విజయవాడ, (ఆంధ్రప్రభ) : అద్భుత కాంతి దీపాలతో శైవక్షేత్రాలు నమశ్శివాయ మంత్రాలతో పరవశిస్తుండగా.. లక్షల భక్తుల హరహర మహాదేవ్ మహాదేవ్ శంభో శంకర భక్తిమయ నినాదాలు దీపాల ముందు ప్రదక్షిణం చేస్తుండగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం నాగుల చవితి పర్వదిన ప్రదోష వేళ డిప్యూటీ కలెక్టర్ కేఎస్.రామారావు పర్యవేక్షణలో వందల దీపాలు మల్లికార్జునునికి వెలుగు చప్పట్లు చరుస్తుండగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ దివ్య రచనాసంకలనం జయజయ శంకర మహాభాగ్యాల పరమ శివగ్రంథాన్ని రాష్ట్ర భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్రకు అందజేసి వేదమంత్ర ధ్వనుల మధ్య ఆవిష్కరింప చేశారు.
గత రెండుమాసాలుగా ఎడతెరపి లేకుండా అమ్మవారి సన్నిధానంలో అద్భుత శ్రీ కార్యక్రమాలు లక్షల కొలది భక్తులకు సమర్థవంతంగా నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రోత్సాహాన్ని సంపూర్ణంగా పొంది, దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ అభిమానాన్ని చూరగొన్న దుర్గా మల్లేశ్వర దేవస్థాన కార్యనిర్వహణాధికారి రామారావు, గత 7 నెలలుగా 5 అమోఘ గ్రంథాలను ఆవిష్కరింప చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిని సైతం ఆకర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ అపూర్వ అమోఘ గ్రంథాలను రచిస్తూ, సంకలనీకరిస్తూ పవిత్ర సంచలనాలు సృష్టిస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రమణీయ గుణాలతో, అచ్చమైన భక్తితత్వంతో ఎంతో రూపమాధుర్యంగా రుద్రకారుణ్యాన్ని జయజయ శంకర గ్రంథంగా ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరునికి సమర్పించడం మంగళమయ మహాలింగార్చనగా అర్చక బృందాలు, కార్యనిర్వహణాధికారితో ప్రశంసించడం పురాణపండ అమోఘ సాధనకు లక్ష్యంగా చెప్పక తప్పదు.
ఇక్కడే గత మూడు మాసాల క్రితం శ్రావణమాసం ఆరంభంలో విఖ్యాత ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు, పురాణపండ శ్రీనివాస్ రెండు అమోఘ గ్రంథాలు ఆవిష్కరించి ఆశీర్వచనపూర్వక మంగళాశాసనాలు చేశారు. ఈ మంగళమయ జయజయ శంకర గ్రంథాన్ని ఆవిష్కరించిన కొల్లు రవీంద్ర బుక్ ని ఆసక్తిగా పరిశీలించి కనులకు హత్తుకుని తనుకూడా స్వయంగా తీసుకెళ్లారు.
పవిత్రకార్యాలను భుజాలకెత్తుకోవడంలో తొలి వరుసలో ఉండే డిప్యూటీ కలెక్టర్ రామారావు మాట్లాడుతూ అరిష్టాలు పోగొట్టే మహామంత్రరాశిని జ్ఞానంతో పోగేసి అఖండ కాలస్వరూపంగా పురాణపండ శ్రీనివాస్ జయజయ శంకరగా అందించడం పట్ల అభినందనలు తెలిపారు. పరమ పుణ్యాల కార్తీకంలో ఈ గ్రంథం శివకారుణ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర భావించారని పండితవర్గాలు తెలిపాయి.