Sunday, November 24, 2024

పరహితమె పరమ ధర్మం

”పరనారీ సోదరుడై
పరధనముల కాస పడక పరులకు హితుడై
పరులు తను పొగడ నెగడియు
పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!”
ఈ లోకంలో గొప్పవాడెవడు అంటే పైన చెప్పబడిన ఐదు లక్షణాలు ఎవరిలో ఉంటాయో అతడే అని చెబుతుంది ఈ పద్యం. ఆ ఐదు లక్షణా లు ఇవే- పరస్త్రీల పట్ల సోదర భావం చూపేవాడు, పరుల సొమ్ము ఆశిం చనివాడు, ఎల్లప్పుడూ పరుల హితమునే కోరేవాడు, పరులు తనను ప్రశంసించేలా ప్రవర్తించేవాడు, పరులు తనపై కోపించినా తిరిగి వారిపై కోప పడనివాడు ఈ ఐదు లక్షణాలు కలవాడే మహనీయుడు అని నిర్వచించింది సుమతీ శతకం.
నారాయణ పండితుడు తన హితోపదేశం’లో ఇలా బోధించాడు.
”మాతృవత్‌ పర దారేషు, పరద్రవ్యేషు లోష్టవత్‌
ఆత్మవత్‌ సర్వ భూతేషు, య: పశ్యతి స పండిత:”
పరస్త్రీలను తల్లులుగా, పరుల సొమ్మును మట్టిబెడ్డలుగా, సకల ప్రాణు లను తనతో సమానంగా ఎవడు చూడగలడో అతడే అసలైన జ్ఞాని అని ఈ శ్లోకార్థం. ప్రహ్లాదుడు ” కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడ”ని భాగవతం చెబు తున్నది. ప్రహ్లాదుని ప్రవర్తన నేటి యువతకు ఆదర్శం కావాలి.
అర్ధాంగిని తప్ప మరే స్త్రీని కామవాంఛతో చూడరాదని శాస్త్రాలు చెబు తున్నాయి. తన తల్లిని, అక్కచెల్లెళ్ళను ఎంత గౌరవంగా చూస్తామో, లోకంలోని ఇతర స్త్రీలనూ అంతే గౌరవంగా చూడాలి. అంతేకానీ, కన బడిన ప్రతి స్త్రీని కామవాంఛతో చూచేవాడు కుక్కతో సమానం. ఈ విష యాన్ని పిల్లల మనసులలో పెద్దవారు దృఢంగా నాటితే మనమీనాడు చూస్తున్న అకృత్యాలను నివారించవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ పరనారీ సోదరుడై ప్రవర్తించాలి. రావిపాటి తిమ్మప్ప అనే కవి పరస్త్రీలను ఉత్త ములు, మధ్యములు, అధ ములు ఎలా చూస్తారో ఇలా చెప్పారు.
”లాచి పరాంగనల్‌ వర విలాస మనోహర లోల దృష్టులన్‌
చూచిన చూడడుత్తముడు; చూచిన చూచును మధ్యముండు; తా
చూచిన చూడకుండినను చూచు కనిష్ఠుడు” అంటాడాయన. పరస్త్రీలు తనవైపు విలాసపు చూపులను ప్రసరింప చేసినా చలింపనివాడు ఉత్తము డనీ, వాళ్ళు తనవైపు చూస్తే తానూ చూసేవాడు మధ్యముడనీ, వాళ్ళు తన ను చూచినా, చూడకపోయినా, కన్నార్పకుండా వాళ్ళనే చూచేవాడు అధ ముడనీ ఆ కవి చెప్పాడు. ఎంతో మనో నిగ్రహముంటే తప్ప స్త్రీల పట్ల అం దరూ అలా ప్రవర్తించలేరని, ప్రహ్లాదాది మహనీయులకే అది సాధ్యమని అంటాడాయన.
మనిషి శీలం కాంతా కనకాల పట్ల అతని వైఖరిని బట్టి తెలుస్తుందట. వాటి కోసం ఎన్ని కాని పనులు చేయడానికైనా పూనుకొంటాడు సాధారణ మనిషి. పరస్త్రీలను కోరడం ఎంత తప్పో, పరుల ధనాన్ని ఆశించడమూ అంతే తప్పు, నేరము అంటుంది సుమతీ శతకం. అలాగే, పరుల ధనము లకు ఆశపడకు, ”యోర్థే శుచి: సహ శుచి:” అంటుంది వేదం. ఎవడైతే ధనం పట్ల పరిశుద్ధుడో అతడే నిజమైన పరిశుద్ధాత్ముడు. కష్టపడి, న్యాయ మార్గంలో సంపాదించి, దానితో తృప్తిపడాలి. ఎక్కువ కావాలనుకొంటే మరింత ఎక్కువ కష్టపడాలి తప్ప తప్పుడు మార్గాలలో సంపాదించ రాదు. పరుల సొమ్ము పాము వంటిది. దానివైపు కన్నెత్తి చూడరాదు, ఆశించరాదు, అసూయ పడరాదు. వేమన కవి ఇలా అన్నారు.
