Friday, January 10, 2025

…పరతత్త్వాన్వేషి!

మదిరాపాన మత్తులై యాదవులందరూ పరస్పరం కొట్టుకొని మరణించారు. ఆనాటి సాయంత్రాన సముద్రతీరంలో భావనార‌హిత స్థితిలో కృష్ణపరమాత్మ ఏకాంతంలో ధ్యానమగ్నుడై తన ఉఛ్ఛాస నిశ్వాసాలను గమనిస్తున్నాడు. నెమ్మదిగా మురళిని తీసి పూరించడం ఆరంభించాడు. సముద్ర తరంగాలు తీరానికి కొట్టుకొని చేసే సవ్వడులు వేణునాదానికి తాళం వేస్తున్నట్లు ఉన్నాయి. శృతి కలిపిన సముద్ర హూరు తప్ప మరేమీ వినిపించని ఆ నిశీధిలో మురళీరవానికి ప్రకృతి పరవశిస్తున్నది. తన గానామృత లహరిలో పరమాత్మా రమిస్తున్నాడు. చుట్టూ అనంతమైన చీకటి… తన లయ స్థానమైన చీకటిని అతిక్రమించిన వేణుగానం… చీకటి కావలనున్న వెలుగులో లయమౌతూ ఉన్నది. అది ఆరోహణ..
రసమయ గానామృత లహరులు చూపిన మార్గంలో చీకట్లను చీలుస్తూ వెలుగు రేఖలు నెమ్మదిగా భూమిపై ప్రసరిస్తున్నాయి. ఇది అవరోహణ. గానం యొక్క ఉత్పత్తి స్థానాన్ని లక్ష్యంగా చేసుకొని, బృందావనంలో గోపికలు చేరినట్లుగా, దూరంగా ఎవరో వస్తున్న జాడలు కనిపించాయి. బృందావనం ప్రేమైకమూర్తియైన కృష్ణతత్త్వానికి ప్రతీక. త్రికరణ శుద్ధిగా కృష్ణుని ఆరాధించే సాధకులకు గోపికలు ప్రతీకలు. ఏకాకృతితో అంతటా నిండిన ఉత్పత్తి స్థానాన్ని పట్టుకోవడానికి ఏకాగ్రతకావాలి… నిరంతర చింతన కావాలి… అత్మతత్త్వ వివేచన కావాలి. అత్యంత గహనమైన కృష్ణస్వామి హృదయాన్ని అన్వేషిస్తూ అక్కడికి చేరుకున్నవాడు ఉద్ధవుడు.. ఉద్ధవునికి అక్కడ తానున్న ప్రదేశంకాని, ఆకాశంలో నక్షత్రాలు కాని, దూరంగా సముద్రం కాని, కృష్ణుని రూపంగానీ.. ఏమీ కనిపించడం లేదు… రసమయ జగత్తులో తన్మయుడై తనను తాను మరచి మురళీగానాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాడు ఉద్ధవుడు. అర్ధరాత్రి వేణుగాన మాగిపోయింది.. అసంకల్పితంగానే అస#హన చిత్తుడైన ఉద్ధవుని చూస్తూ.. ”గానాన్ని ఆపినందుకు బాధగా ఉన్నదా?” చిరునవ్వుతో అడిగాడు కృష్ణపరమాత్మ. వేణుగానానికి మూలమైన నీవే యెదుట ఉన్నప్పుడు బాధకు కారణమేమిటి.. మిత్రమా… అన్నాడు ఉద్ధవుడు.
నిర్వికల్పస్థితిలో సముద్రంవైపు నడుస్తున్న కృష్ణపరమాత్మను అనుసరిస్తున్న ఉద్ధవునితో… కృష్ణుడు మంద్రస్వరంతో ఉద్ధవా! యోగాభ్యాసక్రమంలో వేణుగానామృతంలో లయమయ్యేందుకు అవసరమైన పరిణతిని సాధించావు. మిత్రమా సాధనలో భూమివలె సహనాన్ని సంతరించుకోవాలి. పతనానికి ద్వారముల వంటి అహంకార, మమకారాలకు సూర్యుని వలె దూరంకావాలి. అగ్ని, చంద్రుల వలె నిర్వికారతను సంతరించుకోవాలి. లేడి ఇంద్రియ వివశత్వానికి ప్రతీక. దానిని దూరంచేసుకోవాలి. తుమ్మెదలవలె గుణగ్రహణ శక్తిని పెంపొందించుకోవాలి. కొండచిలువలాగా దొరికిన దానితో సంతృప్తిపడడం నేర్చుకోవాలి. సంసార రూపంలో ఆకర్షించే మోహాదులలో శలభాలవలె మ్రగ్గిపోని విధానం నేర్చుకోవాలి. ఆడ ఏనుగుపై అత్యాసక్తిని పొందే మగఏనుగువలె కాకుండా ఆకర్షణలకు దూరంకావాలి. ఆశాపరత్వాన్ని, నైరాశ్యతను విడనాడాలి. విశ్వాసమే కొండంతబలం.. విశ్వాస రహితులు దేనినీ సాధించలేరు. సాధించగలమన్న విశ్వాసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ప్రేరణనిస్తుంది. మిత్రమా.. నలుగురు ఉన్నచోట వివాదాలు సహజంగా ఉంటాయి.. అంతర్ముఖులై మానావమానాలకు దూరంగా ఏకాగ్రచిత్తులైన జ్ఞానులకు మాత్రమే పెంజీకటి కావలనున్న వెలుగురేఖలు దర్శించే యోగం కలుగుతుంది. మౌనమే ఆదరణీయం అంటూ నిశ్చలమౌన మూర్తియై సముద్ర తరంగ మృదంగనాదాలలో రమిస్తున్న కృష్ణపరమాత్మను అనుసరిస్తూ.. సముద్ర స్నానాన్ని ఆచరించాడు ఉద్ధవుడు. నెమ్మదిగా ఉదయరేఖలు భూమిపై పరుచుకుంటున్నాయి. కృష్ణుని బోధలు చైతన్యాన్ని ప్రసాదించగా, ప్రసన్నచిత్తుడైన ఉద్ధవుడు… చెట్లగుబురులలోకి కృష్ణునితో నడిచాడు.

  • పాలకుర్తి రామమూర్తి
Advertisement

తాజా వార్తలు

Advertisement