Friday, November 22, 2024

మూలా నక్షత్ర వేడుకలో పారవశ్యంలో పురాణపండ

విజయవాడ, (ప్రభ న్యూస్‌) : పరమ పవిత్రమైన మూలానక్షత్ర సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మహా సరస్వతీ అలంకార మహా సంరంభ మహోత్సవాల్లో ప్రముఖ రచయిత, శ్రీ శైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌ రచించి సంకలనం చేసిన దేవీం స్మరామిస, దుర్గే ప్రసీద పేరిట రెండు మహా మంగళగ్రంథాలు విజయవాడ ఇంద్రకీలాద్రి, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరుల్లోని అనేక అమ్మవార్ల ఆలయాల్లోనూ, తెలంగాణలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోని అనేక దేవాలయాల్లో విశేషంగా ఆకట్టుకున్నాయి.

కిమ్స్‌ ఆసుపత్రుల చైర్మన్‌, మాజీమంత్రి బొల్లినేని కృష్ణయ్య సౌజన్యంతో శాక్తేయ గ్రంథంగా శోభిల్లిన దేవీం స్మరామి గ్రంథాన్ని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్‌ కేఎస్‌.రామారావు దుర్గమ్మ జ్ఞాపికతో పాటు పంచారు. ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య ఈవొ రామారావు శ్రీనిధి దివ్యభవ్య గ్రంథాన్ని ఆవిష్కరించి, వందల మందికి పంచారు.

వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్‌ రచనా సంకలనంగా భక్తిమయ రాగరంజిత గానస్తోత్రాలతో తేజరిల్లిన దుర్గే ప్రసీద గ్రంథం ఒక శుభదృష్టిగా గోచరించిందని భక్తులు వెల్లడించారు. ఈ రెండు గ్రంథాలకూ రచనా సంకలనకర్తగా వ్యవహరించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ……

మనసుకు, మాటకి అందని ఈ దివ్య వైభవాలు అందడానికి కారణభూతులైన బొల్లినేని కృష్ణయ్యకు, కొర్రపాటి సౌజన్యకు, దుర్గామల్లేశ్వర దేవస్థానం డిప్యూటీ కలెక్టర్‌ కేఎస్‌.రామారావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉచిత వితరణ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొని, పురాణపండ గ్రంథాలను పంచిపెట్టారు. ఇంద్రకీలాద్రిపై పుస్తక ప్రసాదం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ధర్మపత్ని నారా భువనేశ్వరి బాహాటంగా అర్చకపండితులతో పేర్కొనడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement