Friday, November 22, 2024

సకల పాపహారి సాలగ్రామ జలం

తీర్థయాత్రలు చేయని వారి జీవితాలు వ్యర్థమనీ, అవి చేసిన వారి జీవితం ధన్యమనీ నారద మహర్షి మహాభారతం అరణ్యపర్వంలో ధర్మరాజుకు చెప్పి వివిధ తీర్థాలు, వాటిని సేవిస్తే కలిగే ఫలితాలు ఎంతో వివరంగా ఆయనకు ఉపదేశించాడు.
సూర్యోదయానికి ముందే చక్కగా ప్రవహించే నదులలో స్నానం ఆచరిస్తే అది మనకు ఇహపర సాధకము అని పెద్దలు అంటారు. గంగ, యమున, గోదావరి వంటి పుణ్య నదులు, జీవ నదులలో స్నానం చేయడం ద్వారా మన శారీరక, మానసిక మలినాలు వదులుతాయట. నదుల నీళ్ళ వలన శరీరం శుభ్రప డటం మనకు తెలుస్తుంది. అంతేకాదు. ఆ ప్రవాహం శరీర మంత టినీ తాకి మన నరాలకు, కండరాలకు ఉన్న జడత్వాన్ని వదలగొట్టి, వాటికి ఉత్తేజాన్నిస్తుంది. ఇది వైద్య శాస్త్రం, శరీర విజ్ఞాన శాస్త్రం కూ డా అంగీకరించింది. అందుకే తరచుగా నదీస్నానాలు చేయా లంటారు. ఆరోగ్యాన్ని చేకూర్చి, అప మృత్యువును తొలగించే సుల భమైన, ఆహ్లాదకరమైన ఉపాయమిది. నదీస్నానాలకు వెళ్ళలేని వారు ఇంట్లోనైనా సూర్యోదయానికి ముందే నిద్రలేచి రోజూ స్నానం చేస్తే ‘అఘమర్షణ స్నాన” ఫలితం లభిస్తుందనీ (అఘము అంటే పాపము. యజ్ఞయాగాదుల సమయంలో, దీక్షావిరమణ సమ యాలలో, కార్తిక, మాఘ మాసాలవంటి విశేష పుణ్యకాలాలలో పాపాలను కడిగివేసే మంత్ర ఘోషల నడుమ చేసే పుణ్య స్నానాలను అఘమర్షణ స్నానాలంటారు). బావి వద్ద స్నానం ద్విగుణం, చెరువులో స్నానం చతుర్గుణం, నదీస్నానం శత గుణం, గంగా స్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశత ఫలాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. స్నాన సమయంలో గంగను, ప్రయాగను స్మరించినా అక్కడ స్నానం చేసిన ఫలితం లభిస్తుందంటారు. అంతేకాదు. ”పోయి సేవింప లేకున్న పుణ్యతీర్థ మహిమ వినుటయు నఖిల కల్మష #హరంబు”. తీర్థయాత్రలు చేసే శక్తి లేకపోయినా ఆ తీర్థయాత్రలు చేసి వచ్చిన వారిని సేవించడం, వారికి ఆదరంగా ఆతిథ్యము ఇవ్వడం, వారికి శుశ్రూష చేయడం, వారిద్వారా తీర్థయాత్రా విశేషాలు తెలుసుకోవడం కూడా సకల పాపాలనూ తొలగిస్తుందని అల్లసాని పెద్దన తన మనుచరిత్ర కావ్యం లో ప్రవరుని నోట పలికించారు.
మనకే కాదు… భగవంతునికి చేసే షోడశోపచారాలలోనూ స్నానానికి విశిష్ట స్థానం ఉంది. శుద్ధోదకంతో, పంచామృతాలతో (పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారల మిశ్రమం), కొబ్బరి కాయ నీళ్ళతో, పరిమళ గంధోదకంతో… ఇలా శక్తి కొద్దీ భగవంతుని అభిషేకించి, ఆ అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే అది మహత్ఫ లితాన్నిస్తుందని భక్తుల విశ్వాసం. గండకీ నదిలో లభించే సాల గ్రామాలను శివ విష్ణు స్వరూపాలుగా అద్వైతులు, శైవులు, వైష్ణవులు కూడా పూజిస్తారు. వాటికి ప్రతి రోజూ శుద్ధమైన నీటితో అభిషేకం చేస్తారు. శుద్ధ జలాన్నే నైవేద్యంగా సమర్పించడమూ కద్దు. ఆ అభిషేక జలాన్ని ”సాలగ్రామ శిలావారి, పాపహారి విశేషత:/ ఆ జన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినేదినే” అనే శ్లోకం పఠిస్తూ తీర్థంగా స్వీకరిస్తారు. జన్మజన్మాంతరాలలో చేసుకొన్న పాపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రతిరోజూ పాపహారి అయిన సాలగ్రామ జలాన్ని స్వీకరిస్తున్నానని పై శ్లోకం యొక్క అర్థం.
గంగానదికి ‘విష్ణుపద’ అనే పేరు కూడా ఉంది. గుడిలోనో, మన ఇంటిలోనో, దైవ పూజ అయ్యాక మనం తీసుకొనే తీర్థం గంగా జలంతో సమానమైన ఫలితాన్ని మనకిస్తుందన్న దృఢ విశ్వాసంతో, ఆధ్యాత్మిక భావనతో ఆ తీర్థాన్ని స్వీకరించాలి. ”శంఖంలో పోస్తేనే తీర్థం” అనే సామెత విన్నాం కదా! తీర్థాన్ని చాలా దేవాలయాలలో శంఖంతోనే ఇస్తారు. అది మరింత పవిత్రమని మన విశ్వాసం.
జైన మతంలో జనన మరణాలనే రెండు తీరాల మధ్య విస్తరిం చి ఉన్న భవసాగరాన్ని తరింపచేసే, లేదా, సులభంగా దాటించ గలిగే 24 మంది గురువులను ‘తీర్థంకరులు’ అంటారు. ఈవిధంగా సకల విధ బాధలను దూరం చేసే తీర్థ సేవనం అనే ప్రక్రియ మన సంస్కృతి మనకు ప్రసాదించిన గొప్పవరం.
– డా.గొల్లాపిన్ని సీ తారామశాస్త్రి 9440781236

Advertisement

తాజా వార్తలు

Advertisement