Tuesday, November 5, 2024

అంగద రాయబారం!

సేతువు మీదినుండి లంకా తీరం చేరిన రామచంద్రమూర్తి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదు డు, లక్ష్మణుడు, సుషేషణుడు, విభీషణుడు, గజనల కుము దులు, పనస గవాక్షులు, ఒకచోట చేరి చేయాల్సిన పని గురించి ఆలోచన చేయసాగారు. లంకకు చేరిన వానరులంతా దాన్ని ముట్ట డి చేద్దామన్నారు. ఎవరే పని చేయాలా అని ఆలోచించారు. అప్పు డు విభీషణుడు రావణ సేనా సన్నాహం రాముడికి చెప్పాడు.
”నా మంత్రులు అనలుడు, శరభుడు, ప్రఘసుడు, సంపాతి- పక్షి వేషంలో శత్రు పురమైన లంకకు వెళ్ళి అక్కడ పుర రక్షణకు ఏర్పాటు చేయబడిన సేనల విధం చూసి వచ్చారు. గొప్ప సేనతో సేనానాయకుడైన ప్రహస్తుడు తూర్పు గవనిని కాపలా కాస్తున్నా డు. దక్షిణాన మహోదర, మహాపార్శ్వలున్నారు. పడమట ఇంద్ర జిత్తు వున్నాడు. అతడికి సహాయంగా ఆయుధాలు ధరించిన వారెందరో వున్నారు. ఉత్తరాన రావణుడు స్వయంగా తానే రక్షిస్తు న్నాడు. వీడికి సహాయంగా రాక్షస సమూహం వుంది. విరూపాక్షు డు నగర మధ్య ప్రదేశాన్ని రక్షిస్తున్నాడు. ఈవిధంగా శత్రువులు తమ సేనను తీర్చిదిద్దారు. లంకలో వేయి ఏనుగులు, పదివేల రథాలు, అశ్వాలు పదివేలు, కోటిమంది పదాతులైన రాక్షసులున్నారు. వీరంతా మహాశూరులు, హింసాసక్తులు, రావణుడి మెప్పు పొందినవారు, భయంకరులు. ఇక నువ్వు శత్రువును గెలవడానికి తగిన సన్నాహం చేయి. రామచంద్రా!” అని విభీషణుడు చెప్పగానే, రాముడు శత్రువులను జయించడానికి తన సేనను విభజించాడు. ”గొప్ప సేనలతో నలుడు తూర్పు గావని వద్ద నిలిచి ప్రహస్తుడిని గెలవాలి. దక్షిణ దిక్కున అంగదుడు మహోదర, మహాపార్శ్వల ను గెలవాలి. ఆంజనేయుడు తన సేనతో ఇంద్రజిత్తున్న పడమటి దిక్కున నిలిచి లంకను ఆక్రమించాలి. ఇక రావణు డిని చంపే వంతు నాది. రావణుడున్న ఉత్తర దిశలో నేను లక్ష్మణుడితో వుంటాను. జాంబవంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు సేనా మధ్యాన్ని రక్షిం చాలి. వానరులెవ్వరూ మనుష్య రూపంలో వుండవద్దు. ఇది నియ మం. దీన్ని ఎవరూ, ఎప్పుడూ తప్పకూడదు. నేను, లక్ష్మణుడు, విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు, మేము ఏడుగురము మనుష్యుల రూపంలో యుద్ధం చేసి శత్రువులను చంపగలం. మరెవరైనా మనుష్య రూపంలో కనబడితే వాడిని శత్రువని వెంటనే వధించాలి. కాబట్టి వానరులెవ్వరూ మనుష్యరూపాలు ధరించ కూడదు.” ఇలా సేనలను ఏర్పాటు చేసి, రాముడు లంకను చూడా లనుకుని సువేలాద్రి ఎక్కాడు. ఆయన వెంట లక్ష్మణుడు ఎక్కాడు. ఆ వెనుక సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు మొదలైనవా రంతా వాయువేగంతో ఎక్కారు. ఇలా అందరూ కొండ ఎక్కి ఆకా శాన్ని తాకుతున్నదా అన్నట్లున్న త్రికూట పర్వత శిఖరం మీదున్న అందమైన ప్రాకారాల వరుసలను, ద్వారాలను చూసి ఆ ప్రాకారా లలో వున్న నల్లటి రాక్షసులను వేరొక ప్రాకా రమా అని భావించారు. అందరూ ఆ రాత్రి పర్వతం మీదే వున్నారు.
ఉదయం కాగానే లంకానగరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సుగ్రీవుడి ఆజ్ఞాను సారం సువేలలోని వానరులు మినహా మిగి లిన వారంతా దండుగా లంక మీదకు వెళ్ళా రు. వారి సింహనాదాలతో, కాలి తొక్కుళ్ళ తో లంకానగరమంతా చలించింది. లంక లో భూమి వణికింది. ఆ ధ్వనికి భయపడి జంతుసమూహాలు పరుగెత్తాయి. లంకా నగరానికి భూషణంగా మనో#హరమైన రావ ణాసురుడి మేడ వుంది. దాన్ని అందరూ ఆశ్చర్యంగా చూశారు. స్వర్గలోకంతో సమా నమైన ఆ పురాన్ని, దాని అందాన్ని చూసిన రాముడు ఆశ్చర్య పడి సంతోషంగా అంతా అలా చూస్తూ వుండిపో యాడు.
ఇంతలో సుగ్రీవుడు ఆకాశానికి ఎగిరి రావణుడున్న మేడ మీదకు దూకాడు. అల్పకాలమే అయినా నిలిచి భయం లేకుం డా రావణుడిని చూసి, ఆ దుష్టుడిని కొంచె మైనా లెక్కచేయకుండా, తనతో యుద్ధం చేయమన్నాడు. సుగ్రీవుడిని చూసి రావణు డు ”సుగ్రీ వా! నా కంట పడకముందు నీకు చక్కటి మెడ వుంది కాని ఎప్పుడు నాకంట పడ్డావో అప్పుడే మెడలేనివాడివయ్యావు” అంటూ కోపంతో సుగ్రీవుడిని ఎత్తి అవతల పారవైచాడు. సుగ్రీవుడు పుట్ట చెండు లాగా పైకెగిరి చేతులతో రావణుడిని నేలమీదికి తోశాడు. కిందపడ్డ రావణుడు భయపడక, వెనుదీయక త్వరగా లేచి చేతులతో యుద్ధం చేయసాగాడు. ఇద్దరూ గొప్ప ధైర్యం కల వారై యుద్ధం చేశారు. ఒకరినొకరు కొట్టుతూ, పడతోస్తూ ఇద్దరూ సమానంగా యుద్ధం చేశారు. సుగ్రీవుడిని న్యాయ యుద్ధంలో గెలవలేమని, మాయచేసి గెలవాలని రావణుడు అనుకున్నాడు. సుగ్రీవుడు రావణుడి ద్రోహబుద్ధి కనిపెట్టి, వున్నవాడు వున్నట్లే ఆకా శానికి ఎగిరి, రాముడి దగ్గరికి వెళ్ళాడు.
సుగ్రీవుడి శరీరం మీద యుద్ధం గుర్తులు చూసిన శ్రీరాముడు అతడిని సంతోషంగా కౌగలించుకుని ”నీవిలాంటి సాహసం చేయ వచ్చా? రాజైనవారు ఇలాంటి పనులు స్వయంగా చేయవచ్చా? నువ్వక్కడ చిక్కుబడి వుంటే సీత గతి ఏంటి? నాగతి ఏంటి? ఈ వానరుల గతి ఏంటి? వీరికి నాయకుడు ఎవరు? నాయకుడు లేకుం డా వారెలా యుద్ధం చేస్తారు? మనల్ని నమ్మి వచ్చిన విభీషణుడి గతి ఏంటి? నీ అనాలోచిత కార్యం వల్ల ఎందరికి కీడు కలిగేదో ఆలో చించు. ఇకపై నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేయవద్దు.” అని, రాముడు తమ్ముడితో- ”లక్ష్మణా! రాక్షసుల కనిష్ట సూచకాలు కనపడే సమయంలోనే మనం సేనలతో పోయి లంకను ముట్ట డించాలి”.అంటూనే, ”వానరులారా! రాక్షసులకు అప జయం కలిగించే శకునాలు కనపడుతున్నాయి. ఈ సమయంలోనే లంకను ముట్టడి చేస్తే, అల్పకాలంలో రాక్షసులను, లంకను నుగ్గునుగ్గు చేయవచ్చు. మీకు రాగల అపాయం లేదు. రండి, లంకను ముట్టడి చేయం డి.” అని వానరులకు ఉత్సా#హం కలిగించేలా పలికాడు.
ఈవిధంగా రామలక్ష్మణులు లంకాపురాన్ని సమీ పించి, లోపలివారు బయటికి రాకుండా వానరసేనను నియమించారు. కొండ శిఖరంలాగా వున్న ఎత్తైన ఉత్తర ద్వారాన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి అడ్డగిం చాడు. ఆ ద్వారం దగ్గరే రావణుడు కాపున్నాడు. వానర సేనానాయకుడైన నీలుడు లంకాపుర తూర్పు ద్వారాన్ని అడ్డగించాడు. అంగదుడు తన సేనతో దక్షిణ దిక్కును, ఆంజనేయుడు పశ్చిమ ద్వారాన్ని అడ్డగించాడు. సుగ్రీ వుడు మధ్యలో వున్నాడు. జాంబవంతుడితో కలిసి సుగ్రీ వుడు రాముడికి కుడిపక్కన నిలిచారు. హనుమంతుడికి ఎదురుగా ఇంద్రజిత్తు, రాముడికి ఎదురుగా రావ ణుడు వుండడంవల్ల ఈ రెండు వైపులా తాకిడి ఎక్కువగా వుం టుందని సుగ్రీవుడు ఇద్దరి మధ్య నిలిచాడు. తదుపరి మంత్రులతో రాముడు సమాలోచన చేసాడు.
అంగదుడిని చూసి శ్రీరాముడు ”శూరుడా! కోట గోడ దాటి, లంక ప్రవేశించి, రావణుడిని సమీపించి, నేను చెప్పానని నా మాటలుగా ఇలా చెప్పు. నువ్వు వీరు డి వై యుద్ధానికి వస్తేరా. నా బాణాలకు చచ్చిపోగలవు. లేక పోతే గర్వం వదిలి సీతను నాకిచ్చి నా శరణు వేడుకో. ఈ రెంటిలో ఏదో ఒకటి చేయకపోతే లోకంలో రాక్షసులనే వారు లేకుండా చేస్తాను. నీ ఒక్కడి కారణాన రాక్షస వంశ మే నాశనం అవుతుంది. నిన్ను చంపి, లేదా, తొలగించి, రాజ్యాధిపత్యం విభీషణుడికి ఇస్తాను.” అని అన్నాడు.
వెంటనే అంగదుడు ఆకాశానికి ఎగిరి, కోట దాటి, రావణుడు మేడమీద దిగి, మంత్రులతో కూడి వున్న రావణుడి దగ్గరకి వెళ్ళి, రామచంద్రమూర్తి చెప్పిన మాటలను ఒక్క అక్షరం ముక్క కూడా వదలకుండా వినిపించాడు. ”రామచంద్ర మహారాజు దూతను నేను. ఆయన రాయబారం పంపగా వచ్చాను. నేను వాలి కుమారు డిని. అంగదుడు అంటే నేనే. రామచంద్రమూర్తి ఇలా చెప్పాడు. మగవాడివైతే యుద్ధానికిరా. మంత్రులతో, కొడుకులతో, చుట్టాలతో, స్నేహతులతో సహా నిన్ను చంపుతాను. లోకాలకు నీ బాధ తొలగిస్తాను. సగౌరవంగా సీతను తెచ్చి వెంటనే నాకు సమర్పించక పోతే, శరణు వేడకపోతే, నిన్ను చంపి నీ రాజ్యాన్ని విభీషణుడికి ఇస్తాను అని చెప్పమన్నాడు.” అనగానే రావణుడు కోపంతో అంగదుడి ని పట్టుకుని కట్టేయమని, కొట్టమని, చంపమని అరిచాడు.
అంగదుడు వారికి చిక్కినట్లు నటించి, వారు దగ్గరికి రాగానే వారి మెడలు చంకలో ఇరికించుకుని పక్షిలాగా వేగంగా ఎగిరి పోయాడు. తాను రామచంద్రుడి దూతననీ, తన పేరు అంగదుడు అనీ అందరూ వినేట్లు స్పష్టంగా పలికి సింహనాదం చేస్తూ, అంగ దుడు ఆకాశ మార్గా న రామచంద్రమూర్తిని చేరుకున్నాడు. ఆయన అంగదుడిని చూసి మెచ్చుకుని యుద్ధాన్ని ప్రారంభించాడు. అంగ దుడు చేసిన కార్యా న్ని చూసిన రావణుడు ఇది తనకు అపశకునంగా భావించాడు. అక్షౌహణిల కొద్దీ వస్తున్న వానర సైన్యానికి, వారి కేకలకు రాక్షసులు భయపడి హాహాకారాలు చేశారు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు, 8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement