Sunday, November 17, 2024

ధర్మం మర్మం (ఆడియోతో..)

శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.

ఈరోజు పరశురామావతార వృత్తాంతంపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
పరశురామావతారం
జమదగ్ని, రేణుకులకు పుత్రునిగా బృగువంశంలో అవతరించిన మహానుబావుడు పరశురాముడు. తన తండ్రి నుండి గోవును అపహరించిన కార్తవీర్యార్జున్ని వధించి గోమాతను రక్షించిన అద్భుతమైన గోర క్షాపరాయణుండు పరుశురాముడు. బ్రాహ్మణుడి నుండి ఎంతటి వారైనా అతని ఇష్టానికి విరుద్ధంగా ఏదీ తీసుకోలేరని చాటిన ఛాత్ర, బ్రాహ్మ, తేజో సంపన్నుడు పరశురాముడు. తండ్రి జమదగ్ని ఆజ్ఞానుసారం తల్లి, సోదరుల శిరస్సును ఖండించి పితృ వాక్య పరిపాలకుడని నిరూపించుకున్నాడు. కుమారుడిని అనుగ్రహించిన జమదగ్ని వరం కోరుకోమనగా తల్లి, సోదరులను తిరిగి బ్రతికించమని కోరుకున్నాడు. పితృ భక్తిని, మాతృభక్తిని, సోదర ప్రేమను చాటిన మహోద్దాప్త చరితుడు పరశురాముడు. అధికారం, అంగబలం, అర్థబలం ఉన్నాయని గర్వించి ఒక క్షత్రియుడు తన తండ్రిని వధించడం వలన ఆగ్రహించి 21 సార్లు భూమండలం అంతా తిరిగి, క్షత్రియులందరిని వధించిన పరాక్రమశాలి పరశురాముడు. వారి ర క్తంతో పంచ ఆపములను అనగా పంచ నదులను ఏర్పరిచాడు. ఈ పంచనదులు ఉన్న ప్రాంతాన్నే నేడు మనం పంజాబ్గా వ్యవహరిస్తున్నాం. ఈ విధంగాదైవ భక్తి, మాతృ భక్తి, పితృ భక్తి, గురు భక్తి, దేశ భక్తి ఐదు భక్తులను తనలో జీర్ణించుకున్న మహనీయుడు పరశురాముడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి వారిని ధనుర్విద్యా పారంగతులను చేసిన ఉత్తమ గురువు పరశురాముడు. తన శిష్యుడైన భీష్ముడు చేతిలో ఓటమి పాలయ్యి శిష్య వాత్సల్యాన్ని చాటిన వాత్సల్య మూర్తి. నేటికి గంధ మాదవ పర్వతంలో తపోదీక్షలో ఉన్న తపో మూర్తి, చిరంజీవి మన పరశురాముడు.
శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement