Monday, July 1, 2024

రాజుల ధనార్జనకు మూలస్తంభాలు…!


ప్రభువు అనగా రాజు- అధిపతి. ధనార్జన అన గా ధన సంపాదన. రాజులకు ధనం వృద్ధి పొందే మార్గాలు పలు విధాలు. రాజులు ధనార్జన చేయనిదే రాజ్యపాలన చేయలేరు. ఆర్జన లేకుంటే ప్రగతి- పురోగతి వుండవు. ప్రజలకు సేవ చేయడం దుర్లభం అవుతుంది. ప్రజాసేవయే రాజులకు ప్రధాన లక్ష్యం కదా! ఈ విషయాలనే భర్తృహరి తన సుభాషితములలో లోకానికి అందించినాడు. రా జుల ధర్మాన్నీ, కర్తవ్యాన్ని ఉపదేశించాడు. ఒక ప ద్యంలో ఇలా తెలిపినాడు కవి. రాజులకు హెచ్చరిక చేస్తూ-
తే.గీ|| ధరణి ధేనువు బిదుకంగ దలచితేని
జనుల బోషింపు మధిపవత్సముల మాడ్కి
జనులు పోషింప బడుచుండ జగతి కల్ప
లత తెఱంగున సకల ఫలంబులొసగు|| అంటూ ఓ రాజా! గోవులాంటి భూమి నుండి నీవు ధనాన్ని పిదుకదలచినట్లయితే ఆవుదూడను పోషించి న విధంగా ప్రజలను చక్కగా పోషించు. ఆ రీతి గా పోషించినచో భూమి కల్పలత వలె నీవు కోరి న ఫలాలనన్నింటినీ అందిస్తుంది.
రాజును యిలా సంబోధిస్తూ సంపదను ఎలా ఆర్జించుకోవాలో ఉపాయాన్ని చెప్పినాడు. రాజా! ధరణి అనగా ధేనువు అనీ, ధేనువులాంటి ధరణి అని రెండు విధాలు. భూమి ధేనువు లాంటిది. ప్రజలు దూడ ల్లాంటి వారు. దూడ క్షేమంగా వుంటేనే ఆవు సమృద్ధిగా పాలు యిస్తుంది. అలాగే ప్రజలు క్షేమంగా వుంటేనే భూమి రాజులకు సంపదలను ప్రసాదిస్తుంది. కావున సంపదలను కోరి రాజు ప్రజలను ఎంతో జాగ్రత్తగా పరిపాలించాలి. అలా పరిపాలించినపుడు భూమి కల్పలతగా ధనధాన్యాది రూప ఫలా లను అతనికి సమకూరుస్తుంది. ఆ రీతిగా సంపన్నుడైన రాజు రాజ్యా న్ని చక్కగా పరిపాలిస్తాడు. ప్రజలను సరిగా పోషించిన రాజు పుణ్యా న్ని ప్రజలు అనుభవిస్తారట. ఇక ప్రజలు చేసే పాపముల ఫలాన్ని రాజు అనుభవిస్తాడట. భాగవతంలో పోతనగారు యిలా తెలిపారు.
”ప్రజల బ్రోవని రాజు ప్రజల చేత
నపహృత సత్పుణ్యుడై వారు గావించు
ఘన పాపపులము దాననుభవించు||” అని అన్నారు.
మహాకవి కాళిదాసు రఘువంశంలో దిలీపుని ప్రజాపాలనను వివరిస్తూ, ”ప్రజానాం వినాయాధానాద్‌/రక్షణా ద్భరణాదవి
సపితా పితరస్తానాం/కేవలం జన్మ హేతవ:||” అని అంటాడు. దిలీప మహారాజు తన ప్రజ లను రక్షిస్తూ, పోషిస్తూ వారికి తండ్రిగా ఉన్నాడట. ఇంక ఆ ప్రజల తల్లిదండ్రులు వారి జన్మకు కారణభూతులుగా మాత్రమే ఉన్నారట. అనగా వారి రక్షణ, పోషణ భారాలన్నీ తానే వహిస్తున్నాడని భావం.
ఇంక రాజనీతి పలువిధాలు. రాజుల నీతి కొన్నిచోట్ల సత్యముతో గూడి మరికొన్ని చోట్ల అసత్యంతో కలిపి, ఒకచోట కఠినంగాను, మరొక చోట చెవులకింపుగానూ, మరొక చోట బాధాకరంగానూ, ఒకచోట కరుణతో, ఒకచోట పిరికితనాన్ని చూపేదిగా, ఒకసారి దానగుణం చేసేదిగానూ, మరొకసారి నిత్యమూ వ్యయం చేయించేదిగానూ, ఒకచోట సంపాదించేది గానూ ఇలా పలు విధాలుగా మారుతూ వుంటుంది.
కావున ఆ రాజు పాలనలో ప్రజలు గుణవంతుడైన రాజునాశ్రయించాలి. గుణహీనుడైన రాజులను ఆశ్రయించరాదు. ప్రయోజనం ఉండదు. రాజ ధర్మాలు పలువిధాలు. శాసించడం- సత్కీర్తి- బ్రాహ్మణ పరిరక్షణం- సత్ప్రాత్రదానం- సుఖానుభవం- ఆ పన్నుల సంరక్షణం- మిత్ర రక్షణ అనే ఆరు గుణాలు. రాజధర్మం దుష్టశిక్షణ- శిష్టరక్షణ ముఖ్యం. శాసనం ద్వారా నియమబద్ధంగా పాలించాలి. అపుడే పరిపాలన చక్కగా సాగుతుంది. రాజుకు మంచి పేరు ప్రతిష్ఠలు- కీర్తి లభిస్తాయి. రాజులు సత్ప్రాత్రులకు దానాలు చేస్తూ వుండాలి. ఇవి రాజులకు ఉండవలసిన ముఖ్యమైన గుణాలు. ధనార్జనకు మూలస్తంభాలు. పేదలకు కూడు- గూడు- గుడ్డ నొసగే రాజుల జీవితం ధన్యం. అదే రాజులు చేసే సమాజహితం.

Advertisement

తాజా వార్తలు

Advertisement