తిరుపతి : టీటీడీ స్థానికాలయాల్లో జనవరి 2న ఏకాదశి పర్వదినం ఏర్పాట్లపై జెఈవో శ్రీ వీరబ్రహ్మం పలు విభాగాల అధికారులతో బుధవారం వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ.. ఆయా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని, ఆగమ పండితులు సూచించిన మేరకు ఖచ్చితమైన వేళలు పాటించాలని కోరారు. ఆలయాలను పుష్పాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లు, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు. అన్న ప్రసాదాలు, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా హెల్ప్ డెస్కులు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని, భక్తుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. చైన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి స్థానిక సలహా మండళ్లతో చర్చించి ఆయా ఆలయాల్లో చక్కటి ఏర్పాట్లు చేస్తామమన్నారు. ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టిటిడి ఎస్ఇ-3 సత్యనారాయణ, ఎస్ఇ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, తిరుపతి విజివో మనోహర్, డెప్యూటీ ఈఓలు గుణ భూషణ్ రెడ్డి, గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.