Home భక్తిప్రభ మన జీవన గీత..!

మన జీవన గీత..!

0
మన జీవన గీత..!

ఈ నెల 11వ తేదీన గీతా జయంతి జరుఫుకొంటున్నాము. ఒక మహా గ్రంథానికి జయంతి జరుపుకోవడం, భగవద్గీతకే చెల్లింది. ఎందుకంటే ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ మోక్షం పొందడానికి వీలుగా జీవన విధానం వివరించి చెప్పారు. అందుకే వేల సంవత్సరాలు అయినా ఎప్పుడూ సజీవ శిల్పంగా ఉంది. అందుకే జయంతి వేడుకలు. భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో వివరించబడింది. కురు క్షేత్రం ”కురు” అనే మహారాజు కొంత భూమిని దున్ని అక్కడే యజ్ఞయాగాలు చేసి, ఆ క్షేత్రంలో మరణించిన వారికి ముక్తి లభించేటట్లు వరం పొందాడు. ధర్మక్షేత్రం అంటే మన శరీరం ఒక ధర్మక్షేత్రం. చెడుపై మంచి సాధించే దిశగా అధర్మాన్ని నశింపచేసి ధర్మం కాపాడుటానికి, వీలుగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు కర్మ మార్గం, జ్ఞాన మార్గం,
భక్తి మార్గం వంటి అనేక అంశాలలోని సారాన్ని గ్రహించి సత్ప్రవర్తనతో జీవన విధానం కొనసాగించడానికి అందించారు. అయినా మనం మోహం, అహంకారం, కామం వంటి దుర్గుణాలు వెంటే పడుతున్నాము. మంచిని గ్రహించి ధర్మాన్ని అనుసరించే జ్ఞానం పొందితే శరీరం నిజంగా ధర్మక్షేత్రం అవుతుంది. మనం క్షేత్రజ్ఞులమవుతాము. ఎలాగంటే రైతు విత్తు నాటిన తర్వాత కలుపు ఏరివేస్తూ పంట పండిస్తున్న విధంగా. పొగ చేత అగ్ని, మురికి చేత అద్ధం, మావి చేత గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నట్లుగా మనలోని ఆత్మ జ్ఞానాన్ని అరిషడ్వర్గాలు చేత కప్పబడి ఉన్నందువల్లనే అహంకారం, కామం (కోరికలు) వంటి వాటిలో బందీలై ఉంటున్నాము. అందుకే, మనలోని అజ్ఞానం అనే ముసుగు తొలగించుకోవడానికి జ్ఞానం పొందాలి. అందుకు నిష్కామ కర్మ అనుసరించాలి. మనలో మార్పు రావడానికి భగవద్గీత ఏం చెబుతోంది? అనే సందేహం వస్తుంది.
16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగంలో మనకు ఉండవలసిన 26 సుగుణాలు వివరించారు.
అవే భయం లేకుండా ఉండటం, అంత:కరణ శుద్ధి, దానము శాంత స్వభావం, చంచల స్వభావం లేకుండా ఉండుట వంటి గుణాలు. ఇవి మనం పాటిస్తూ ఉంటే జీవన గీత బాగుంటుంది. కర్మణ్య వాధికారస్తే- స్త్వ కర్మణి ( 2-47 శ్లోకం)లో కర్మలు చేయకుండా ఉండకూడదు. కర్మలు చేయడమే మన పని. ఫలితాన్ని ఆశించవద్దు పని నెరవేరినా, నెరవేరక పోయినా, సమత్వ బుద్ధి కలవాడు పాప పుణ్యాలను ఈ జన్మనందే తొలగించుకొంటాడు అని వివరించారు. మనం ముఖ్యంగా మూడు గుణాలకు ప్రేరేపింపబడతాం అవే సత్త్వ, రజో తమోగుణాలు. ఇవి మనం తీసుకునే ఆహారంను బట్టి ప్రేరేపింపబడతాయి. అందుకే సాత్త్వికమైన ఆహారం తీసుకొంటే తాత్త్విక గుణాలు కలుగుతాయి. నేనే గొప్ప వాడను. నాకు కావలసినంత సంపద ఉంది. నాకు సేవకులు ఉన్నారు. నాతో సమానమైన వారు ఎవరూ లేరు వంటి మాటలు వారు అసుర స్వభావులు.
ఉత్సాహం సాహసం ధైర్యం, బుద్ధిశక్తి: పరాక్రమ
షడేతే యత్ర తిష్ఠంతి తత్రో దేవోపి తిష్ఠతి
అంటే… ఉత్సాహం, సాహసం, ధైర్యం, సద్భుద్ధి, శక్తి, పరాక్రమము అనే ఈ ఆరు గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడే భగవంతుడు కాపురం ఉంటాడు. ఇలా సాత్విక గుణంతో, సత్కర్మలు చేస్తూ, వివేకంతో మనలోని అసుర గుణాలకు స్వస్తి పలికి శ్రీకృష్ణుడునే శరణు వేడితే…—
అనన్యా శ్చిన్త యన్తో – యోగక్షేమం వహామ్యమ్‌
రాజవిద్యా రాజ గుహ్య యోగంలో అన్నారు. అంటే ఎవరు ధర్మఫథంలో నడుస్తూ నన్నే నిరంతరం చింతించుచు ధ్యానంలో ఉండే వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని పెద్ద భరోసా, ధైర్యాన్ని ఇచ్చాడు.

  • అనంతాత్మకుల రంగారావు
Exit mobile version