కాలం ఎల్లప్పుడూ ఒకేలా సాగదు. కాలానికి ఎవరైనా బలి కావాల్సిందే. ”కింకరుడే రాజగు, రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్” అని #హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి ఓ పద్యంలో అంటారు. ఉన్నట్టుండి ధనవంతుడు పేదవాడుగానూ, పేదవాడు ధనవంతుడుగానూ మారవచ్చును. అందుకే ”సిరి దా వచ్చిన వచ్చును… సిరి దా బోయిన బోవును” అని సుమతీ శతకంలో బద్దెనామాత్యుడు, కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందో! అలా సంపద వచ్చి చేరుతుంది. ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జు ఎలా మాయమౌతుందో! అలా సంపద పోతుందని వివరిస్తాడు. ఆపదలో ఉన్న ఎందరికో సాయం చేసిన వ్యక్తి ఒక్కోసారి అనేక కష్టనష్టాలకు గురౌతుండడం చూస్తుంటాం. అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఇతరుల సాయాన్ని కోరినా, కోరకపోయినా గతంలో అతని వల్ల లాభపడిన వ్యక్తి ప్రత్యుపకారం చేయాల్సి ఉంటుంది. అంటే ఆదరించిన వానిని ఆదుకోవాలన్నమాట. ఇది మానవుని కనీస ధర్మం.
ఈ కనీస ధర్మాన్ని మహాభారత కథలోని రెండు సందర్భాలు గట్టిగా నొక్కిచెబుతున్నాయి. ఒకానొక పరిస్థితిలో ఏకచక్రపురంలో కుంతీదేవితో కలసి పాండవులు తలదాచుకోవలసి వస్తుంది. అప్పుడు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం వారిని ఆదరించి, తగు వసతిని కల్పిస్తుంది. ఒకరోజు ఆ కుటుంబానికి ఒక పెద్ద ఆపద వస్తుంది. ఆ గ్రామ ఆచారం ప్రకారం బకాసురుడనే రాక్షసునికి ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని ఆహారంగా పంపాల్సివస్తుంది. అప్పుడు తల్లి, తండ్రి, కొడుకు ఎవరికి వారు వాటాలు వేసుకుంటూ రాక్షసుని వద్దకు ఆహారంగా నేను వెళ్తానంటే నేను వెళ్తానని ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమౌతారు. ఆ దయనీయ సన్నివేశాన్ని చూసి కుంతీదేవి మిక్కిలి బాధపడి సానుభూతి వ్యక్తం చేస్తుంది. సహానుభూతితో తన ఐదుగురు కొడుకుల్లో ఒకరైన భీముణ్ణి పంపిస్తుంది. ఎందుకంటే, కష్టాల్లో ఉన్న తమను ఆ కుటుంబం ఆదరించిందనే కనీస ధర్మాన్ని పాటించి అలాంటి నిర్ణయం ఆమె తీసుకుంటుంది.
మరొక సందర్భంలో విరాటరాజు కొలువులో ద్రౌపదీ సమేతంగా పాండవులు ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. అప్పుడు పాండవుల ఆచూకీ తెలుసుకోవాలని కౌరవసేన విరటుని రాజ్యంపై దండెత్తుతుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఉన్న రాజు యొక్క గో సంపదను సైన్యం మళ్ళిస్తుంది. తమను ఆదరించి, అక్కున చేర్చుకున్న విరాటరాజు యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశం పాండవులకు ఆ సమయాన దక్కుతుంది. దాంతో ధర్మరాజు తన తమ్ముళ్లను విరాటరాజుకు అండగా యుద్ధానికి వెళ్ళమని సూచిస్తాడు. అన్నయ్య మాటవిని పాండవులు యుద్ధానికి వెళ్లి కౌరవుల బారి నుండి గోవులను రక్షిస్తారు.
ఇలాంటి సందర్భమే రామాయణంలో కూడా ఉంది. సీతాదేవిని వెతుకుచూ ఋష్యమూక పర్వతం వైపు వస్తున్న రామలక్ష్మణులను హనుమంతుడు చూస్తాడు. వారి పూర్తి సమాచారం తెలుసుకొని తన రాజు సుగ్రీవుని వద్దకు తీసుకెళ్తాడు. హనుమంతుని చొరవతో రామలక్ష్మణ-సుగ్రీవుల మధ్య మైత్రీబంధం ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఆ అన్నదమ్ములు ఇరువురినీ ఆత్మీయ బంధువులుగా సుగ్రీవుడు సమాదరిస్తాడు. తన అన్న వాలి వలన తాను పడుతున్న ఇక్కట్లు శ్రీరాముడు దృష్టికి సుగ్రీవుడు తీసుకొస్తాడు. దాంతో తనను ఆదరించిన వారికి మేలు చేయాలనే తలంపుతో రాముడు వాలిని చంపి, సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజుని చేస్తాడు.
ఈ మూడు సందర్భాలను తరచి చూస్తే, ఆదరించిన వ్యక్తులు ఆపత్కాలములో ఉంటే, వారిని కాపాడుట కనీస ధర్మంగా భావించాలి. రామాయణ భారతాది ఐతిహాసాలలో అనేక సూక్ష్మమైన ధర్మ సూత్రాలు ఇమిడి ఉన్నాయి. వాటిని ఆచరించే బాధ్యత భరతజాతి మరువకూడదు.
- జానకి