీర్థాన్ని భక్తులందరికీ శ్రీ చినజీయరు స్వామివారు స్వయంగా అనుగ్రహించారు. పూర్ణాహుతి వేద విన్నపాలు, ప్రసాద వితరణ, యాగశాలలో యజమానులకు మంగళా శాసనాలతో కార్యక్రమం సుసంపన్నమైంది.
వసంతోత్సవం
వేదిక మీద యాలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, వట్టి వేరు ప్రధానంగా పసుపు.. ఇలాంటి సుగంధ ద్రవ్యాలతో పెరుమాళ్లకు తిరుమంజనం చేయడమే వసంతోత్సవం. ఇది ఒక ఆనందోత్సవం. నిన్నటి దినం 108 దివ్యదేశాలలోని పెరుమాళ్లు కల్యాణోత్సవం చేయించుకున్నారు. కల్యాణం తర్వాత దంపతులు ఆనంద కోలాహలంగా జరిపించుకునే ఉత్సవం. ఆ దర్శనం భక్తులకు ఎంతో ఆనంద దాయకం. వసంతం అంటే చిగురించడం. వసంతోత్సవంలో ఒకరి మధ్య ఒకరికి అనురాగం, ఆత్మీయత ఏర్పడి మంచి మంచి ఆరోచనలతో భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుని జీవితాన్ని సుఖమయంగా, ఆనంద దాయంగా మలచుకుంటారు. అది పెరుమాళ్లు, తయార్ల మధ్య ఏర్పడితే జీవ కోటికి శ్రేయస్కరం, విశ్వ కల్యాణం. ముందుగా మన క్షేత్ర నాథుడైన శ్రీరామచంద్ర స్వామి వేదికపైకి వచ్చారు. వారికి మామూలుగా జరిగే అభిషేకం పండ్ల రసాలు, పంచామృతాలతో జరుగుతూ ఉంటుంది. వసంతోత్సవంలో కొన్ని పరిమల ద్రవ్యాలను ప్రత్యేకంగా తయారు చేసుకుని స్వామికి సమర్పించారు. మిగిలిన వాటిని భక్తులకు ఇచ్చారు. భక్తులంతా హోలీ పండుగలా కార్యక్రమాన్ని జరుపుకున్నారు. వసంతోత్సవం అంటే ఒక రకంగా స్వామికి జరిగే శీతల ఉపచారం.
సాయంత్రం చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం జరిగింది.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మనవరాలు జూపల్లి ఈడ్య నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది. దీపాంజలి కూచిపూడి నృత్య అకాడమీ శిష్య బృందం కూచిపూడి ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సాక్షాత్తూ ఆదిశేషుని అవతారం అయిన శ్రీ రామానుజాచార్యుల వారు విశష్ట అధ్వైత తత్వాన్ని, అష్టాక్షరీ వైశిష్యాన్ని చాటి చెప్పిన శ్రీ వైష్ణవాచార్యులు. సమానత్వాన్ని, సమతాభావాన్ని జాగృతం చేసిన వారి మహనీయతను కొనియాడుతూ వారి జీవిత చరిత్ర ఆధారంగా రచించి స్వరపరిచిన శ్రీరామానుజ అనే పాటకు ఈడ్య మిత్ర బృందం ఈ ప్రదర్శన ఇచ్చింది. అనంతరం శ్రీ చినజీయర్ స్వామివారు కూచిపూడి నృత్య అకాడమీ శిష్య బృందానికి మంగళ శాసనాలు అందించారు.
రాత్రి 7:30 గంటలకు సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ సేవతో పాటు 18 దివ్యదేశాధీశులకు గరుడసేవలు నిర్వహించారు.
ఈ రోజు దివ్యదేశాధీశులకు జరిగిన 18 గరుడ సేవల వివరాలు
1.తిరుత్తెత్తియంబలం
పెరుమాళ్: శ్రీరంగనాథుడు, శెజ్ఞ్గణ్‌మాల్
అమ్మవార్లు: శెంగమలవల్లి, భూదేవి
2.తిరుక్కావళంపాడి
పెరుమాళ్: గోపాలకృష్ణన్
అమ్మవారు: శెంగమలవల్లి, భూదేవి
3.తిరువెళ్ళక్కుళం
పెరుమాళ్: నారాయణన్, అణ్ణన్ పెరుమాళ్, శ్రీనివాసుడు
అమ్మవార్లు: పూవార్ తిరుమగళ్ నాచ్చియార్/పద్మావతి, భూదేవి
4.పార్థన్‌పళ్ళి
పెరుమాళ్: కమలనాథ పెరుమాళ్/తామరైయాళ్ కేళ్వన్
అమ్మవార్లు: తామరనాయకి, భూదేవి
5.తిరుమాలిరుంశోలై
పెరుమాళ్: సుందరబాహు పెరుమాళ్
అమ్మవార్లు: సుందరవల్లి, కల్యాణవల్లి
6.తిరుక్కోట్టియూర్
పెరుమాళ్: సౌమ్యనారాయణ పెరుమాళ్
అమ్మవారు: తిరుమామగళ్ తాయార్, మహాలక్ష్మి, భూదేవి
7.తిరుమెయ్యం
పెరుమాళ్: సత్యమూర్తి పెరుమాళ్/సత్యగిరినాథన్
అమ్మవారు: భూదేవి
8.తిరుప్పుల్లాణి
పెరుమాళ్: ఆది జగన్నాథ పెరుమాళ్
అమ్మవార్లు: కళ్యాణవల్లి, భూదేవి
9.తిరుత్తంగాల్
పెరుమాళ్: స్థితనారాయణ స్వామి/తణ్‌గాలప్పన్
అమ్మవార్లు: అన్ననాయకి, అనంతనాయకి, అమృతనాయకి, జాంబవతి
10.తిరువాట్టార్
పెరుమాళ్: ఆదికేశవ పెరుమాళ్
అమ్మవార్లు: మరకతవల్లి, భూదేవి
11.శ్రీవిల్లిపుత్తూర్
పెరుమాళ్: వటపత్రశాయి పెరుమాళ్
అమ్మవార్లు: శ్రీదేవి, భూదేవి
12.కూడల్ అళగర్
పెరుమాళ్: కూడల్ అళగర్
అమ్మవార్లు: మధురవల్లి/వకుళవల్లి, మరకతవల్లి తాయార్
13.ఆళ్వార్ తిరునగరి
పెరుమాళ్: ఆదినాథన్ పెరుమాళ్
అమ్మవార్లు: ఆదినాథవల్లి, భూదేవి
14.తొలైవిల్లిమంగలం
పెరుమాళ్: దేవపిరాన్ పెరుమాళ్/అరవిందలోచనుడు
అమ్మవార్లు: కరుంతడంకణ్ణం నాచ్చియార్/అసితేక్షణా, భూదేవి
15.వానమామలై
పెరుమాళ్: దైవనాయక పెరుమాళ్
అమ్మవార్లు: శరీవరమంగై తాయార్/శ్రీదేవి, భూదేవి
16.తిరుప్పుళింగుడి
పెరుమాళ్: కాయ్‌శినభూపతి/కాయ్‌శిన వేన్దన్ పెరుమాళ్
అమ్మవార్లు: పద్మవాసినీ/పుళింగుడివల్లి, భూదేవి
17.తెన్‌తిరుప్పేరై
పెరుమాళ్: మకర కుండలధర పెరుమాళ్/మకర నెడుంకుళైక్కాదన్,ముగిల్‌వణ్ణన్
అమ్మవార్లు: కుళైక్కాదవల్లి, భూదేవి
18.శ్రీవైకుంఠం
పెరుమాళ్: వైకుంఠనాథ పెరుమాళ్అమ్మవార్లు: వైకుంఠవల్లి, భూదేవి
రాత్రి నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు.