Friday, November 22, 2024

అసలైన విజయం!

”మానవుల జాతకాలను ప్రభావితం చేసేవి రాహు కేతు గ్రహాలు కాదు. అహంకార మమకారా లు .” అనంటారో మహనీయుడు. అవును . అహంకార మమకారాలు మనల్ని పాడు చేస్తాయి. పాతాళానికి పడదోస్తాయి. బలం బలగం అన్నీ, అందరూ ఉన్నారన్న అహంకారమే దుర్యోధనుడుని మట్టి పాలు చేసింది. సీతమ్మ వారి మీద పెంచుకున్న మమ కారమే రావణ బ్రహ్మను రాక్షస బొమ్మగ మిగిల్చి అధోగతి పాలు చేసింది . అందుకే మనం ఈ రెంటికీ దూరంగా ఉం డాలి. దూరంగా ఉంచగలగాలి. దూరంగా ఉంచగలిగే సామర్థ్యం సంపాదించుకోవాలి. అందుకు తగ్గ స్థాయిని స్థితిని అం దించే యోగాన్ని మనం అందుకోగలగాలి. అదెలా సాధ్యం? సాధనతో సాధించుకోవాలి. అయితే ఆ స్థితి ఆ యోగం అందుకోవటం అంత ఆషామాషీ కాదు. శోధ న చేయాలి. సాధన చేయాలి. ఈ రెండింటి సమన్వయంతో సాధ్యం చేసుకోవాలి ఓచోట ఓ సభ జరుగుతోంది. ప్రధాన వక్త తనకున్న ఉపన్యాస పటిమతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాడు. మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు. ఫలితంగా ఆ వక్తకి కొంచెం అహంకారం తలకెక్కింది. ఈ ప్రతిభంతా నాదే అనే భావన ఆవహించింది. ఇది గమనించింది ఎదురుగా ఉన్న మైకు. తను యీ వక్తకు సహకరించకపోతే ఉపన్యాసం ఏమయ్యేది? చెప్పేది ఏమీ వినిపించక అభాసు పాలయ్యేవాడు. కాబట్టి ప్రతిభంతా నాదే అని మనసులో అనుకుంది మైకు. ఇదంతా గమనించింది మైకుని వైరుకి కలిపే స్క్రూ లాంటి గుండ్రటి పరికరం. తను లేకపోతే ఏమయ్యేదనే అహంకారంతో తలెగరేసింది స్క్రూ. ఇది గమనించిన వైరు తనే లేకపోతే యీ స్క్రూ ఎంత బాగా పనిచేసినా, అంతా వ్యర్ధమే. కాబట్టి ఈ ఉపన్యాసం గొప్పంతా తనకే చెందుతుంది అనుకుంది మైక్‌ కు తగిలించిన వైరు. పొగరు తలకెక్కిన వైరుని గమనించింది అవతల ప్రక్కన స్పీకర్‌ బాక్స్‌కి కలిపే గుండ్రంగా ఉండే మరో పరికరం. తను వైరుతో కలిసి ఉండకపోతే, ఖచ్చితంగా అమరేలా వైరుకి సహకరించక పోతే ఏమయ్యేది? కాబట్టి గొప్పంతా తనదేనని తలెగరేసింది రెండో ప్రక్కన ఉండే వైరుని కలిపే గుండ్రటి చిన్న పరికరం. ఇదంతా గమనించింది స్పీకర్‌ బాక్స్‌. గొప్పంతా తనదే అనుకుంది. తను సరిగ్గా పని చేయకపోతే ఏమయ్యేది? అంతా మఠాస్‌ అయ్యేదని అనుకుంటూ అహంకరించింది స్పీకర్‌ బాక్స్‌. ఇది గమనించిన ఏంప్లి ఫైర్‌, వీటిదేం గొప్ప? ఈ ప్రతిభంతా నా వలనే అనుకుంది ఏంప్లిఫైర్. ఇదంతా గమనించింది మైక్‌ వ్యవస్థ అంతా పని చేయడానికి అవసరమయ్యే విద్యుత్‌. ఇవన్నీ ఎంత చక్కగా పని చేసినా, నేనే లేకపోతే ఏం లాభం? మొత్తం ఏమీ ఉండదు అనుకుంది . అహం తలకెక్కి, ప్రతిభంతా తన వలనే అనుకుంది విద్యుత్‌. విర్రవీగుతున్న విద్యుత్‌ను చూసిన నీరు (గంగ), విద్యుత్‌కు ఎంత పొగరు. తనే లేకపోతే విద్యుత్‌ ఎక్కడ నుంచి వస్తుంది అనుకుని, నీరు (గంగ) అహంతో తల ఎగరేసింది. నీటి నుంచే విద్యుత్‌ పుడుతుందనే అహంకార పూరితురాలైన నీరుని (గంగను) చిద్విలాసంగా చూసేడు పరమ శివుడు . భగవత్‌ తత్వాన్ని గ్రహించలేని గంగ అమాయకత్వానికి జాలిపడ్డాడు శివుడు . అవును. శివుని జటాఝూటమే లేకపోతే గంగ ఎక్కడుం టుంది? గంగ అస్థిత్వం ఏమయ్యేది? గంగకు ప్రతిభ ఎలా వచ్చేది ? ఇలా ఒక్కసారి ఆలోచిద్దాం . ఆలోచన చేద్దాం. ఇదీ అంతా నేనే, అంతా నా వలనే అనే అహం కూడదనే సత్యాన్ని. మామూలు సంఘటనలతో, మహత్తరమైన సందేశాన్ని అందించే మైకు కథ. ఏది ఎప్పుడు ఏవిధంగా జరిగినా, భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అనే బోధను పరోక్షంగా చెప్పే కథ. అన్నింటికీ భగవంతుడే మూలం. అన్నింటికీ ఆతని అనుగ్రహమే కారణం అనే సత్యాన్ని, ప్రతిచోట ప్రతి పనిలో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, భగవంతుడు తెలియ జేస్తుంటాడు. దాన్ని మనం గ్రహించగలగాలి. ”నేను” అనే అహాన్ని విడనాడాలి. ”నాది” అనే మమకారాన్ని వదులుకోవాలి. వదిలించు కోవాలి. అహం కార మమకారాలను వదులుకో గలగటమే అసలైన విజ యం. అన్నింటిలోను పరమాత్మను చూడగలగటమే సాధకుని కర్తవ్యం. ”సర్వం సర్వేశ్వరమ యం” అనే భావనను అనుభవించటం, అనుభవించ గలగటమే మనందరి గమ్యం.

– రమాప్రసాద్‌ ఆదిభట్ల
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement