Thursday, November 21, 2024

యాదాద్రీశుడి స్వయంభు దర్శనానికి సర్వంసిద్ధం

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: ప్రపంచ స్థాయి ఆథ్యాత్మిక క్షేత్రంగా రూపుదాల్చిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వయంభువుల దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యా యని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మార్చి 21వ తేదీన 1008 కుండా లతో కూడిన మహా సుదర్శన యాగంతో స్వయంభువుల
పున: దర్శనానికి అంకురార్పణ జరగనుందని, 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణతో దర్శనాలు పున : ప్రారంభం అవుతాయన్నారు. 6 వేల మంది రుత్వికులతో నిర్వహించే ఈ క్రతువును రోజుకు లక్ష మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నా రు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రధానాలయం, క్యూలైన్‌, క్యూకాంపెక్స్‌, ప్రసాద విక్రయశాలతో పాటు కొండ దిగువన గండి చెరువు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణీతో ఆర్‌ అండ్‌ బీ పనులను పరిశీలించి వైటీడీఏ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కొండ పైన హరిత హోటల్‌లో వైటీడీఏ, ఆలయ అధికారులు, సాంకేతిక బృందం సభ్యులతో మంత్రి సమీక్ష సమావేశం జరిపారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మార్చి 15వ తేదీ లోపు పనులు పూర్తవుతాయని, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం కోసం 75 ఎకరాల్లో యాగ స్థలిని సిద్ధం చేయనున్నామన్నారు. ఇందుకు సంబంంధించి యాగ సామాగ్రి టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. భక్తులు కొండ పైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా లండన్‌ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఆలయ ప్రారంభం అనంతరం కూడా పెండింగ్‌ పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దుకాణదారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈవో ఎన్‌ గీత, ఆర్కిటెక్చర్‌ ఆనంద్‌సాయి, ఆలయ ప్రధానార్చకులు నల్లం థీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఆయా శాఖల అధికారులతో పాటు ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, గుట్ట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధా, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement