Sunday, November 17, 2024

తాపత్రయాగ్నుల…ఉపశమన మార్గం

”తాపత్రయాభీల దావాగ్నులారునే? విష్ణుసేవామృత వృష్టిలే క” అంటూ పోతన కవి తాపత్రయములను భయంకరమై న దావాగ్ని కీలలుగా వర్ణిస్తూ, వాటిని ఆర్పడానికి విష్ణుసే వామృతమనే వర్షం కురవాలి అన్నాడు. అసలు ఈ తాపత్రయాలం టే ఏమిటి? అని విచారణ చేద్దాం.
తాపమంటే వేదన, వేడి, భరింపరాని దుస్థితి అనే అర్థాలున్నా యి. భరించలేని చలి బాధను శీత తాపమని, దుస్సహమైన గాడ్పుల బాధను వాత తాపమని, దుర్భరమైన మండుటెండల బాధను ఆతప తాపమని వ్యవహరిస్తుంటారు. తీవ్రమైన ఎండను కలిగించేవాడు కనుక సూర్యునికి తపనుడు అని పేరు. దుర్భరమైన వాతావరణ పరిస్థితులను, పరిసరాలను సహస్తూ, ఆహార పానీయాలను కూడా విస్మరించి తదేక దీక్షతో, ఐహక/ఆముష్మిక ప్రయోజనాన్ని ఆశించి చేసేది తపస్సు అనబడుతుంది.
ఈ తాపములను పెద్దలు మూడు రకాలుగా విభజించారు. అవి (1) ఆధి భౌతిక తాపములు, (2) ఆధి దైవిక తాపాలు, (3) ఆధ్యాత్మిక తాపాలు. ఈ మూడింటిని కలిపి తాపత్రయాలని వారు వ్యవహరించారు. ఆదిశంకరాచార్యు ల ”ఆత్మానాత్మ వివేచనం” ఇలా చెబుతుంది. ”సర్వేషాం స్థూల దేహానాం ఆధ్యా త్మిక, ఆధి భౌతిక, ఆధి దైవిక తాపత్రయాగ్నినా దాహ్యత్యం సంభవతి.” లౌకికా గ్ని కొన్ని దేహాలను దహంపవచ్చు, కొన్నింటిని దహంపకపోవచ్చు. కానీ తాప త్రయాగ్ని మాత్రం అన్ని దేహాలను దహస్తుంది. ఆధ్యాత్మికము, ఆధి దైవికము, ఆధి భౌతికము అనేవి మూడూ తాపత్రయాగ్నులు అన్నారాయన.
లోకంలో తాపత్రయం అనే పదం ఆరాటం అనే అర్థంలో వాడుకలో ఉంది. జీవయాత్రలో మానవులు అనేక విషయాలకై తాపత్రయ పడుతూంటారు. సంసారం కోసం, సంతానం కోసం తాపత్రయపడటం మానవ నైజం. తమ వారికి ఏదైనా ఆపద వాటిల్లినప్పుడూ వారి క్షేమం కోరి తాపత్రయ పడుతుంటా రు. బ్రతుకంతా అంతులేని తాపత్రయాలతో పరుగులు పెట్టడంలోనే గడిచిపో తూ ఉంటుంది.
మన శాస్త్రాలలో వివరించబడిన తాపత్రయాల గురించి ముచ్చటించు కొందాం. తాపత్రయాలలో మొదటిది ఆధి భౌతిక తాపము. ”భూతమధికృత్య వర్తత ఇతి ఆధి భూతమ్‌. అధిభూ తే నక్రియత ఇతి ఆధి భౌతికం”. భూతములు అంటే ప్రాణులు. వాటివలన ఏర్పడే దు:ఖాలు ఆధి భౌతికాలు. ప్రపంచంలో మానవులు సాటి మనుషులతోనేకాక అనేక పశుపక్ష్యాదులతో, క్రిమి కీటకాలతో కలిసి జీవిస్తుంటారు. సాటి మనుష్యుల వలన, జంతువులు, పాములు, తేళ్ళు, ఈగలు, దోమలు, చీమలు మొదలైన పురుగుల వల్ల, తేనెటీగలు, నల్లులు వంటి కీటకాలవల్ల కలిగే బాధలు ఆధి భౌతిక బాధలు అనబడతాయి. దొంగలు, #హం తకులు వంటి మనుషుల వలన మనకు, మన వాళ్ళకు, మన సంపదలకు కలిగే కష్టనష్టాలు, విష పురుగులు కాటువేయడాలు, చీమలు, నల్లులు, దోమలు కుట్ట డాలు, కుక్కలు, కోతుల వంటి జీవులు కరవడాలు, వాటి వలన కలిగే నొప్పి, సంక్రమించే వ్యాధులు వంటివి అన్నీ ఆధి భౌతిక తాపాలు. శరీరానికి కలిగే ఆకలి, దాహం వంటివి కూడా ఈ కోవలోకే వస్తాయి. వీటిని కొంతవరకు తప్పించుకొ నగలిగే వీలుంటుంది. ఆ కష్టం ఎందువల్ల కలిగింది, దానికి విరుగుడేమిటి, నివా రించడమెలా అనే విషయాలు మనకు సుపరిచితంగా ఉంటాయి.
రెండవది ఆధి దైవిక తాపము. ఇది ప్రకృతి ప్రకోపాల వలన కలిగే తాపము. ”దేవమధికృత్య వర్తత ఇత్యధి దైవమ్‌. అధి దైవేనకృతమ్‌ ఆధి దైవికమ్‌.” పిడు గుపాటు వంటి దేవతా ప్రకోపంవల్ల కలిగే దు:ఖాలు ఆధి దైవికాలు. అతివృష్టి, అనావృష్టి, సునామీలు, వరదలు, తుఫానులు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు మొదలైన వాటివలన వచ్చే కష్టాలివి. సంచిత ప్రారబ్ద కర్మల వల్ల కలిగే భయం, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూ య, లోభ మోహాదులు కూడా ఈ కోవలోకే వస్తా యి. స్థూల శరీర ధర్మాలైన జరామరణాలు కూడా ఆధిదైవిక తాపాలే. వీటినుం డి తప్పించుకోవడం మన చేతిలో లేనిది. ఎంతో కొంత, ఏదోవిధంగా వాటి పరి ణామాలు మనం అనుభవించవలసి ఉంటుంది.
మూడవది ఆధ్యాత్మిక తాపం. ఆధి వ్యాధుల వల్ల కలిగే కష్టాలివి. మనస్సు కు కలిగే ఆందోళన ఆధి. కాగా శరీరానికి కలిగే జబ్బు వ్యాధి. వీటి వలన కలిగే దు:ఖం ఆధ్యాత్మిక తాపం. మన శ్శరీరాల వలన కలిగే బాధలివి. ఆధ్యాత్మికం నామ ”ఆత్మానాం దేహం అధీకృత్య వర్తతే ఇతి అధ్యాత్మమ్‌. ఆధ్యాత్మ నా కృతం దు:ఖం ఆధ్యాత్మికమ్‌”. నశ్వరమైన ఆత్మ- దేహాన్ని తాత్కాలిక వసతిగా చేసుకొ ని ప్రవర్తిస్తుంది. ఆత్మ వలన కలిగే కష్టాలు ఆధ్యాత్మికాలు.
చతుర్విధ పురుషార్థాల సాధనలో అంత:కరణం (మనోబుద్ధ్యహంకార చిత్తములు) పడే వివిధ తపనలు, ఏర్పడే చిక్కులు అనేవి ఆధ్యాత్మిక తాపాలుగా చెప్పవచ్చు. ఈ తాపంలో శరీరానికి సంబంధించిన ఆరు ఊర్ములు (ష డూర్ము లు) (ఊర్మి అంటే ‘బాధ’), ఆకలి, దప్పిక, జర, రుజ, శోకం, మోహం అనే వాటి వలన కలిగే కష్టాలు కూడా ఆధ్యాత్మిక తాపాలే. మన ధర్మశాస్త్రాలలో శరీరము ”స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు” అని మూడు విధాలని చెప్పబడింది. స్థూల శరీరానికి జరామరణాలు, సూక్ష్మ శరీరానికి క్షుత్పిపాసలు, కారణ శరీరానికి శోకమోహాలు అనే రెండు రెండు ఊర్ములు ఉంటాయి. ఈ ఆరు ఊర్ము లను వధించే యోగమే ‘యోగ యాగము’ అని పాండురంగ మహాత్మ్యం అనే కావ్యంలో తెనాలి రామకృష్ణ కవి చెప్పారు. ఎవరికి వారే అనుభవించ వలసినవీ, తప్పించుకోలేనివీ ఇవి.
వివేక చూడామణిలో శంకరులవారు ఇలా సెలవిచ్చి ఉన్నారు…

”మస్తకన్యస్త భారాదే:, దు:ఖమన్యై: నివార్యతే
క్షుధాదికృత దు:ఖం తు వినా స్వేన నకేన చిత్‌”

మన తలమీద మోసే భారాన్నైతే ఇతరుల సహాయం వల్ల తగ్గించుకోవచ్చు. కానీ ఆకలిదప్పుల వంటి షడూర్ముల వల్ల కలిగే బాధను మనమే అనుభవించాలి తప్ప ఇతరుల వలన అది తీరదు.
మానవులమైన మనకు కలిగే నానా విధాలైన బాధలు ఈ త్రివిధ తాపాలలో చేరిపోతాయి. వీటికి గురైనవారు తాపత్రయ పీడితులు అనబడతారు. నిరంత రం పీడించే ఈ మూడు తాపాలూ ఓర్చుకోవాలంటే విష్ణుసేవామృత వృష్టిలో తడవడమే మార్గం. నిరంతర సచ్చింతనతో మనసును దైవంమీదనే కేంద్రీకరిస్తే తాపత్రయాగ్నులచేత ద హంపబడే మనకు ఆహ్లాదం కలిగించే వెన్నెలవంటి చల్లని భగవతీ కటాక్షం లభిస్తుంది అని పెద్దలంటారు. అందుకే శ్రీ లలితాదేవిని ”తాపత్రయాగ్ని సంత ప్త సమాహ్లాదన చంద్రికా” అంటూ సంబోధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement