Friday, October 18, 2024

అచ్చమైన, స్వచ్ఛమైన పవిత్ర సేవకు పచ్చ జెండా ఊపిన బొల్లినేని కృష్ణయ్య…

  • అందమైన భాషతో, అందచందాల గ్రంధాలతో ఆకట్టుకున్న పురాణపండ

నెల్లూరు : విద్య, ధనం, పాండిత్యం… ఇలా ఎన్నో ప్రత్యేక గుణాలున్నా అసూయ, అహంకారం లాంటి అవలక్షణాలు లేకుంటేనే అవి రాణిస్తాయని ఎన్నో సభల్లో రకరకాల ఉదాహరణలతో చెప్పడమే కాకుండా, తన అపురూప రచనల్లో ప్రత్యక్షంగా దర్శనమిచ్చేలా అద్భుత గ్రంధాల కవర్ పేజీల్లో సైతం గొప్ప ఆకర్షణీయ కొటేషన్స్ లను ప్రచురించే ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ ఇటీవల సౌందర్య లావణ్యాలతో తిరుమల శ్రీవారిపై అందించిన ప్రత్యేక సంచికకు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పకులుగా వ్యవహరించడం, సౌజన్యాన్ని అందించడాన్ని ఎన్నో జన్మల పుణ్య ఫలంగానో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొందరు ఐఏఎస్ అధికారులు, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు అభినందనలు తెలిపారు.

దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాతో విడదీయరాని సంబంధమున్న బొల్లినేని కృష్ణయ్య దేశ దేశాల తెలుగువారికి అంతర్జాతీయ కమ్మ సంఘం అధ్యక్షునిగా, ఒకనాటి శాసనసభ్యునిగా,కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ గా సుపరిచితులైనా… ఇటీవల గత సంవత్సరకాలంగా చేస్తున్న ధార్మిక గ్రంధాల వితరణ కార్యక్రమాలు చారిత్రాత్మకంగా నిలుస్తాయని అన్ని పార్టీల రాజకీయ నేతలు బొల్లినేని కృష్ణయ్యను అభినందించడం విశేషం.

దేవాదాయశాఖా మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నెల్లూరు జిల్లాకు విచ్చేసి తొలి కార్యక్రమంగా పాల్గొన్న శ్రీ తల్పగిరి రంగనాయక స్వామి వారి దేవాలయంలో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డితో కలిసి ఆవిష్కరణ చేసిన రెండు మంగళ గ్రంధాలను ఈ జిల్లా భక్త సమూహానికి బొల్లినేని కృష్ణయ్య ఎంతో సంస్కారవంతంగా ఈ పరమాద్భుత గ్రంధాలని వేలకొలది అందించి తెలుగుదేశం వర్గీయులనే కాకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నారనే చెప్పాలి.

బెజవాడ కనకదుర్గమ్మకు ఇటీవల దేవీ నవరాత్రుల వైభవాల్లో సుమారు లక్ష శ్రీనిధి పరమ శోభాయమాన గ్రంథ ప్రతులను అందించిన ఘనత బెజవాడ ఇంద్రకీలాద్రిపై చరిత్రాత్మకమని సాక్షాత్తూ మీడియా ముందే శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు పేర్కొనడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాదాయ శాఖ అధికారవర్గాలచే, పండిత అర్చకవర్గాలచే శభాష్ ల జేజేలు కొట్టించింది. గత సంవత్సరం కార్తీక పొర్ణమికి తమ తల్లి గారి పేరిట చక్కని శివ సౌందర్య స్తోత్రాలు సంపుటిని నెల్లూరు జిల్లాలో ప్రత్యేక శివాలయాల్లో బొల్లినేని అందించారని….. ఈ నాటికీ శివ భక్తులు ఈ అందమైన పాకెట్ గ్రంధాన్ని పారాయణం చేస్తున్నారని ఆయా ఆలయాలవారు ముక్త కంఠంతో చెప్పడం విశేషం.

విజయవాడ, తిరుమల, యాదగిరిగుట్ట, నెల్లూరు… వంటి ఎన్నో మహా నగరాల ఆలయాల్లో గత సంవత్సరకాలంగా సౌజన్యమూర్తులైన బొల్లినేని కృష్ణయ్య పేరు ప్రశాంతంగా, నిరాడంబరంగా, భక్తిమయంగా వినిపిస్తోందని ఆలయ వర్గాలు సైతం చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ప్రముఖంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ని మెచ్చుకోవాలని పండిత మేధోవర్గం చెబుతోంది.

- Advertisement -

సంస్కృత సాహిత్యంలోని స్తోత్ర, దండక, కవచాల శక్తుల్ని, వాటి ప్రభావాల్ని అమోఘంగా తెలియజేసి ఈ పవిత్ర గ్రంథాల్ని నిత్య పారాయణీయాలుగా మలచి … ఈ పుస్తకాల వెంట పాఠకులు పాఠకులు పరుగులు పెట్టేలా మలచడంలో శ్రీనివాస్ ప్రత్యేకతని…. పవిత్ర గ్రంధాల ముందు, వెనుక, పైన, క్రింద సౌందర్య భరితంగా అరుదైన చిత్రాలతో, మహా సౌందర్యాలు పొంగులెత్తే భాషతో పుస్తక పరిమళాలను రూపొందించడం కేవలం కనకదుర్గమ్మ కటాక్షమేనని బెజవాడ దుర్గమ్మ అర్చక ప్రధానార్చక బృందం పురాణపండకు మంగళశాసనాలు చెయ్యడం ముదావహం.

ఇప్పుడిక గతంలో వలెనే కార్తీక వనభోజనాల్లో, కార్తీక మాసమంతటా పారాయణం చేసుకునేలా కొన్ని దివ్యగ్రంథాలను ఈ దీపావళి సందర్భంలో అందిస్తారని బొల్లినేని సన్నిహితులంటున్నారు. మంచికి, మర్యాదకు, మానవీయతకు పేరుపొందిన బొల్లినేని కృష్ణయ్య తానెంచుకున్న అసాధారణ శక్తి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నిరాడంబరుడైన నిస్వార్ధ సేవాపరాయణుడు కావడం, నిజంగా అచ్చమైన స్వచ్ఛమైన మంచి మనస్సున్నవారు కావడం, భాషాసౌందర్యంలో, వాక్చాతుర్యంలో, విషయ శోధనలో, రచనా పటిమతో, ధార్మిక గ్రంథ రచనల్లో పారవశ్యపు అనుభూతుల మేలిమి వ్యక్తిత్వం కావడం ఈ పవిత్ర గ్రంథ ఉద్యమానికి బొల్లినేని కృష్ణయ్యకు సంతోషకరమైన విషయమని సాహిత్యవేత్తలు, పండితులు పేర్కొంటున్నారు. జీవన వైభవంలో ప్రతీ మలుపులో ఇన్నో కష్టాలెదుర్కొన్న పురాణపండ తన హృదయ సంస్కారాన్ని తిరుమల క్షేత్రానికి దాసోహం చేశారని బొల్లిని కృష్ణయ్య అనుచర గణం పేర్కొంటోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతం పురాణపండ శ్రీనివాస్ పలు ధార్మిక, ఆధ్యాత్మిక, తాత్విక గ్రంధాలను ప్రచురించిన ఘట్టాలు సైతం నెల్లూరు వాసులకెరుకే.

మరీ ముఖ్యాంశమేమంటే … ఎన్నో పవిత్రమైన అందాల్ని, అద్భుతాల్ని, ఆనందాల్ని వర్షించేలా బొల్లినేని కృష్ణయ్య వితరణ చేస్తున్న ప్రతీ ధార్మిక గ్రంధంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల తిరుమల దర్శన మంగళకర చిత్రంతో పాటు దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేరు కూడా ప్రధానంగా ప్రచురించి శ్రీ కటాక్షంగా పంచడం తెలుగుదేశీయులను, ఆనం వర్గాన్ని ఆనంద పరుస్తోంది. అయితే … బెజవాడ , శ్రీశైలం పుణ్య క్షేత్రాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తానే స్వయంగా ముఖులకు ఈ గ్రంథ సంపదను అందజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement