సమతామూర్తి ప్రాంగణంలో పర్యటించిన సీఎం కేసీఆర్
విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పరిశీలన
ప్రపంచ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రమిదే
హైదరాబాద్‌లో స్థాపించడం అద్భుతం
ప్రపంచానికే సమతా దార్శనికుడు రామానుజుడు
వెయ్యేండ్ల క్రితమే మానవులంతా సమానమన్న మహనీయుడు : ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: అనతికాలంలోనే రామానుజ సమతామూర్తి వేదిక ప్రపంచ ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందనున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రామానుజాచార్యుల వారికి ఉన్న కోట్లాది మంది భక్తులకు భారతదేశంలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ప్రాంతం వర్థిల్లనున్నదని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రామానుజాచార్యులు వెయ్యేళ్ల కిందటే ప్రపంచానికి సమతాస్ఫూర్తిని చాటారని, ఈ సమాతామూర్తి ప్రాంగణం తెలంగాణకే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని కేసీఆర్ కీర్తించారు. మానవ సమా జానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతో కూడిన శ్రీరామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచానికి సమతా దార్శనికుడైన రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో స్థాపించడం అద్భుతమని అన్నారు. చినజీయర్ స్వామి, వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకు సంబంధించి మహా అద్భుతమైన కృషి చేసారని సీఎం కొనియాడారు. ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రాంగణాన్ని గురువారం సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి తన కుటీరంలోకి సీఎం కేసీఆర్ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమాల ఏర్పాట్ల గురించి జీయర్ స్వామిని సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రామాను జాచార్యులు భక్తి ఉద్యమంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారని, మానవులందరూ సమానమని, సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన దేవాల యాలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక స్వాంతన మానసిక ప్రశాంతత చేకూరుస్తుందన్నారు. పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాం తత కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది ప్రశాంత నిలయంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.
సమతామూర్తి విగ్రహ స్థాపన దేశం గర్వించదగిన గొప్ప నిర్మాణానమని, సమానత్వం కోసం రామానుజాచార్యులు తెలిపిన ప్రవచనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో నిబద్ధతతో అనుసరించడం గొప్ప విషయమని సీఎం అన్నారు. తెలంగాణ వేదికగా తిరిగి వెయ్యేండ్ల తర్వాత ఆ మహామూర్తి బోధనలు మళ్లి మరింత ప్రాచుర్యంలోకి రావడంతో పాటు, అవి మరో వెయ్యేండ్ల పాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకా రణమని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
హిందూ ధర్మాన్ని అనుసరించే ఆధ్యాత్మిక భక్తులకు, ధార్మికు లకు ముచ్చింతల్‌లో సకల వసతులు సమకూర్చడం సంతోష కరమని, ఈ పుణ్యక్షేత్రం భవిష్యత్తులో మరింత సుందర మనోహర భక్తిపారవశ్యం నింపే దివ్యక్షేత్రంగా అలరారనున్నదని సీఎం కేసీ ఆర్ అన్నారు. స్ఫూర్తిస్థలి అయిన తెలంగాణ గడ్డమీద ఆరం భమవుతున్న రామానుజుల వారి సమతా స్ఫూర్తిని అంది పుచ్చుకొని తెలంగాణ ముందుకు సాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సాంస్కృతిక, సంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను తాము కొనసాగిస్తామని అన్నారు.
రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపనకైన మొత్తం ఆర్థిక వనరులను సమకూర్చు కోవడం, అన్ని రకాల ఏర్పాట్లను స్వయంగా జీయర్ స్వామియే దగ్గరుండి చూసుకోవడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ఈ మహాకార్యంలో తమ శక్తివంచన లేకుండా పని చేస్తున్న చినజీయర్ స్వామి మిషన్‌కు శతసహస్ర వందనాలు తెలు పుతున్నానని అన్నారు. సమారోహ కార్యక్రమ సందర్భంగా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి చూసుకుంటు న్నదని చినజీయర్ స్వామికి మరోమారు సీఎం వెల్లడించారు. ఈ విశిష్ట సమారోహానికి హాజరవుతున్న ముఖ్య అతిథులకు కావా ల్సిన ఏర్పాట్ల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుం దని సీఎం వివరించారు. తమ కుటుంబం తరపున ఈ మహా ఉత్సవానికి వచ్చే పండితులు, భక్తుల కోసం ఫలాలు, ప్రసాదాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
రామానుజ సహస్రాబ్ధి సమారోహాల నేపథ్యంలో అన్ని ఏర్పా ట్లను తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తగా సమకూర్చ డం పట్ల చినజీయర్ స్వామి సంతోషం వ్యక్తం చేశారు. క్షేత్ర సందర్శన కు విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులను తన కుటీరానికి సాదరంగా ఆహ్వానించిన చినజీయర్ స్వామి సహస్రాబ్ధి ఉత్సవాల కార్యక్ర మాలను వారికి వివరించారు. యాగ నిర్వహణలో తమిళనాడు, కర్ణాటక, తిరుపతి నుంచే కాకుండా నేపాల్ తదితర దేశాల నుండి, దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ క్షేత్రాల నుంచి కూడా వేద పండితులు తరలివచ్చి మమేకమయ్యారని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ప్రభుత్వం రవాణా సౌకర్యాలు కల్పించడం సంతోషకరమన్నారు. ఈ ఉత్సవాలకు తరలివస్తున్న భక్తుల కోసం స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయన్నాయని త్రిదండి చినజీయర్ స్వామి ఆనందం వ్యక్తం చేసారు. అన్నీ పద్ధతి ప్రకారం సాగుతున్నాయని రెవెన్యూ, పోలీసు, విద్యుత్, నీరు, శాని టైజేషన్ తదితర అన్ని శాఖలు సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్ప టికే కార్యక్రమాలు పురోగతిలో ఉన్నాయని, ఎటువంటి ఇబ్బం దులు లేవని అన్నారు. ఈ పదిరోజుల పాటు నిర్వహించునున్న కార్యక్రమాలను సీఎం కేసీఆర్ దంపతులకు చినజీయర్ స్వామి స్వయంగా వివరించారు.
సీఎం పర్యటన వివరాలు
చినజీయర్ స్వామి కుటీరానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కార్య క్రమ ఏర్పాట్లపై స్వామిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చిన జీయర్ స్వామి ఆశీర్వచనాలు తీసుకున్న అనంతరం ఏర్పాట్ల పరిశీ లన చేస్తూ ఆ ప్రాంగణమంతా కలియదిరిగారు. భద్ర వేదికపై ఆసీ నులైన భగవత్ రామానుజుల వారి విరాట్ సమతామూర్తి విగ్ర హాన్ని సందర్శించి చినజీయర్ స్వామితో కలిసి ప్రదక్షిణ చేశారు. గురువారం నుంచి అగ్ని ప్రతిష్ట, హోమాలు ప్రారంభమైన నేప థ్యంలో అగ్నిప్రతిష్ట ప్రారంభ సూచికగా 1260 కిలోల బరువుతో, నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన మహా గంటను మోగించి, గంటా నాదం చేశారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించబోయే బంగారు ప్రతిమ ప్రతిష్ఠ స్థలాన్ని పరిశీలించి, రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రను తెలియజేసే పెయింటింగ్స్‌ను సీఎం కేసీఆర్ తిల కించారు. 108 ఆలయాలతో నిర్మించిన దివ్యదేశ ఆలయాల సమూహాన్ని చినజీయర్ స్వామితో కలిసి సందర్శించిన ఆయన ఆయా ఆలయాల విశిష్టతను సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. సుందరంగా తీర్చిదిద్దిన ఉద్యానవనాన్ని సీఎం పరిశీలించారు. సాత్విక ఆహారాన్ని అందించే ఆహారశాలను చినజీయర్ స్వామితో కలిసి సీఎం ప్రారంభించారు. ప్రవేశద్వార భవనంలో అత్యంత ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ప్రివ్యూ థియేటర్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రామానుజుల జీవిత చరిత్రను తెలి యజేస్తూ రూపొందించిన లఘు చిత్రాన్ని సీఎం దంపతులు వీక్షిం చారు. రాష్ట్రపతి, ప్రధాని పర్యటనల నేపథ్యంలో ఏర్పాటు చేసిన భద్రత, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం పరిశీలించారు. భద్రత ఏర్పాట్ల గురించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, ఆధ్యాత్మికవేత్త, మైహోం అధినేత జూపూడి రామేశ్వరరావు, ఎంపీ సంతోష్ కుమార్, ముఖ్యమంత్రి మనవడు హిమాన్షు రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్‌రావు, ఏపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
తాతకు తగ్గ మనవడు
చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం మంచి అలవాటని కల్వకుంట్ల హిమాన్షు రావును చినజీయర్ స్వామి ఈ సందర్భంగా ఆశీర్వదించారు. ”తాత కేసీఆర్ నుంచి ఆధ్యాత్మికత, భక్తిప్రపత్తుల విషయాల్లో వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నావని” అభినందించారు.