Friday, September 20, 2024

సాయి మాటలే దివ్యౌషధాలు

సాయిబాబా తనకు మహిమలున్నాయని చెప్పలేదు. తను ఏదైనా చేయగల నని అనలేదు. అలా అనుకున్నది ఆయన భక్తులే. ప్రచారంలో ఉన్న సాహి త్యంలో సాయి లీలల గురించీ, మహిమల గురించీ అనేక అంశాలు కనిపిస్తాయి. షిరిడీలో ఒకసారి కలరా వ్యాధి వ్యాపించింది. నిస్సహాయులైన ప్రజలు సాయి బాబాను శరణు కోరారు. ఆ రోజు బాబా ద్వారకామాయిలో తిరుగలిలో గోధుమలు విసిరారు. షిరిడీలోని మహిళలు కూడా తమ బిడ్డలను రక్షించమని వేడుకున్నారు. సాయిబాబా విసిరిన గోధుమ పిండిని ఆ స్త్రీలకు ఇచ్చి ఊరి పొలిమేరలో జల్లమని చెప్పారు. తక్షణమే ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోరోజు సాయంకాలం ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి, మెరుపు లు, వెనువెంటనే వడగండ్లతో పెద్ద తుఫాను వచ్చింది. బాబా మళ్ళీ గ్రామస్తులను ఆదుకున్నారు. ద్వారకామాయి దగ్గర నిలబడి తన చేతిలోవున్న కర్రతో అక్కడి స్తంభాలను మోదుతూ ‘దిగు… దిగు… తగ్గు…’ అంటూ వర్షాన్ని తగ్గుముఖం పట్ట మని ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞ శిరసా వహించాడు వరుణదేవుడు.
సాయిబాబా భూమిపై నడయాడిన పందొమ్మిదవ శతాబ్దంలో వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగానే వుండేవి. షిరిడీలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వైద్య సౌకర్యాలు మృగ్యం. ఆయుర్వేద వైద్యులు తమకు తోచిన పద్ధతుల్లో జబ్బుల్ని నయం చేసేవారు. కానీ కలరా, ప్లేగు వంటి వ్యాధుల్ని ఎదుర్కోవడంతెలియక ప్రజ లు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో సాయిబాబాను ఆశ్రయించేవారు. తొలిరోజుల్లో కొన్నిరకాల జబ్బులు నయం చేయడానికి తనకు తెలిసిన వైద్యం చేసే వారు బాబా. కానీ తరువాత కాలంలో దానిని కూడా మానేశారు. సలహాలు ఇచ్చే వారు. కేవలం ఊది మాత్రమే ఇచ్చేవారు. స్వస్థత చేకూర్చే మాటలు చెప్పేవారు. కొన్నిరకాల జబ్బులు కాలక్రమంలో తగ్గేవి. ఈవిధంగా ప్రజలు ఏ కష్టం వచ్చినా, ఏ జబ్బు చేసినా సాయిబాబా వద్దకు వెళ్లేవారు. ప్రజలను ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా సాయిబాబా సలహాలు తప్పించాయి. ఆరోజుల్లో సాయిబాబాలాంటి ఉత్తముల్ని, దయాగుణంతో మంచి మాటలు చెప్పే సాధుమూర్తులను విశ్వసించే వారు. ఆ విశ్వాసాల ఫలితంగానే ఆయన మాటలే దివ్యౌషధాలుగా పనిచేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement