ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్
య: ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్
ఓం -ఈశ్వరుని నిరాకార తత్వాన్ని సూచించే పవిత్ర శబ్దంబీ
ఇతి – ఈ విధంగా; ఏకఅక్షరం – ఒకే అక్షరంతో ఉన్న; బ్రహ్మ – పరమ సత్యము; వ్యాహరన్ – జపిస్తూ
మాం – నన్ను(శ్రీ కృష్ణుడు); అనుస్మరన్ – స్మరిస్తూ; య: – ఎవరైతే; ప్రయాతి – వెళ్ళిపోతారో; త్యజన్ – విడిచి పెడుతూ; దే#హం – శరీరము; స: – అతడు; యాతి – పొందును; పరం – అత్యున్నతమైన; గతిం – లక్ష్యము.
శ్రీ కృష్ణుడు భక్తికి ఉన్న గొప్పతనాన్ని వివరించే ఈ శ్లోకంలో, భక్తుడు ”ఓం” అనే పవిత్ర శబ్దాన్ని జపిస్తూ, భగవంతుని యందు మనస్సును కేంద్రీకరించి తన దేహాన్ని విడిచినపుడు అతడు అత్యున్నత స్థితిని పొందుతాడని స్పష్టంగా చెబుతున్నారు.
”ఓం” అనేది బ్రహ్మను సూచించే అత్యంత పవిత్ర శబ్దం. ఇది బ్రహ్మతత్త్వానికి ప్రతీకగా ఉండి, పరమ సత్యానికి గుర్తు. భగవంతుని సర్వ వ్యాపితత్వం, సృష్టి, స్థితి, లయం వంటి అన్ని గుణాలు ఈ ఒక్క అక్షరంలోనే సమా#హతమై ఉంటాయి. వేదములు ”ఓం” కారాన్ని సృష్టికి ఆది మంత్రంగా భావిస్తాయి.
”ఓం” అనే శబ్దం మూడు అక్షరాల సమాహారమై ఉంటుంది ”అ”, ”ఉ”, ”మ”.
”అ” అక్షరం భూమిని, సృష్టిని సూచిస్తుంది; ”ఉ” మధ్యస్థానాన్ని, జీవాత్మను సూచిస్తుంది; ”మ” పరమాత్మనికి ప్రాతినిధ్యం.
ఈ మూడు అక్షరాలు కలిపి సకల సృష్టి, సాక్షాత్కారాన్ని సూచిస్తూ ”ఓం” అనబడుతుంది. ధ్యానములో ప్రణవ జపం ద్వారా భక్తుడు మనస్సును స్థిరపరచి, శాంతిని పొందుతాడు. అష్టాంగ యోగ సాధనలో శరీర నియమాలను, మనస్సు నియంత్రణను పాటిస్తూ, ఈ ”ఓం” కారాన్ని ధ్యానించడం ప్రధాన పద్ధతిగా చెప్పబడింది.
భగవంతుని నిరాకార, సాకార తత్త్వం:
భక్తులు ఈ ”ఓం” కారాన్ని నిరాకార తత్త్వంగా కూడా పరిగణిస్తారు. భగవంతుడు పరమానంద స్వరూపుడని భక్తులు నమ్ముతారు, కాబట్టి, అతనికి పేర్లు, రూపాలు ఉంటాయి. భగవద్గీత ఈ శ్లోకంలో మరణ సమయాన భగవంతుని జ్ఞాపకంలో ఉండటానికి ఉన్న ప్రాముఖ్యతను తెలిపింది. భగవంతుని ధ్యానంలో ఉండటం వల్ల, వ్యక్తి మరణానంతరం పరమ గతి పొందుతాడు.
వేదాలు మొదట శబ్దాన్ని సృష్టిగా, సృష్టికి మూలం అన్నవిధంగా చెబుతాయి. క్రైస్తవ బైబిల్లో కూడా, ”ఆదిలో వాక్యం దేవుని యొద్ద నుండెను” అని పేర్కొన బడింది. ఈ వాక్యం అన్నది సృష్టి ప్రారంభాన శబ్దరూపమై ఉండి, ఆ తరువాత సృష్టి మొదలయింది అని కూడా తెలియజేస్తుంది. ఈ శ్లోకం, యోగ సాధకులు, భక్తులు, జ్ఞాన సాధకులకు గమ్యం ఏదైనా కావచ్చు కానీ పరమాత్మ ధ్యానంలో ఉండటం అత్యవసరమని తెలియ జేస్తుంది.
- రామకిష్టయ్య సంగనభట్ల…