13.02.17
గరుడపురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….
జన్మాంతర సహస్రేషు యా బుద్ధిర్భావితా త్మనామ్
తామేవ కురుతే జన్తు: ఉపదేశో నిరర్ధక:
ఒక ప్రాణి వేల వేల జన్మల పరంపరను అనుసరిస్తూ వచ్చిన బుద్ధిని అవలంభిస్తాడు, అటువంటి వానికి ఉపదేశం చేయడం నిరర్ధకం.
జీవాత్మకు స్థూలదేహం, సూక్ష్మ దేహం అను రెండు దేహాలు కలవు. సుర, నర, తిర్యక్ దేహాలు స్థూల దేహాలు, అనగా మనిషిగా గుర్తించే దేహం స్థూల దేహం. అదేవిధంగా పశుపక్ష్యాదుల దేహాలు కూడా స్థూల దేహాలే. ఈ స్థూల దేహాలు మరణించిన తరువాత కొన్ని దహనం చేయబడతాయి మరికొన్ని ఖన నం చేయబడతాయి కానీ ఆ స్థూల దేహంలో ఉండే సూక్ష్మ దేహం దహనం మరియు ఖననం కాదు ఆత్మతోనే ఉంటుంది. ఆ ఆత్మ మరో స్థూల దేహంలో ప్రవేశించినపుడు తానూ అందులో
చేరుతుంది. ఆత్మ స్థూల దేహం చేరగానే ఇది వరకు తాను హరించిన దేహాలతో చేసిన వారి సంస్కారం ఇందులో వచ్చి చేరుతుంది. అందుకే అప్పుడే పుట్టిన పాపకు పాలచుక్కులు వేస్తే చప్పరిస్తుంది, చేదు మందు వేస్తే బయటకు తిరస్కరిస్తుంది. ఈ విధంగా కొన్ని వేల జన్మల నుండి వచ్చే సంస్కారము, అలవాట్లు, ఆలోచనలనే అనుసరిస్తారు. అలాంటి వారికి చేసే ఉపదేశం పనిచేయదు. ఉపదేశం వెంటనే పనిచేయదు కావున ఇప్పటి నుండి ఈ సూక్ష్మదేహంలోకి శాస్త్రాలు, ఉపన్యాసాలు, ఉపదేశ సంస్కారాన్ని అలవాటు చేయడం మొదలు పెడితే మరి కొన్ని జన్మలకైనా ఈ సంస్కారం అలవడుతుంది.
–శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి