పూజలు, నోములు, వ్రతాలు, అర్చనలు, ఆరాధనలు, అభిషేకా లు, తీర్థయాత్రలు, దక్షిణలు, ప్రదక్షిణ లు, నామస్మరణలు యిలాంటి పనులన్నింటినీ మనం ఆధ్యాత్మికం అంటున్నాం. అనుకుంటున్నాం. ఇవేవీ కానివి, వీటికి సంబంధంలేని ఇతరత్రా పనులన్నిటినీ లౌకికమని అంటున్నాం. నిజానికి పూజలు, వ్రతాలు వంటివన్నీ ఆధ్యాత్మికానికి మనల్ని తీసుకువెళ్ళే మార్గాలు. సాధనా సరంజామాలు. కానీ అవే అసలు సిసలైన ‘ఆధ్యాత్మికం’ అని అనలేం. ‘నేను’ అనే స్థాయి నుంచి విస్తృతమై, విశాలమై ‘మనం’ అనే స్థాయికి చేరుకునే ప్రయాణమే ఆధ్యాత్మికం. రాక్షసత్వం నుంచి పశుత్వానికి, పశుత్వం నుంచి మాన వత్వానికి, మానవత్వం నుంచి మాధవత్వానికి చేరుకోవటమే ఆధ్యాత్మికం. సంకుచిత్వం నుంచి సంయుక్త తత్వానికి, ఆటవికం నుంచి ఆత్మ తత్వానికి చేరుకోవ టమే అసలు సిసలు ఆధ్యాత్మికం.
ఆధ్యాత్మికం అనేసరికి పూర్వ జన్మ సుకృతం, కర్మ ఫలం, ప్రాప్తం, అప్రాప్తం అనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. అన్నీ వాతంతట అవే అమరిపోయి అన్నీ చకచకా జరిగిపోతుంటే, ‘ఆహా! అది వాడి ప్రాప్తం’ అంటాం. అలా జరగక ఎదురు తిరిగితే ప్రాప్తం లేదంటాం. పూర్వజన్మ ఫలం అంటాం. కర్మ అనుభవించాలి అంటాం. అప్రాప్తం అని కూడా అంటాం. ఆచార్య ఆత్రేయ అన్నట్టు ”తలచింది జరిగిందంటే అంతా మన ప్రతిభ అనంటాం. తలచింది జరగని నాడు తలరాతం టూ విధిపై నెడతాం. అయితే భగవంతుడి అనుగ్రహం అనేది ఈ ప్రాప్తం, అప్రాప్తాలు, పూర్వజన్మలు, కర్మలు, సుకృతాల మీదే ఆధారపడి ఉండదు. మన సాధన మీద, మన ప్రయత్నం మీద, దీక్ష మీద, మనం ఉండే స్థితి మీద, పరిస్థితి మీద, మన సంసిద్ధత మీద ఆధారపడి ఉంటుంది.
ద్వాపర యుగంలో ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన ఇంటిలో నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. కృష్ణుని పెదవులను అంటుకుని వేణువు దివ్యమైన వేణు గానాన్ని కృష్ణుడు వేణువును ఊదకుండానే వినిపిస్తోంది. వేణు గానం విన వస్తుంటే చుట్టుపక్కల అందరూ అక్కడికి చేరుకు న్నారు. వేణువు అదృష్టాన్ని అభినందించారు. వేణువును పొగ డ్తలతో ముంచెత్తారు. వేణువుకి అందరూ తనని పొగిడే తీరు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. ”నన్ను అలా పొగడ వద్దు. నాలో అహంకారం తలెత్తవచ్చు.” అని వారించింది వేణువు. కొంత సమయం గడిచిన తర్వాత కృష్ణయ్యకు ఎంతై నా వేణువు అంటే కొంచెం ఎక్కువ ఆపేక్ష అనీ, యిష్టమనీ, అది కృష్ణుని పక్షపాత బుద్ధికి నిదర్శనమనీ, కొందరి గుసగుసలు మెల్లగా వేణువు చెవిన పడ్డాయి.
అప్పుడు వేణువు యిలా అంది. ”నా శరీరాన్ని చూడం డి. తొమ్మిది గుండ్రని రంధ్రాలతో, ఎంత గుల్లగా ఉందో! చూసేరా? బాగా గుల్లగా ఉంటూ ఆ నల్లనయ్య నాలో చాలా సులువుగా ప్రవేశించేలా నేను ఉన్నాను. ఉంటున్నాను. ఆ స్థితిలో నేను ఉండగలుగుతున్నాను. మరి మీరో? మీకూ నాలాగే నవ రంధ్రాలే ఉన్నాయి. మీ నవరంధ్రాల నిండా కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అహంకార మమ కార అసూయలను పూర్తిగా నింపుకుంటున్నారు. నల్లనయ్య తన అనుగ్రహంతో, మీలో చొరబడాలని ఎంత ప్రయత్నిం చినా, చొరబడ లేనంత స్థిరంగా ఉంటున్నారు. ఏమాత్రం గుల్లదనం లేకుండా, దృఢంగా మీ శరీరాలను ఉంచుకుంటు న్నారు. కృష్ణయ్య మీలో చొరబడటానికి అవకాశం ఏమాత్రం అ నల్లనయ్యకు ఈయడం లేదు. అలాంటప్పుడు మీలో ఆ కృష్ణయ్య దివ్యగానాన్ని ఏ రకంగా వినిపించగలడు?” అని అసలు రహస్యాన్ని వివరించింది వేణువు. అవును. భగవం తుడు సహవర్తి. సమవర్తి. అందరూ ఆయనకు సమానులే. ఆయనకు తరతమ బేధం అనేది ఏ కోసాన లేదు. సర్వులకూ సమస్త జీవులకూ తన అనుగ్రహాన్ని సమంగా అందించే తత్వం భగవంతునిది. భగవంతుడు తన అనుగ్రహాన్ని అం దరి మీద నిండుగా, దండిగా, మెండుగా కురిపించడానికి ఎల్ల ప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అయితే అందుకోడానికి మనం సంసిద్ధులమై ఉండాలి. మనసా, వాచా, కర్మణా, మనం సిద్ధ మై ఉండాలి. హృదయాన్ని తెరుచుకుని స్వచ్ఛంగా భగవం తుని కోసం మనం తయారై ఉండాలి. తపన పడాలి. తపిస్తూ ఉండాలి.
- రమాప్రసాద్ ఆదిభట్ల
93480 06669