ప్రతివ్యక్తిలోనూ మూడు గుణములు ఉంటాయి. వాటినే సత్వ రజస్తమో, గుణాలుగా చెపుతారు. వ్యక్తిలో ఏ గుణం ప్రధానంగా నిలిస్తే దానికి తగిన ప్రవర్తన వెలుగు చూస్తుంది. అయా గుణాలను బట్టి వారి ఆరాధనా విధానాలుంటాయి. సాత్వికగుణ ప్రధానులు దేవతారాధన చేస్తారు. రాజసగుణ ప్రధానులు యక్షులను, రాక్షసులను ఆరాధిస్తారు. తామసగుణ ప్రధానులు భూతప్రేత పిశాచగణాలను, సప్తమాతృకలనూ సేవిస్తారు.
తపస్సు, దానధర్మాలనే సాధనాల ద్వారా మానవులు దోష విముక్తులౌతారు. తపస్సులో కాయికము, వాచికము, మానసికములని మూడు విధాలు. శరీరం ద్వారా పరులకు హితమైన పనులు చేసేది కాయిక తపస్సు. మాటలద్వారా పరులకు సాంత్వన గూర్చేది వాచిక తపస్సు. మననంద్వారా, భగవద్ధ్యానం ద్వారా చేసేది మానసిక తపస్సు. సాత్విక సాధన అంత:కరణాన్ని శుద్ధిచేస్తుంది. రాజస సాధన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. తామస సాధన పుణ్యాన్నివ్వదు సరికదా ఆయాసాన్నీ, దు:ఖాన్ని కలిగిస్తుంది.
”తపతీతి తపం”.. తపించడమే తపస్సు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, దానిని సాధించేందుకు, ఏకాగ్రచిత్తంతో, త్రికరణశుద్ధిగా శ్రమించడం తపస్సు. శాస్త్ర నిర్దేశిత మార్గంలో తపించడం సాత్వికగుణ లక్షణం. శాస్త్రం అంటే ప్రక్రియ ఆధారితంగా, హేతుబద్ధంగా చేసే వివేచన. వీరు మనసులోని మలినాలను కడిగి వేసుకొని జ్ఞానప్రాప్తికి తపిస్తారు. దానితో వారి జీవితాలు తేజోమయం కావడమే కాక వారి చుట్టూ ఉన్న సమాజంలో కూడా ఆ స్పూర్తినీ, దీప్తినీ నింపగలుగుతారు. సాత్వికులకు బలం దైవమే. భక్తి, జ్ఞానాలు వీరి మార్గంలో ఉపకరణాలు. సాత్విక తాపసులు తాము ప్రగతిని, సుగతినీ సాధించడమే కాక ఇతరులకూ ఆ సౌగంధ్యాన్ని పంచుతారు. మునులు ఋషులు సాత్విక తపస్సుకు ఉదాహరణలు.
రాజస, తామస గుణప్రధానులు చేసే తపస్సును ఆసురీస్వభావ తపస్సుగా చెపుతుంది భగవద్గీత. శాస్త్ర విరుద్ధమైనది. వీరు అ#హంకారం, దంభం, కామం, రాగాదులు మనసును గ్రమ్మగా ఘోరంగా తపిస్తారు. ఏ మార్గంలోనైనా ఫలితాలు సాధించడమే లక్ష్యంగా తపిస్తూ వీరు శరీరాన్ని, ఇంద్రియాలను కృశింపచేసుకుంటూ ఉగ్రమైన తపస్సును చేస్తారు. వీరి బలం రాక్షసగుణమే. కామాదులే వీరికి ప్రేరణలు. ఇలాంటి వారు తాము వివేకభ్రష్టులు కావడమే కాక తమనాశ్రయించిన వారినీ నట్టేట ముంచుతారు. రావణుడు, హిరణ్యకశిపుడు మొదలైనవారు రాజస తామస తపస్సుకు ఉదాహరణలు. రావణుడు కామంచేత, హిరణ్యకశిపుడు కోపము చేత పతనమైనారు.
సాత్విక సాధన వ్యక్తుల బుద్ధిని ప్రచోదన చేస్తుంది. మనోస్థైర్యం, దు:ఖాదులు క్రమ్ముకున్నా చెదరని ధైర్యసాహసాలు, ఉత్సాహం, స్పూర్తి, విజ్ఞతలు సాత్విక సాధన వల్ల కలిగే ఫలితాలు. తీసుకునే ఆహారం కూడా తదనుగుణమైన ఫలితాన్ని ఇస్తుంది.
మానవులు సాధారణంగా దానాలు చేస్తుంటారు. ”దాతవ్యం ఇతి దానం” దానము అంటే ఇవ్వవలసినది లేదా ఇవ్వదగినది. ప్రత్యుపకారం కోరకుండా, ఇతరులకు శ్రద్ధగా ఇచ్చినప్పుడే అది ఉత్తమదానంగా పరిగణింపబడుతుంది. త్యాగమనేది దీని లక్షణం. దేశకాల పాత్రాదులను విచారించి అర్హత ప్రాతిపదికగా ఇవ్వడమే దానవిధానం.
అలాగే స్వయంగా తానచరించేది ధర్మంగా చెపుతుంది శాస్త్రం. ధర్మం అంటే.. విధిగా నిర్వహించవలసిన కార్యాలను శ్రద్ధగా అంత:కరణ శుద్ధిగా ఆచరించడమే ధర్మం. చేసే దానాన్ని కర్తవ్యంగా భావిస్తూ చేస్తే అది ధార్మిక దానంగా చెప్పబడుతుంది. నేను ఇస్తున్నాను అనే భావనతో కాకుండా ఇతరులకు ఇచ్చేందుకే పరమాత్మ దానం చేసే అవకాశం నాకిచ్చాడనే భావనతో చేసే దానం వ్యక్తిని ఉన్నతుడిని చేస్తుంది.
సాధకులు భౌతిక జీవితంలోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా త్రిగుణాల స్వభావాలను తెలుసుకొని సత్వగుణ భూషితులైతే ఉత్తమ ఫలితాన్ని సాధించగలుగుతారు.
పాలకుర్తి రామమూర్తి