ఈ రోజు ఉదయం యాగశాల ప్రాంగణంలోని ఆచార్య సన్నిధిలో ప్రధమంగా గురుపరంపర అనుసంధానం జరిగింది. తర్వాత అంగన్యాసం, కరన్యాసం సహిత మంత్ర అనుష్ఠానం భక్తులతో చేయించారు. యాగశాలలో భగవంతుని ఆరాధన సేవా కాలం, శాంతిపాఠం, వేద విన్నపాలు, వేద పారాయణాలు చేశారు. పూర్ణాహుతి వేద విన్నపాలు, ప్రసాద వితరణ, యాగశాలలో యజమానులకు మంగళా శాసనాలతో కార్యక్రమం సుసంపన్నమైంది. ఆ తర్వాత నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు జరిపించారు.
సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు కార్యక్రమ విశిష్టత- ఆచార్య వరివస్య
రామానుజుల స్వామివారికి 108 దివ్యదేశాల దగ్గరి నుంచి మాలలు స్వామి వారికి అనుగ్రహించారు. రామానుజస్వామివారిని భగవంతుడే స్వయంగా ఆచార్యులుగా స్వీకరించారు. శ్రీరంగం క్షేత్రంలో వారి ద్వారా తన సన్నిధానాన్ని సంస్కరింపజేసుకున్నారు. తిరుమలలో శంకుచక్రాలే తీసుకున్నారు. తిరుక్కుంగుడి క్షేత్రంలో నామ సంస్మరణ చేయించుకున్నారు. ఆచార్యులుగా స్వీకరించడమే కాకుండా ప్రతిరోజు తీర్థగోష్ఠి జరిగేటప్పుడు రామానుజులవారి దివ్య ఆజ్ఞ అని స్మరించుకుంటారు. రామానుజుల దివ్య ఆజ్ఞ అన్ని ఆలయాల్లో చెల్లుబాటు అవుగాక అని తిరుమలలో ఉన్న వెంకటేశ్వరస్వామి చెప్పిన ఆదేశం. సాక్షాత్తు భగవంతుడే రామానుజుల వారిని ఆచార్యులుగా స్వీకరించారు కాబట్టి ఇక్కడ 108 దివ్యదేశాల్లో ఉండే పెరుమాళ్లు రామానుజులచారులకు వారి శేష మాలను పంపించి మర్యాద చేశారు. దీనికి ఆచార్య వరివస్య అని పేరు. వరివస్య అంటే సేవ లేదా పూజ అని అర్థం. సంస్కృతంలో వరివస్య అని వాడుతారు. ఈ పదం పెద్దగా ప్రసిద్ధం కాలేదు. రంగరామానుజ స్వామి వారు దాన్ని ప్రవేశపెట్టారు. మనం కూడా అనేక కార్యక్రమాల్లో పెద్దల్ని సేవించేపటప్పుడు ఈ పదాన్ని వాడుకుంటున్నాం. ఇప్పుడు ఆచార్య వరివస్యగా పెరుమాళ్లంతా రామానుజులవారికి మర్యాద పంపించే కార్యక్రమం జరిగింది. స్వామికి పూలమాలలు అర్పించిన తర్వాత వాటిని భక్తులకు ప్రసాదించారు.
మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు చేసిన నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయనాలకై ఉదకశాంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై తమ పిల్లలకు ఉపనయనం కార్యక్రమం జరిపించుకున్నారు.
రాత్రి సాకేత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ నిర్వహించారు. అనంతరం 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు జరిపించారు.
ఈ రోజు దివ్యదేశాధీశులకు జరిగిన 18 గరుడ సేవల వివరాలు (73-90 దివ్యదేశాల పెరుమాళ్లు)
1.తిరుక్కోవలూర్
పెరుమాళ్: దేహళీశ పెరుమాళ్/ఆయనార్
అమ్మవార్లు: పుష్పవల్లి, భూదేవి
2.తిరువనంతపురం
పెరుమాళ్: అనంత పద్మనాభ పెరుమాళ్
అమ్మవారు: శ్రీహరిలక్ష్మీ, భూదేవి
3.అష్టభుజం
పెరుమాళ్: ఆదికేశవ పెరుమాళ్/అష్టభుజకరత్తాన్
అమ్మవార్లు: అలర్ మేల్ మంగైతాయార్, భూదేవి
4.తిరుత్తణ్‌కా
పెరుమాళ్: దీపప్రకాశ పెరుమాళ్
అమ్మవార్లు: మరకతవల్లీతాయార్, భూదేవి
5.తిరువేళుకై
పెరుమాళ్: ముకుందనాయక పెరుమాళ్/ముకుందనారసింహస్వామి
అమ్మవార్లు: వేళుక్కవల్లీతాయార్, భూదేవి
6.పాడగం
పెరుమాళ్: పాండవదూత పెరుమాళ్,అభయ, వరద హస్తధారీ
అమ్మవార్లు: రుక్మీణి, సత్యభామ
7.నీరగం
పెరుమాళ్: జగదీశ్వర పెరుమాళ్
అమ్మవార్లు: నిలైమంగవల్లీ తాయార్/వాసవల్లి, భూదేవి
8.నిలాత్తింగళ్ తుణ్డమ్
పెరుమాళ్: పూర్ణచంద్ర ప్రభ పెరుమాళ్/నిలాత్తింగళ్ తుణ్ణత్తాన్
అమ్మవార్లు: అనుపమనాయకి/వేరొరువన్ఱిల్లా తాయార్, భూదేవి
9.ఊరగం
పెరుమాళ్: ఉలగళన్ద పెరుమాళ్/జగద్విక్రాంత పెరుమాళ్/ఊరగత్తాన్
అమ్మవార్లు: అమృతవల్లీ తాయార్, భూదేవి
10.తిరువెహ్‌కా
పెరుమాళ్: యథోక్తకారి పెరుమాళ్/శొన్నవణ్ణం శెయ్‌ద పెరుమాళ్
అమ్మవార్లు: కోమలవల్లి, భూదేవి
11.కారగం
పెరుమాళ్: కరుణాకర పెరుమాళ్
అమ్మవార్లు: పద్మామణివల్లి, భూదేవి
12.కార్వానమ్
పెరుమాళ్: నవనీతచోర పెరుమాళ్/కణ్ణన్ పెరుమాళ్
అమ్మవార్లు: కమలవల్లి, భూదేవి
13.కళ్వనూర్
పెరుమాళ్: ఆది వరాహస్వామి/కళ్వర్ పెరుమాళ్
అమ్మవార్లు: అంశిలైవల్లీ తాయార్, భూదేవి
14.పవళవణ్ణం
పెరుమాళ్: ప్రవాళ వర్ణ పెరుమాళ్/పవళవణ్ణ పెరుమాళ్
అమ్మవార్లు: ప్రవాళవల్లీ తాయార్, భూదేవి
15.పరమేశ్వర విణ్ నగరం
పెరుమాళ్: వైకుంఠనాథ పెరుమాళ్
అమ్మవార్లు: వైకుంఠనాయకి/భూదేవి
16.తిరుప్పుట్‌కుళ
పెరుమాళ్: విజయరాఘవ పెరుమాళ్
అమ్మవార్లు: మరకతవల్లీ తాయార్, భూదేవి
17.తిరునిన్ఱవూర్
పెరుమాళ్: భక్తవత్సల పెరుమాళ్/పత్తరావి ప్పెరుమాళ్
అమ్మవార్లు: ఎన్నై పెత్తతాయ్, భూదేవి
18.తిరువళ్ళూర్
పెరుమాళ్: వీరరాఘవ పెరుమాళ్
అమ్మవార్లు: కనకవల్లీ తాయార్, భూదేవి
రాత్రి నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు.