Tuesday, November 26, 2024

ఓంకారము ప్రణవ ధ్యానము

ఒకసారి మహా ఋషులైన పిప్పలాదుడు, అంగీరసుడు, సనత్కుమారుడు అధర్వ ముని దగ్గరకు వెళ్ళి ‘ధ్యాన మనగా ఏమిటి? ధ్యానింపదగినది ఏది?’ అని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు అధర్వ మహర్షి ఈవిధముగా చెప్పడం ప్రారంభించారు. ”ప్రణవాక్షరమే ఆదిలో నుపదేశింపబడినది. అదియే ధ్యానము. అట్టి ప్రణవ ధ్యాన మునే ధ్యానింపవలెను. ఈ ప్రణ వాక్లరము పరబ్రహ్మ స్వరూప ము. ప్రణవము యొక్క నాలుగు పాదములు నాలుగు వేదములు. నాలుగు పాదములతో గూడిన ఈ ఓంకారము పరమాత్మ స్వరూపము. ప్రణవము యొక్క మొదటి మాత్ర ‘అ’కారము. దానికి పృథి వి భూతము. ఇది ఋక్కులతో గూడి ఉన్నది. దీనికి అధి దేవత బ్రహ్మ. పితృదేవతలు అష్ట వసువులు, గాయత్రి ఛందస్సు. గార్హ పత్యాగ్ని. ప్రణవము యొక్క రెండవ మాత్ర ‘ఉ’కారము. భూతము ఆకాశ ము. యజస్సులతో కూడినది. యజుర్వేదములకు అధి దేవత విష్ణువు. ఏకాదశ రుద్రులు, పితృదేవతలు. త్రిష్టుప్‌ ఛందస్సు, దక్షిణాగ్ని. ప్రణవము యొక్క మూడో మాత్ర ‘మ’ కారము. దీనికి లోకము స్వర్గము. సామగానములతో కూడినది. రుద్రుడు అధి దేవత. ద్వాదశా దిత్యులు పితృదేవతలు. జగతి ఛందస్సు, అహావనీయాగ్ని. ప్రణవము యొక్క చివరిది, నాల్గవదియగు అర్ధ మాత్ర సోమ లోకము, ఓంకారము. అది అధర్వ మంత్రములతో గూడిన అధర్వణ వేదము. అకార, ఉకార, మకారములకు చివరి అతి సూక్ష్మమై యుండు అర్ధమ నాద స్వరూపము. ప్రథమ మాత్ర ఎరుపు రంగులో నుండును. దాని శక్తి స్వర్ణ కాంతి గలది. దీనికి అధి దేవత మహాత్మడగు బ్రహ్మ. రెండవ మాత్ర నల్లగా నుండును. దాని శక్తి విద్యుత్కాంతి గలది. అధి దేవత విష్ణువు, మూడవ మాత్ర తెల్లగా నుండును. శక్తి శుక్ల వర్ణము. దీని అధి దేవత రుద్రమూర్తి. నాల్గవ మాత్ర లక్ష్మీదేవి వంటి వర్ణము గలది. దాని శక్తి సమస్త వర్ణములతో నుండును. దీని అధిదేవత పరమాత్మ. ఇదే ఓంకారము. ఇది నాలుగు అక్షరములు గలది. నాలుగు పాదములు గలది. నాలుగు శీర్షములు గలది. నాలుగవది అర్ధమాత్ర. ఇది స్థూలమైనప్పుడు హ్రస్యము, దీర్ఘము. ప్లుతము అని చెప్పబడును. ప్రణవము యొక్క మొదటి మాత్ర జాగ్రత్తు. రెండవ మాత్ర స్వప్నము. మూడవ మాత్ర సుషుప్తి. నాలుగవ మాత్ర మరీయము. ఒక్కొక్క మాత్ర భిన్న మాత్రల యందు లయించును. ఇది స్వయం ప్రకాశమై నది. దీనిని ప్రకాశింప చేయునది మరొకటి లేదు.
సర్వమును అనగా బ్రహ్మ, విష్ణు, రుద్రేంద్రాదులను అందరును పుట్టు చుండువారు. వీటి అన్నిటికి కారణమైన వస్తువు మాత్రము పుట్టుటయే. అది నాశ రహితమైనది. అదే పరమాత్మ, ధ్యానింప దగిన ధ్యేయ వస్తువు. అధర్వ శిఖోపనిషత్తు.

– రవికాంత్‌ తాతా

Advertisement

తాజా వార్తలు

Advertisement