Thursday, November 21, 2024

ఆనాటి సాధువులు… విద్యార్థుల భిక్షావృత్తులు

మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘భిక్షాటన’ ప్రా ముఖ్యత ఉంది. పూర్వం మనదేశంలో రాచబిడ్డలైనాసరే గురుకులాలలో విద్యార్థులుగా ఉన్నప్పుడు భిక్షాటన చేయాలనే నిబం ధన ఉండేది. విద్యార్థులకు, సాధువులకు, అనాథలకు భిక్ష వేయడం ఆదిభిక్షువైన పరమేశ్వరునికి సమర్పించడంగా భావించేవారు. ఆత్మాభి మానానికి అడ్డురాని భిక్షావృత్తులను విద్యార్థులు, సాధువులు చేపట్టే వారు. వాటిలో మధూకర, శిలోంఛ, యాయవార వృత్తులు ప్రదానం.
‘మధుకరము’ అంటే తేనెటీగ. ఈ తేనెటీగ కొన్ని పుష్పాల నుండి పుప్పొడి సేకరించి తేనెను చేసుకొని ఆస్వాదిస్తుంది. అలాగే విద్యార్జనకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన పేద విద్యార్థులు రెండుమూడు ఇళ్ళకు వెళ్ళి యాచించి ఆకలి తీర్చుకొంటూ, విద్యా భ్యాసం కొనసాగించేవారు. ఇలా కష్టపడి అన్నం విలువ తెలుసుకొని, విద్యను ముగించుకొని, ఉద్యోగం సంపాదించి, పేదవిద్యార్థులకు సహాయం చేసేవారు. చాలామంది మహనీయులు మధూకర వృత్తిచేసి, క్షుద్బాధ తీర్చుకొంటూ, చదువు కొని పైకి వచ్చినవారే. ఒక సామాజిక వర్గానికి చెందినవారు దీనిని ఒక వృత్తిగా చేపట్టినందు వలన ఆనాడు మధూకర వృత్తి గౌరవప్రదంగా భావించబడి ఉండవచ్చు. సాధువులు, యోగులు ఇల్లిల్లు తిరిగి యాచిం చేవారు. సాధువులు ఏ ఇంటి దగ్గర ఆహారాన్ని ఆ ఇంటి దగ్గరే ఆరగిం చి, ఇంటి యజమానిని దీవించేవారు. ఇక ఆ పూటకు మధూకర యా చన ఆపివేయాలి. యోగులు, సాధకులు, ఆహారాన్ని కూడబెట్టరాదు.
శ్రీరామకృష్ణ పరమహంస సన్న్యాస శిష్యుల జీవిత కథలు చెప్ప బడిన ‘దైవంతో సహజీవనం’ అనే గ్రంథంలో ఒక సంఘటన వివరింప బడింది. వివేకానందస్వామి, శిష్యుడు శివానందస్వామి యాచించి తెచ్చిన భిక్షను చూసి ”బిచ్చమెత్తిన ఆహారం తిని చాలారోజులైంది. నువ్వు తెచ్చిన ఆహారం ఇద్దరం తిందాం” అని అడిగి పెట్టించుకొని తిని సంతృప్తిని, సంతోషాన్నీ వెల్లడించారు. శ్రీ రమణమహర్షి కూడా తిరువ ణ్ణామలైలోని ప్రతి వీధిలో తాము భిక్షను గ్రహించిన విషయాన్ని తెలి పారు. ”ఆవిధంగా బిచ్చమెత్తే రోజులలో నేను అనుభవించిన ప్రాభవ ము, ఘనత మీరు ఊహంచలేరు. మొదటిరోజు చిన్నగరుకుళ్‌ భార్యను భిక్షమడిగినప్పుడు, నేను పెరిగిన అలవాటు ప్రకారం, చాలా సిగ్గుపడ్డా ను. తర్వాత ఆవిధంగా కించపడటం అన్నమాటే రాలేదు. నన్ను నేను మహారాజులాగా, అంతకన్నా ఎక్కువగా ఎంచుకొనేవాడిని. ఒక్కోసారి ఒక్కో ఇంట్లో ఉప్పుకూడ లేని గంజి పోసేవారు. దానికి వాసన, రుచి ఉండేవికావు. ఆ గంజిని, నాకు సాష్టాంగ దండాలు పెట్టే పండితులు, ప్రముఖులు చూస్తుండగా, నడివీధిలోనే త్రాగి, ఆ చేతులు తలకు రాసుకొని, ఆనందంగా, దర్జాగా నడచేవాడిని. అప్పుడు నాకు చక్రవర్తు లూ గడ్డిపోచల్లాగా అనిపించేవారు. ఎందరో రాజులు తమ సింహాస నాలను వదిలి ఈ మార్గాన్ని అవలంబించిన కథలు ఎన్నో ఉన్నాయి”.
ఉదాహరణగా రమణ మహర్షి ఒక కథ చెప్పారు. ఒక రాజు సింహా స నాన్ని త్యజించి, భిక్షకు బయలుదేరాడు. మొదట తన రాజ్యానికి బయట, తర్వాత రాజ్యంలో, పిమ్మట రాజధానిలో, చివరకు అంత:పు రంలోనే భిక్ష అడిగి, తన అహంకారాన్ని పూర్తిగా పోగొట్టుకొన్నాడు. తర్వాత కొంతకాలానికి ఇంకో రాజ్యంలో సాధువుగా తిరుగు తున్నప్పు డు అక్కడి ప్రజలు తమ రాజుగా ఎన్నుకొంటే ఆయన ఒప్పుకొన్నారు.
ఇక రెండవది ‘శిలోంఛ వృత్తి’.
”వార్తా విచిత్రా షాలీన యాయవార శిలోంఛనామ్‌
విప్రవృత్తిశ్చతుర్‌ ధ్యేయమ్‌ శ్రేయాసిచోత్తరోత్తర”. ప్రాచీన సమా జంలో బ్రాహ్మణులకు సంస్కారాలు, క్రతువులు, బోధన, దానధర్మాలు చేయడం లేక స్వీకరించడం అనేవి విశ్వశ్రేయస్సు కాంక్షించి నిర్వహం చాల్సిన విధులుగా ఉండేవి. శిష్యులకు గురుకులాలలో జ్ఞానదానం చేయడమేకాక, ఆహార, ఆరోగ్య పర్యవేక్షణ చేయడం కూడా వారి బాధ్య తే. ఒకవేళ బోధన చేయలేనివారు, క్రతువులు నిర్వహంచలేని వారైన పేదబ్రాహ్మణులుంటే వారు శిలోంఛ వృత్తిద్వారా జీవించేవారు. శిలోం ఛ వృత్తి అంటే ఏ ఇంటిలోనైనా ధాన్యం దంచుతూ ఉంటే, లేదా ధాన్యా న్ని విసురుతూ ఉంటే బయటకు కొన్ని గింజలు ఎగిరిపడేవి. వాటిని ఆ ఇంటి వారి అనుమతితో ఏరుకొని తీసుకువెళ్ళి గంజి కాచుకొని తాగేవా రు. ఇది శిలావృత్తి. అలాగే ఉంఛవృత్తిని ఎన్నుకొన్నవారు పొలాలలో పంట కోతలు, కుప్పనూర్పిళ్ళయి, రైతులు ధాన్యం బస్తాలలో నింపు కొని వెళ్ళే సమయంలో, భూస్వామి అనుమతితో, పొలంలో ధాన్యం నూర్పిన ప్రదేశంలో పడిన గింజలను ఏరుకోవడం.
‘శ్రీ మహాభక్త విజయము’లో మహావిష్ణు భక్తుడైన భక్తిసారుడు తన దక్షిణ దేశయాత్రలో కుంభకోణం చేరి ఉంఛవృత్తిలో జీవించిన కథ కన్పి స్తుంది. ఇల్లాళ్ళు రోట్లో వడ్లు దంచేటప్పుడు నేల రాలిన ధాన్నాన్ని సేక రించి వాటితో జీవించసాగాడు. కుంభకోణంలోని శార్ఞపాణి స్వామి వారి ఆలయం దగ్గర ఒక యజ్ఞం జరుగుతోంది. యజ్ఞమూర్తిగా శార్ఞ మూర్తి విగ్రహం ప్రతిష్ఠింపబడింది. చిత్రమేమిటంటే భక్తిసారుడు ఉంఛవృత్తికై తిరుగుతున్న వీధులు ఏఏ దిక్కులలో ఉన్నాయో స్వామి విగ్రహం కూడా భక్తిసారుడు మసలే వీధికి అభిముఖంగా చూస్తుండ డం ఆరంభించింది. ఇది గమనించిన ప్రధానార్చకుడు ఈ విషయాన్ని యజ్ఞదీక్షితునికి చెప్పాడు. భక్తిసారుని ఔన్నత్యాన్ని గుర్తించిన యజ్ఞదీక్షి తుడు తక్షణమే వెళ్ళి ఆయనను యజ్ఞశాలకు తోడ్కొని వచ్చి, అగ్రాసనా న కూర్చోబెట్టి అగ్రపూజ చేశాడు. ఇదిచూచి అక్కడున్న ఋత్వికులు, ఉద్గాతలు, అధ్వర్యులు దీక్షితుని, భక్తిసారుని నిరసించారు. తమబోటి ఉత్తముల మధ్యలో ఉంఛవృత్తితో బ్రతికేవానికి అగ్రపూజ చేసినందుకు నిందించసాగారు. ఆ వివాదానికి యజ్ఞదీక్షితుడు భయపడి భక్తిసారుని శరణు కోరాడు. భక్తిసారుడు చిన్నగా నవ్వి నారాయణ ధ్యానంలో నిమ గ్నమయ్యాడు. అప్పుడు ఆయన శిరస్సుపైన శంఖ చక్ర గదా పద్మధ రుడై, శేషపాన్పుపై శయనించి ఉన్న యజ్ఞపురుషుడైన శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చాడు. అదిచూచి అందరూ భక్తిసారుడి పాదాలపై పడ్డారు.
ఇక మూడవ ప్రాచీన వృత్తి ‘యాయవారం’. అంటే చదువుకోవా లనే తపన ఉన్న పేద విద్యార్థి ఏదైనా ఒక ఊరిలో కడుపు నింపుకోడానికి ప్రతి వారంలో ఒకరోజు రెండుపూటలా తమ ఇంటిలో తనకు భోజనం పెట్ట మని ఏడు కుటుంబాలను ఆశ్రయిస్తాడు. అంటే రోజుకు ఒకరింట్లో అత నికి భోజనం అన్నమాట. ఆ విద్యార్థి ముందు రోజు సాయంత్రమే వెళ్ళి ‘రేపు మీ ఇంటికి భోజనానికి వస్తాన’ని గృహస్థుకు గుర్తుచేసి రావాలి. గృహస్థుడు చెప్పిన సమయానికి విద్యార్థులు వెళ్ళేవారు. ఏది పెడితే అది ఆ పూటకు తినిరావాలి. చదువుకొనే విద్యార్థికి అన్నదానం చేయడం కర్తవ్యంగా గృ#హస్థులు భావించేవారు. ఇలా వారాలు చేసుకొని చదువు కొని వృద్ధిలోకి వచ్చిన మహనీయులెందరో. అన్నార్తులకు, పూర్వ కాలంలో విద్యార్థులు, అన్నార్తులు, పేదవారు ఈ మూడు వృత్తులలో ఏదో ఒకదానితో జీవించేవారు. మనం కూడా అన్నదానంచేసి తరిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement