ఉదయం యాగశాల ప్రాంగణంలోని ఆచార్య సన్నిధిలో ప్రధమంగా గురుపరంపర అనుసంధానం జరిగింది. తర్వాత అంగన్యాసం, కరన్యాసం సహిత మంత్ర అనుష్ఠానం భక్తులతో చేయించారు. యాగశాలలో భగవంతుని ఆరాధన సేవా కాలం, శాంతిపాఠం, వేద విన్నపాలు, వేద పారాయణాలు ఆరంభమయ్యాయి. పెరుమాళ్ల పాద తీర్థాన్ని భక్తులందరికీ శ్రీ చినజీయరు స్వామివారు స్వయంగా అనుగ్రహించారు. పూర్ణాహుతి వేద విన్నపాలు, ప్రసాద వితరణ, యాగశాలలో యజమానులకు మంగళా శాసనాలతో కార్యక్రమం సుసంపన్నమైంది. ఆ తర్వాత నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు జరిపించారు.
ఈ సందర్భంగా శ్రీ చినజీయరు స్వామి మాట్లాడుతూ నేడు 12 మంది ఆళ్వార్లలో నాలుగవ వారుగా ప్రసిద్ధిగాంచిన తిరుమొజిషై ఆళ్వార్ తిరునక్షత్రం (పుట్టిన రోజు) అని, అతను మేదరి కులానికి చెందిన ఆళ్వార్‌ను భక్తిసారముని అనికూడా అంటారు. ఒకప్పుడు మంత్రాలు బ్రాహ్మణులకే పరిమితం అయ్యేవి, అందరికీ వినిపించేలా చదివేవారు కాదు. ఒక రోజు కొందరు పండితులు వేదమంత్రాలు వల్లిస్తుంటే ఆ దారి గుండా తిరుమొజిషై ఆళ్వార్ రావడం గమనించి ఆ పండితులు మంత్రాలు చదవడం ఆపివేశారని చెప్పారు. అతను వారిని దాటవేసి వెళ్లాక తిరిగి మంత్రాలు చదువుదామంటే వారికి గుర్తుకురాలేదు. తిరుమొజిషై ఆళ్వార్ అది గమనించి పక్కనే ఉన్న ఒక గడ్డిపోచను విరిచి వారికి చూపిస్తారు. అది చూశాక వారికి మంత్రం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ మంత్రంలో గడ్డిని విరవడం అని ఉంటుంది. తిరుమొజిషై ఆళ్వార్‌లో ఉన్న భక్తి, జ్ఞానాన్ని ఆ పండితులు గుర్తిస్తారు. ఏ కులంలో ఉన్నా జ్ఞానం ముఖ్యం అని తెలుసుకుంటారు. అప్పటి నుంచి ఆళ్వార్లు అందరూ రాసిన పాశురాలతో పాటు తిరుమొజిషై ఆళ్వార్ రాసిన పాశురాలను భగవంతుడికి విన్నవిస్తూ.. భక్తులకు వినిపిస్తూ సేవలు జరుపుతారు. ఆళ్వార్ల దివ్య ప్రబంధంలో వీరు పాడిన పాటలకు చోటు లభించింది. అందుకే శ్రీ రామానుజులవారు ఆలయాల్లో పాటించే ఈ సమతను ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమదృష్టి ఎలా ఉండాలో నేర్పించారు. అందుకే సమతా మూర్తి చుట్టూ 108 దివ్యదేశాలు వెలిశాయి.
18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ
శ్రీ చినజీయరు స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేదికపై నిన్న సాయంత్రం గరుడ వాహనంపై వేంచేసిన 37 నుంచి 54 వరకు ఉన్న 18 మంది దివ్యదేశ పెరుమాళ్లకు ఉత్సవ శ్రమ పరిహారార్దం పంచకలశ స్పపన కార్యక్రమం ప్రారంభమైంది. ఏకంగా 18 రూపాల్లో తిరుమంజనం జరపడం అనేది అరుదు.
జీయర్ స్వామి మాట్లాడుతూ ఆలయాలు పవిత్రతకు చిహ్నం అన్నారు. ఆలయ వ్యవస్థ ప్రాచీనమైనదని, సనాతనమైనదన్నారు. కాల క్రమేణా వ్యవస్థలో ఏర్పడిన లోపాలను సవరించి రామానుజాచార్య స్వామి ఆలయ వ్యవస్థను పునరుద్ధరించారు. బద్ధమైన ఆరాధనా క్రమాన్ని నిర్దేశించారు. సవ్యమైన ఆలయ వ్యవస్థ సమాజానికి శ్రేయదాయకం అన్నారు.
విశేష ఉత్సవాల్లో భాగంగా డోలోత్సవం నిర్వహించారు.
డోలోత్సవాన్ని దర్శిస్తే గృహ దోషాలు తొలగిపోతాయని శ్రీ చినజీయర్ అన్నారు.
ముందుగా చతుర్వేద పారాయణం, తర్వాత సంకీర్తనం పాడారు. అర్చక స్వాములు, జీయరు స్వాములు పెరుమాళ్లకు ఊయలలు ఊపారు. తదుపరి విచ్చేసిన భక్తులందరితో పెరుమాళ్లకు ఊయలలూపే భాగ్యాన్ని శ్రీశ్రీశ్రీ స్వామివారు అనుగ్రహించారు.
ఆకాశమే పైకట్టుగా మనసే ఊయలగా మనయొక్క శ్రద్ధయే త్రాడుగా ఊయలలూపామన్నారు. భగవంతుని ఎప్పుడూ మనసులో ఊపాలని అలా చేయాలంటే మంచి గృహ వాతావరణం, అందరూ కలిసి మెలిసి ఉండటం, మంచి మనసు, మంచి బుద్ధి, మంచి సేవ చేసుకునే భాగ్యాన్ని స్వామివారు మంగళా శాసనాల ద్వారా మనకు కలగజేశారని జీయర్ అన్నారు. అంతేకాకుండా భక్తుల ప్రేమను భగవంతుడు తట్టుకోవాలన్నారు. ఆ తర్వాత స్వామికి ఉపచారం ఇచ్చి నాలుగు వేద పారాయణాలు చేసి స్వామివారిని నిద్రపుచ్చారు.
సాయంత్రం చిన్నారులు చేసిన నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఆ తర్వాత చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం జరిగింది.
సాయంత్రం 6:30 గంటలకు సాకేత రామచంద్రస్వామి, 18 దివ్యదేశ మూర్తులు 18 గరుడలపై యాగశాల ప్రవేశం చేశారు.
రాత్రి 7 గంటల నుంచి సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవతో పాటు 18 దివ్యదేశాధీశులకు గరుడ సేవలు నిర్వహించారు.
ఈ రోజు 18 దివ్యదేశ మూర్తులకు జరిగిన గరుడ సేవల వివరాలు
1.నత్తం
పెరుమాళ్: విజయాసన పెరుమాళ్
అమ్మవార్లు: వరగుణమంగై నాచ్చియార్, భూదేవి
2.పెరుంకుళం
పెరుమాళ్: వేంగడవాణన్
అమ్మవారు: కుళందవల్లీ తాయార్
3.తిరుక్కురుంగుడి
పెరుమాళ్: వైష్ణవ నమ్బి స్వామి (5 రూపాల్లో ఉంటారు)
అమ్మవార్లు: కురుంగుడివల్లి, భూదేవి
4.తిరుక్కోళూర్
పెరుమాళ్: వైత్తమానిధి పెరుమాళ్
అమ్మవార్లు: కుముదవల్లి, కోళూర్‌వల్లి
5.కాంచీపురం
పెరుమాళ్: వరదరాజ స్వామి
అమ్మవార్లు: పెరుందేవి తాయార్, భూదేవి
6.తిరువణ్ పరిశారం
పెరుమాళ్: శ్రీవాసవక్ష పెరుమాళ్/తిరువాళ్ మార్పన్
అమ్మవార్లు: కమలవల్లీ తాయార్, భూదేవి
7.తిరుక్కాట్కరై
పెరుమాళ్: కాట్కరై అప్పన్/వామనుడు
అమ్మవార్లు: పెరుంశెల్వనాయకి, భూదేవి
8.తిరుమూళక్కళం
పెరుమాళ్: శ్రీసూక్తినాథుడు/సిద్ధినాథ
అమ్మవార్లు: మధురవేణి, భూదేవి
9.పులియూర్
పెరుమాళ్: ఆశ్చర్యోపకారక పెరుమాళ్/మాయప్పిరాన్
అమ్మవార్లు: కనకలతా/పొఱ్కొడి నాయకి, భూదేవి
10.శెంగనూర్
పెరుమాళ్: దేవదేవ పెరుమాళ్/ఇమైయవరప్పన్
అమ్మవార్లు: శెంకమలవల్లి, భూదేవి
11.తిరునావాయ్
పెరుమాళ్: సుందరదేవ స్వామి/నావాయ్ ముకుందన్
అమ్మవార్లు: మలర్‌మంగై తాయార్, భూదేవి
12.తిరువల్లవాళ
పెరుమాళ్: కోలప్పిరాన్/సుందర ఉపకారకస్వామి
అమ్మవార్లు: వాత్సల్యనాయకి/శెల్వత్తిరు క్కొళన్దు నాచ్చియార్,భూదేవి
13.తిరువణ్‌వండూర్
పెరుమాళ్: పాంబణైయప్పన్/కమలనాథ పెరుమాళ్
అమ్మవార్లు: కమలవల్లి, భూదేవి
14.తిరుమోగూర్
పెరుమాళ్: కాలమేఘ పెరుమాళ్
అమ్మవార్లు: మోహనవల్లి/మేఘవల్లి, తిరుమోగూర్ వల్లి
15.విత్తువక్కోడు
పెరుమాళ్: అభయప్రదస్వామి/ఉయ్యవంద పెరుమాళ్, అభయప్రదన్
అమ్మవార్లు: విత్తువక్కోడు వల్లీ తాయార్/పద్మాసనివల్లీ తాయార్
16.తిరుక్కడిత్తానం
పెరుమాళ్:అద్భుత నారాయణ పెరుమాళ్
అమ్మవార్లు: కల్పకవల్లీ తాయార్
17.తిరువారన్‌విళై
పెరుమాళ్: ఉపకారక వామన స్వామి/తిరుక్కురళప్పన్
అమ్మవార్లు: పద్మాసనవల్లీ తాయార్, భూదేవి
18.తిరువహీంద్రపురం
పెరుమాళ్: దేవనాథ పెరుమాళ్
అమ్మవార్లు: హేమాంబుజవల్లి, వైకుంఠవల్లి, భూదేవి
రాత్రి నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు.