Saturday, November 30, 2024

పోలి పాడ్యమి.. దీపారాధన

స్త్రీలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే నోముల్లో మార్గశిర శుక్ల పాడ్యమినాడు ఆచరించే పోలి స్వర్గం నోము ఒకటి. ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉన్న ఈ నోమును, నేటి తరం స్త్రీలను కూడా ఆచరింప చేస్తోంది. కార్తీకమాసం నెలరోజుల పాటూ భక్తి ప్రపత్తులతో ఆరాధనా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన మహిళలు, అమావాస్య మర్నాడు, మార్గశిర మాసం తొలిరోజు పాడ్యమి నాడు దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో కార్తీకమాసం పూజలు వ్రతాలు నోములు పూర్తైనట్టు. ఆ రోజునే పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహా విష్ణువును ప్రార్థించి ”పోలి” వైకుంఠానికి చేరుకున్న రోజును పోలి స్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాథ. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన ”పోలి”కి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా అమిత ఆసక్తి. అదే ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది అత్త అహంభావం. అందుకే కార్తీకమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది.
కోడళ్లతో కలిసి నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడు తుందోనని దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ అందుబాటులో ఇంట్లో లేకుండా జాగ్రత్త పడేది అత్త. అయితే పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసి, కవ్వానికి ఉన్న వెన్నని రాసి పోలి దీపాన్ని వెలిగించేంది. ఇలా కార్తీకమాస మంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు నదీస్నానం చేసి, కార్తీక దీపాలను వదిలేందుకు అత్త వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి రోజులాగే కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్ట సాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలు దీవించగా, ఆమెను ప్రాణంతో స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారు దేవదూతలు.
అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్త, కోడళ్లూ… ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు. పోలితో పాటూ తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంతో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అందుకే అమావాస్య మర్నాడు పాడ్యమి రోజు పోలిని తల్చుకుంటూ ఆమెలా స్వర్గ ద్వార ప్రవేశం కలగాలని కోరుకుంటూ…తెల్లవారు ఝామునే నదిలో స్నానమాచరించి దొప్పలలో దీపాలు వెలిగించి వదిలిపెడితే కార్తీక మాసం అంతా నదీ స్నానమాచరించిన, దీపాలు వెలిగించినంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. కార్తిక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కూడా విశ్వాసం.

– రామకిష్టయ్య సంగనభట్ల

Advertisement

తాజా వార్తలు

Advertisement