శ్రీరామచంద్రమూర్తి వేసిన బ్రహ్మాస్త్రంతో సమానమైన ఐంద్రాస్త్రం కుంభకర్ణుడి తలను నరికి చంపినా, మిగిలిన మొండెం వానరులను చంపుకుంటూ పోయి సముద్రంలో పడింది. ఆ విషయాన్ని మిగిలిన రాక్షసులు వెళ్ళి రావణుడికి చెప్పా రు. కుంభకర్ణుడి మరణవార్త విన్న రావణుడు అధిక దు:ఖంతో నేలమీద పడిపోయాడు. ఏడుస్తున్న రావణుడిని త్రిశిరుడు ”నీ భుజబలంతో రాముడిని దండించు. ఆ మాటకొస్తే, అసలు నువ్వెం దుకు యుద్ధానికి పోవాలి? నువ్వు సుఖంగా వుండు. నేను పగతీర్చు కుంటాను. రామచంద్రుడిని సంహరిస్తాను” అంటూ ఓదార్చాడు.
త్రిశిరుడు మాటలకు రావణుడు దు:ఖంమానాడు. ఆ తరు వాత యుద్ధోత్సాహంలో వున్న దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరుడు, మత్త, యుద్ధోన్మత్తులను పిలిపించాడు. వీరంతా యు ద్ధంలో పరాజయం ఎరగనివారే. అందరూ వరాలు పొందినవారే. వీరందరినీ యుద్ధానికి పంపాడు. వారి సింహనాదాలు, వారి పాద ఘట్టనలకు భూమి వణికించింది. రాక్షస సేనలను చూసిన వానరు లు కొండలు, చెట్లు ఎత్తుకుని కేకలు వేశారు. రాక్షసులు ప్రతిధ్వని చేశారు. ఇరుసేనలు పరాక్రమించి యుద్ధం చేశారు. వానరుల ధాటి ని ఆపడానికి నరాంతకుడు రంగంలోకి దిగి, చాలామంది వానరు లను క్షణంలో చంపాడు. అది చూసి సుగ్రీవుడు, అంగదుడితో నరాంతకుడిని చంపమని చెప్పాడు. అంగదుడు పిడికిలితో రాక్షసు డి రొమ్ముపై పొడిచాడు. ఆ దెబ్బకు నరాంతకుడు చనిపోయాడు.
నరాంతకుడు చావడంలో చూసిన త్రిశిరుడు, మహోదరు డు, దేవాంతకుడు ఒక్కసారిగా అంగదుడిపై పడ్డారు. అది చూసిన #హనుమంతుడు, నీలుడు ఆ దిక్కుగా వచ్చారు. నీలుడు త్రిశి రుడితో, హనుమంతుడు దేవాంతకుడితో యుద్ధం చేశారు. #హను మంతుడి పిడికిటి పొడుపుకు దేవాంతకుడు చచ్చాడు. నీలుడు చెట్లతో కూడిన ఒక పర్వతాన్ని తీసుకుని మహోదరుడి మీద వేయ గా నేలకూలాడు. పినతండ్రి చావు చూసిన త్రిశిరుడు హనుమంతు డిని బాణాలతో నొప్పించాడు. #హనుమంతుడు తన కత్తితో త్రిశిరుడి మూడు తలలను నరికివేశాడు. ఆ తరువాత మహాపార్స్వుడు ఋష భుడి చేతిలో చచ్చాడు. ఇది చూసి, అతికాయుడు యుద్ధానికి రాగా లక్ష్మణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే, అతికాయుడు సౌరాస్త్రాన్ని సంధిం చాడు. అతికాయుడు ఐశీక బాణం వేస్తే, లక్ష్మణుడు ఐందాస్త్రాన్ని వేశాడు. లక్ష్మణుడి బాణాలు అతికాయుడిని చంపలేకపోయాయి. చివరకు వాయుదేవుడు లక్ష్మణుడిని సమీపించి వీడు అల్ప ప్రయ త్నంతో చచ్చేవాడు కాదని చెప్పగా, లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని వేశా డు. అది వాడి శిరస్సును కవచంతో సహా నేలకూల్చింది.
యుద్ధ భూమిలో అతికాయుడు మరణించాడని విన్న రావ ణుడు ఏం చేయడానికి తోచక ఆలోచిస్తుండగా, ఇంద్రజిత్తు సమీ పించి రామలక్ష్మణులను యుద్ధ భూమిలో భయంకరమైన తన బాణాలతో పడగొట్టుతానని చెప్పి తండ్రి ఆజ్ఞ తీసుకుని యుద్ధానికి బయల్దేరాడు. ఇంద్రజిత్తు రథం ఎక్కి, కనపడకుండా ఆకాశానికి ఎగిరి, యుద్ధం చేయమని తన పక్కనున్న రాక్షసులను ప్రేరేపిం చాడు. రాక్షసులు పరాక్రమించి యుద్ధం చేశారు. ఇంద్రజిత్తు తన బాణాలతో వానరులను చంపాడు. వానరులు కూడా భీకర యుద్ధం చేశారు. ఇంద్రజిత్తును ఎదిరించారు. ఇంద్రజిత్తు గంధమాదను డిని, నలుడిని, మైందుడిని, గజుడిని, జాంబవంతుడిని, నీలుడిని, సుగ్రీవుడిని, అంగదుడిని, ఋషభు డిని, ద్వివిదుడిని, తీవ్రమైన బాణాలతో నొప్పించాడు. వానర సేనను అల్లకల్లోలం చేశాడు. అదృ శ్యుడై ఆకాశాన్నుండి యుద్ధం చేశాడు. విక్రమిస్తున్న ఇంద్రజిత్తు వ్యవహారం చూసి శ్రీరాముడు తమ్ముడితో ఇలా అన్నాడు.
”లక్ష్మణా! ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర బలంతో వానరసేనల ను నేలపాలు చేసాడు. వీడిని మనం ఎలా జయించగలం? ఇది స్వయంభు భగవంతుడైన బ్రహ్మ దేవుడి బాణం. దీని మహిమ చాలా గొప్పది. దీన్ని నాలాగే నువ్వు కూడా ఓర్చుకో. మనమంతా స్మృతి తప్పి ఏ ప్రయత్నం చేయకుండా వుండ డం చూసి, జయలక్ష్మిని గ్రహించి, ఇంద్రజిత్తు వెనుదిరుగు తాడు”. ఇలా ఆయన చెప్తున్నప్పుడే బాణ వర్షం అధికమై, రామలక్ష్మణులు మూర్ఛపోయారు. వారు మూర్ఛపోవడం చూసి సంతోషించిన ఇంద్రజిత్తు తన నగరానికి పోయాడు.
అప్పుడు అక్కడ దు:ఖిస్తున్న వానర వీరులను చూసి విభీషణుడు ”కపులారా! రామలక్ష్మణులు పరవశులై పడ్డా రని దు:ఖిస్తే లాభం ఏమిటి? ఇది దు:ఖించాల్సిన సమయం కాదు. రాజకుమారులు బ్రహ్మవాక్యం గౌరవించాలి అనుకు ని రాక్షసుల బాణాలకు చిక్కారేకాని, పరాక్రమహనులై కాదు” అన్నాడు. అప్పుడు హనుమంతుడి క్షేమం గురించి జాంబవంతుడు విభీషణుడిని అడిగాడు. దానికి ఆయన ”రామ లక్ష్మణులు క్షేమంగా వున్నారా అని అడగకుండా హనుమంతుడు బాగున్నాడా అని ఎందుకు అడుగుతున్నావు? వాస్తవానికి నీకు హనుమంతుడి మీద వున్న ప్రేమ రాజకుమారుల మీద కాని, బాలుడైన అంగదుడి మీదకాని, ప్రభువైన సుగ్రీవుడి మీదకాని లేక పోవడానికి కారణం ఏమిటి?”.సమాధానంగా జాంబవంతుడు ”#హనుమంతుడు జీవించి వుండి మన సేనలు హితమైనా మనకు మనుగడ వుంటుంది. అలాకాకుండా #హను మంతుడు లేకుండా మనమంతా బతికున్నా లేనట్లే. హనుమం తుడు గమనవేగాన వాయుదేవుడే, వీర్యాతిశయాన అగ్నిదేవుడుతో సమానం.”
”ఆంజనేయా! నీ పరాక్రమం చూపాల్సిన సమయం ఆసన్న మైంది. నువ్వు హమవత్పర్వతం వెళ్ళి అక్కడ ఋషభ శైలం, కైలాస పర్వతాలను చూడు. వాటి మధ్యన మిక్కిలి కాంతికలదై సర్వౌషధులు కలిగి అందమైన మూలికల కొండ చూడు. ఆ పర్వ తం కొనలో అధికమైన తమ కాంతితో దిక్కులను వెలిగించే నాలుగు మూలికలను చూడు. వాటి కాంతిని బట్టి నువ్వు వాటిని గుర్తించ గలవు. వాటిలో మృతసంజీవని, విశల్యకరణి (దేహంలో నాటిన ఇతర పదార్థాలను, బాణాలను, ములుకులను వూడతీసేది), సావర్ణ్యకరణి (గాయాలతో వన్నె మారిన చోట మళ్లి వన్నె వచ్చేట్లు చేసేది), సంధానకరణి (విరిగిన ఎముకలను, అవయవాలను అతి కించేది) వుంటాయి. నువ్వు వెంటనే వెళ్లి వాటిని తెచ్చి వానరసేనకు ప్రాణాలను ఇవ్వు.” అని అంటాడు జాంబవంతుడు.
హనుమంతుడు తన దేహాన్ని పెంచాడు వెంటనే. త్రికూట పర్వత శిఖరం ఎక్కాడు. సముద్రాన్ని దాటిపోయి మనో#హరమైన మంచుకొండ చేరి జాంబవంతుడి మాటలు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. హనుమంతుడు మూలికల కోసం వేయి యోజనాల స్థలాన్ని వెతికాడు. ఆ మూలికలు కనబడలేదు. అవి కనపడక పోవడం తో హనుమంతుడు ఆ శైలాన్ని పాటులతో సహా పెళ్ళగించి ఆకా శానికి ఎగిరి, శీఘ్రంగా వచ్చాడు. హనుమంతుడు దూరం నుండి వస్తుంటేనే మూలిక గాలి సోకడం వల్ల వానరులంతా ప్రాణా లతో లేచి కూర్చున్నారు. హనుమంతుడిని చూసి కేకలు వేశారు. ఆ మహామూలికల వాసన చూసి రామలక్ష్మణులు స్మృ తి తెచ్చుకుని తెప్పరిల్ల్లారు. బాణాల బాధ తొలగగానే రామ లక్ష్మ ణులు విల్లులు ధరించి, అల్లెతాడు మీటి పుట్టించారు. కుంభ కర్ణుడి కొడుకులైన కుంభ నికుంభులు సేనలతో సహా యుద్ధానికి బయల్దేరారు. రాక్షసుల, వానరుల మధ్య యుద్ధం జరిగింది. ఇలా అంతా ఏకకాలంలోనే మరణించారు.
ఆ తరువాత ఖరుడి కొడుకు మకరాక్షుడు రావణ అజ్ఞాను సారం యుద్ధానికి వచ్చాడు. వానరులను తరుముతున్న రాక్ష సుల మీదికి రాముడు కోపంతో తన వాడి బాణాలను వేసి వాన రుల పైన పడకుండా నిలిపాడు. అప్పుడు మకరాక్షుడు రాము డితో ”నిలు నిలు రామా! ఎందుకు గర్వంతో మిడిసిపడతావు? నీ బలం ఏమాత్రమో నాకు చూపు. ద్వంద్వయుద్ధంలో నీ ప్రా ణాలను బలి ఇస్తాను నీ ఇష్ట ప్రకారం, నీకే యుద్ధం కావాలను కుంటే ఆ యుద్ధమే చేయి”.
రాముడు ”ఓరీ! రాక్షసుడా! యుద్ధంలో నీ శౌర్యం చూపు. ఖర దూషణులను, నీ తండ్రిని, పధ్నాలుగు వేల రాక్షసులను చంపాను. నిన్నూ అలాగే చంపుతాను” అంటాడు. శ్రీరాముడు ఇలా అనగానే, మకరాక్షుడు ఆయన్ను తన బాణాల వర్షంలో ముంచెత్తాడు. రాముడు ఆ బాణాలన్నిటినీ తన బాణాలతో ఖం డించాడు. తనతో సమానంగా పోరాడుతున్న రాక్షసుడిని చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ధనస్సును తెగ గొట్టి, ఎని మిది బాణాలతో సారథిని చంపి, గుర్రాలను ఖండించగా మకరాక్షు డు శూలం రాముడి మీదకు విసిరితే రాముడు తుంచాడు. శూలం విరిగి పోగా రాక్షసుడు పిడికిలి పట్టి రాముడి మీదికి దూకాడు. రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి రాక్షసుడి రొమ్ము చీల్చి చంపాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం
మందరం ఆధారంగా)
- వనం జ్వాలా నరసింహారావు, 8008137012