”పరుల విత్తమందు భ్రాంతి వాసిన యట్టి
పురుషుడవనిలోన పుణ్య మూర్తి
పరుల విత్తమరయ పాప సంచితమగు
విశ్వదాభిరామ! వినుర వేమ!”
పరుల ధనంపై ఆశ లేనివాడే పురుషులలో ఉత్తముడని వేమన వాక్కు.
ఇక మూడవ లక్షణం పరులకు హితుడై ఉండటం. మనం ఇతరుల పట్ల ఏ భావంతో ఉంటామో ఇతరులూ మన పట్ల అదే భావం కలిగి ఉం టారు. మనం ఇతరుల మేలు కోరుతూ, వారిని మన హితులుగా భావిస్తూ ఉంటే వారూ మనలను హితులుగా భావిస్తారు. ”అద్వేష్టా సర్వ భూతా నాం మైత్ర: కరుణ ఏవచ” అంటూ, సకల ప్రాణులను కరుణతో చూస్తూ, మైత్రితో మెలుగుతూ, అసలు ద్వేషించకుండా ఉండాలని భగవద్గీత బోధి స్తున్నది. పరులకు మేలుచేసే అవకాశంకోసం వేచి ఉండటం ఉత్తముల లక్షణం. అంతేకాదు. ”ఒరులేయవి యొనరంచి న/ నరవర! అప్రియ ము తన మనంబునకగు తా/ నొరులకు నవి సేయకునికి/ పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్‌” అంటూ మహాభారతం ”ఇతరులు ఏ పను లు చేస్తే మన మనసుకు బాధ కలుగుతుందో, ఆ పనులు మనము ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే ధర్మము.”
నాలుగవ లక్షణం పరులు తను పొగడ నెగడటం. అంటే ఏ పనిచేస్తే ఇతరులు తనను ప్రశంసిస్తారో ఆ పని చేస్తూ ఉండాలి అని అర్థం. అంటే ఇతరుల ప్రశంసలు కోరి పని చేయమని దానర్థంకాదు. ఇతరుల ప్రశంస లకు తగిన పని చేయమని మాత్రమే దాని భావం. ఒక్కొక్క మారు మనం చేసే మంచి పనికి గుర్తింపు, ప్రశంస రాకపోవచ్చును. అంతమాత్రాన అది మంచి పని కాకపోదు. ప్రశంసలకు పొంగిపోకుండా, నిందలకు క్రుంగి పోకుండా మంచి పనులను చేస్తూ పోవడమే మన లక్ష్యం కావాలి.
పరులు మన పట్ల అలిగినా మనం అలుగక పోవడం ఐదవ లక్షణం. మహా భారతం ఇలా చెప్పింది. ”అలిగిన నలు గక, ఎగ్గులు/ పలికిన మరి విన నియట్ల ప్రతి వచనంబుల్‌/ పలుకక, బన్నము వడి ఎద/ తలపక నున్నతడ చూవె ధర్మజ్ఞుడిలన్‌”. ఎదుటివారు కోపించినా, తిరిగి వారిపై కోపింపక, నిష్ఠూరంగా మాట్లాడినా వారిని విమర్శించకుండా, వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకుండా, ఉండేవాడే ధర్మజ్ఞుడు. ఒక్కొక్కసారి ఇత రులు మనపై అకారణంగా, లేదా, ఏదో కారణం వల్ల కోప్పడవచ్చును. అయినా మనం కోప పడకూడదట. అకారణమైతే ఆ విషయం ఎదుటి వారికి అర్థమయ్యేలా వివరించాలి. అయినా వారింకా కోప్పడుతూనే ఉం టే ఆత్మరక్షణ చేసుకోవాలి. కానీ మనము తిరిగి కోపిస్తే ఫలితముండదు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పుడయ్యేది. మనము మౌనంగా ఉంటే తిట్టితిట్టి వాళ్ళే అలిసిపోయి, ఆ తరువాత స్థిమితంగా ఆలోచించి, మన గొప్పతనాన్ని అర్థం చేసుకొంటారు.
ఈ ఐదు లక్షణాలూ అందరము అల వరచుకొంటే సామాజిక శాంతి తప్పక సాధ్యపడుతుంది. పరహితమే పరమ ధర్మం అని భావించి పని చేసిన మహనీయు లెందరో ఉన్నారు. మనం గొప్ప వాళ్ళం. చిన్నస్థాయి వారికి సహాయం చేయడమేమిటని భావించకుండా పరహితమే పరమ ధర్మం అనుకొని అంద రికీ సహా యం చేసే వారే ధన్యజీవులు.

  • డా.గొల్లాపిన్ని సీ తారామశాస్త్రి 9440781236
Advertisement

తాజా వార్తలు

Advertisement