Saturday, November 23, 2024

సమతా కుంభ్‌- 2023 మ‌హోత్స‌వం

శ్రీ రామానుజాచార్య – 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు

శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3-2-2023 శుక్రవారం రోజున నిత్య కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 5:45 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ జరిగింది. 6 గంటల నుంచి 6:30 గంటల వరకు అష్టాక్షరీ మంత్ర జపం నిర్వహించారు. ఉదయం 6:30 గంటల నుంచి ఆరాధన, సేవా కాలంలో భాగంగా శాత్తుముఱై జరిపించారు. అనంతరం తీర్థప్రసాద గోష్టిలో భక్తులు పాల్గొన్నారు. చినజీయర్‌స్వామి గారి ఆధ్వర్యంలో నిత్య పూర్ణాహుతి, బలిహరణ జరిపించారు. విశేషోత్సవాల్లో భాగంగా ఈరోజు సాకేత రామచంద్ర ప్రభువుకు సూర్యప్రభ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. దివ్యసాకేతం నుంచి స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ వరకు వేడుక సాగింది. అనంతరం యాగశాలలో చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో ధ్వజారోహణం జరిపించారు.

ఆవాహం చేసిన కలశాలతో పాటు గరుడ పటాన్ని తీసుకుని దివ్యసాకేతుని క్షేత్రం నుంచి యాగశాలకు వచ్చారని, బ్రహ్మోత్సవాలకు ప్రధానమైనకర్తగా గరుడ భగవానుడు ఉంటారని చినజీయర్‌ స్వామి అన్నారు. యాగశాలల ముందుగా పూర్ణాహుతి నిర్వహించి అనంతరం ధ్వజస్తంభంపై ఆవిష్కరింప జేశారు. 108 దివ్యదేశాల్లో ఉన్న స్వాములంతా పుట్టి ఏడాదే అయిందని, వారందరికి అధిపతి అయిన శ్రీరామచంద్రుడు దగ్గరుండి అందరినీ నడిపిస్తారని అన్నారు. సాయంత్రం దేవతాహ్వానం జరుగుతుందని, వచ్చి ఆశీర్వదించాలని దేవతలను వేడుకుంటారని చినజీయర్‌స్వామి అన్నారు. గరుడికి నివేదించిన ప్రసాదాన్ని సంతానార్థులకు అందజేశారు. గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి శ్రీరామచంద్రుడు ఆవిష్కరింపజేసి ఆ తర్వాత ఆయన స్థానం యాగశాలకు విచ్చేశారు. శ్రీ స్వామివారు స్వయంగా తమ స్వహస్తాలతో సంతానం కావాలనుకునే వారికి సంప్రోక్షణ చేసి గరుడ ప్రసాదాన్ని అందించారు.

రంగరామానుజాచారి మాట్లాడుతూ.. గానం చేస్తూ బిగ్గరగా ఆవిష్కరించేవాడే గరుత్మంతుడని అన్నారు. భగవంతుడికి మొట్టమొదటి వాహనం గరుడ, మనలోనే గరుడు కొలువై ఉన్నాడని చెప్పారు. యాగశాలలో ఆహ్వానంతో పాటు అగ్నిప్రతిష్ఠ జరిపించారు. అగ్నిప్రతిష్ఠలో మొదటగా పశ్చిమవైపు ఉండే గుండ్రటి కుండాల్లో జరుగుతుందని, క్రమంగా అగ్నిని పెంచి తూర్పు, దక్షిణం, ఉత్తరంవైపు ఉండే కుండాల్లోకి వ్యాపింపజేస్తారు. ఆ తర్వాత హోమ కార్యక్రమాలు ఆరంభం అవుతాయని చినజీయర్‌స్వామి అన్నారు. వేదదివ్య ప్రబంధ ఇతిహాస పురాణాదుల యొక్క ప్రారంభం జరుగుతుందని చెప్పారు. శాంతిపాఠంతో ఆరంభం చేసుకుంటామని అన్నారు.

రెండోరోజు మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపాఠం (శాత్తుముఱై) ప్రారంభమైంది. ఏపూటకు ఆపూట చేసే కార్యక్రమాల్లో చివరిగా అగ్నిలో సమర్పించే కార్యక్రమాన్ని పూర్ణాహుతి అంటారని చిన్నజీయర్‌స్వామి అన్నారు. అలాగే స్వామికి విన్నవించేదాన్ని శాంతిపాఠం అంటామని చెప్పారు. పూర్ణాహుతిలో సమర్పించే ద్రవ్యాలను సంకల్పం చేసిన భక్తులకు అందిస్తారని. యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆ ద్రవ్యాలను అక్కడి రుత్వికులకు అందజేస్తారని స్వామి చెప్పారు. ప్రతిరోజు కార్యక్రమం చివరిలో జరిగే తంతును నిత్య పూర్ణాహుతి అంటారని, 12వ రోజున జరిగే కార్యక్రమాన్ని మహాపూర్ణాహుతి అంటారని తెలిపారు.

- Advertisement -

యాగశాల చుట్టూ ధ్వజాలు అంటే జెండాలు కడతామని, రాజకీయ పార్టీలకు ఒక్కో పార్టీకి ఒక్కో రంగు ఉంటుందని, కొన్ని పార్టీలకు రెండు రంగులు కూడా ఉంటాయని అలాగే దేవతలకు కూడా ఒక్కో వర్ణం ఉంటుందని చినజీయర్‌ స్వామి అన్నారు.
యాగశాలలోని నాలుగు ద్వారాలకు పాలకులు ఉంటారని, ధ్వజానికి, తోరణానికి పాలకులు ఉంటారని వారికి పూర్ణాహుతి అయిన తర్వాత బలిహరణ కార్యక్రమం జరుగుతుందని చిన్నజీయర్‌స్వామి అన్నారు. ద్వారపాలకులకు అధిపతిగా ఉండే స్వామి యాగశాలలో వేంచేసి పరిశీలన చేస్తారని చెప్పారు. యాగశాలలోని కార్యక్రమానికి పెద్దగా శ్రీరామచంద్రప్రభు ఉంటారని అన్నారు.

రెండోరోజు – 03-02-2023 – శుక్రవారం) కార్యక్రమం వివరాలు..
ఉదయం : 5:45 గంటలకు – సుప్రభాతం.
6:00 – 6:30 – అష్టాక్షరీ మంత్రం జపం.
6:30am – 7am – ఆరాధన, సేవా కాలం.
7:30am-9am-శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్ఠి.
9am-10am-నిత్య పూర్ఱాహుతి & బలిహరణ.
10:30am-11:30am-18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ.
11:30am-1pm -విశేష ఉత్సవములు.
1:30pm-4:30pm సాంస్కృతిక కార్యక్రమాలు.
సాయంత్రం : 5pm-5:45pm శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్ర సామూహిక పారాయణం.
6pm -7:30pm-సాకేత రామచంద్ర స్వామి మ‌రియు 18 దివ్య దేశ మూర్తులు – 18 గరుడలపై యాగశాల ప్రవేశం
7:30pm-8pm-నిత్య పూర్ణాహుతి.
8pm-9pm-తిరువీధి సేవ, మంగళా శాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి.

విశేషోత్సవ వివరాలు
ఉదయం : 7:30 – సాకేత రామచంద్ర ప్రభువుకు సూర్యప్రభ వాహన సేవ.. దివ్యసాకేతం నుంచి ఎస్ వోఈ వరకు
ఉద‌యం 8 -మ‌ధ్యాహ్నం 1:30 -యాగశాలలో ధ్వజారోహణం, మధ్యాహ్నం 1:30 గంటలకు అగ్నిప్రతిష్ఠ, వేదశాంతి, నిత్యపూర్ణాహుతి, తీర్థ, ప్రసాద గోష్ఠి.
సాయంత్రం 5:00 – సాయంత్రం 5:45 – శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ, యాగశాలలో ఆరాధనలు, భేరీతాడనం, దేవతాహ్వానం.
సాయంత్రం 6ః00 – రాత్రి 8:30 – సాకేత రామచంద్ర ప్రభువుకు చంద్రప్రభ వాహన సేవ, దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు.
రాత్రి 8:30 -హారతి, శాత్తుముఱై, తీర్థ, ప్రసాద గోష్ఠి.

Advertisement

తాజా వార్తలు

Advertisement