Sunday, November 10, 2024

అసలైన సంపద

మనలో చాలామంది డబ్బు, స్థిరాస్తి కూడబెట్టి , భావితరాల వారికి అందివ్వాలనే ఉద్దేశ్యంతో అధర్మంగానైనా సంపాదిస్తున్నారు. దీనివల్ల భావితరాల వాళ్ళకి కష్టపడే తత్వం కాని, దానగుణం కాని లేకపోవడంతో చివరికి పనికి రాకుండా పోతున్నారు.
మనకు కావాల్సిన సంపద ధనం, స్థిరాస్తిలు మాత్రం కానేకాదు. మనకు 1) జ్ఞాన సంపద, 2) ఆరోగ్య సంపద, 3) తగినంత ఆర్థిక సంపద, 4) ఆధ్యాత్మిక సంపద కావాలి.
జ్ఞాన సంపద అంటే విచక్షణ, ఏది మంచి? ఏది చెడు? ఏది ధర్మం? ఏది సత్యం ? అని ఆలోచించి, అనుసరించాలి. భగవద్గీత మొదటి అధ్యాయంలో ”ధర్మక్షేత్రే కురుక్షేత్రే” అని మొదటి శ్లోకం ప్రారంభం అవుతుంది. మనలో ఆ రెండు క్షేత్రాలు అంత:కరణ ప్రవృత్తులుగా ఉన్నాయి. ధర్మక్షేత్రం పాపభీతి కలిగించి, దైవం వైపు తీసుకు వెడుతూంటుంది. కురుక్షేత్రం మనసులో రాగద్వేషాలు, రాక్షస ప్రవృత్తి వైపు నడిపిస్తుంది. చాలామంది కురుక్షేత్ర సంగ్రామం చేస్తూ జీవితం అల్లకల్లోలం చేసుకుని మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు.
ఆరోగ్య సంపద మనం సాత్త్విక ఆహారం తింటుంటే మనలో సాత్త్విక భావాలు ఉత్పన్నమవుతాయి.
లేకపోతే రజో, తమోగుణాలు అలవడి, మనలో లోభం క్రోధం, అజ్ఞానం వంటి చెడు గుణాలు అలవడతాయి. దీనివల్ల అనారోగ్యం. ఆరోగ్యంగా ఉండటానికి సాత్త్విక ఆహారం తీసుకోవాలి.
ఆర్థిక సంపద మనం జీవనం సాగించడానికి సరిపడ సొమ్ము ధర్మ బద్ధంగా సంపాదించాలి. అత్యాశ, దురాశ ఉండకూడదు. సంపద కూడ పెట్టాలనే కోరిక మనశ్శాంతి లేకుండా చేస్తుంది.
ఆధ్యాత్మిక సంపద మనకు కష్టాలు. సమస్యలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. అది కాదు కావలసింది. ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆత్మ జ్ఞానం పొంది జన్మరాహత్యం పొందడానికి కృషి చేయాలని పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. లేకపోతే పునరపి జననం పునరపి మరణం అంటూ జనన—మరణ చక్రంలో చిక్కుకొనే ఉంటాము. భగవద్గీతలో దైవీ సంపత్తి యోగంలో శ్రీకృష్ణుడు మనిషికి ”నిర్భీతత్త్వం, శాంతి, దయ, అంత:కరణ శుద్ధి, దానం, యజ్ఞాలు చేయడం, క్షమ కలిగి ఉండడం, ఓర్పు ఇంద్రియాలు, మనస్సు, నియంత్రణ వంటి సద్గుణాలు ఉండాలని వివరించారు. ఇవే అసలైన సంపద. మనం అసలైన సంపద సాధనాక్రియకు అడుగులు వేద్దాం.

– అనంతాత్మకుల రంగారావు

Advertisement

తాజా వార్తలు

Advertisement