మనం పలికే ప్రతి మంత్రం ముందు ”ఓం” అనే దానితోనే ఉచ్ఛరిస్తాము. గాయత్రీ మంత్ర అనుష్టానంలోను, భగవంతునికి నైవేద్యం సమర్పించే సమయంలో కూడా ఓంతోనే ప్రారంభం అవుతుంది. ఉదా: ఓం ప్రాణాయస్వాహ… అని. ఓం అనే ఏకాక్షరం ప్రణవం అంటారు. శివపురాణం ప్రకారం శివుని నోటినుండి ”అ” కార ”ఉ” కార, ”మ” కార శబ్దస్వరూపాలు వెలువడి ఓంకారంగా రూపం చెందింది.
భగవద్గీతలో ‘మహర్షీణాం స్థావరాణం హిమాలయ: అనే శ్లోకంలో (10 అధ్యాయం 25 శ్లోకం) ప్రణవమును
(ఓం కారం) నేనే అని శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పారు. అలాగే మరో శ్లోకం (17 అధ్యాయం-24)లో వేదములులలో యజ్ఞ దాన తప: క్రియలలో అన్నియు కూడా ”ఓం” అని చెప్పిన తరువాతనే అనుష్ఠించబడుతున్నాయి అని వివరించారు. అంటే ప్రణవం (ఓం) పరబ్రహ్మ స్వరూపం.
దేవతల అష్టోత్తర శతనామావళి, సహస్రనామాలలో కూడా ప్రతి నామం ఓంతో ప్రారంభించి నమ:తో ముగించాలి. ఈ ప్రణవం శివానామంతో కలిసి ”ఓం నమ:శివాయ” అని ప్రణవాక్షర మంత్రం. ఈ మంత్రం జపం చేస్తూ ముక్తిని పొందిన మహర్షులు ఎంతోమంది ఉన్నారు. ఓం నమ:శివాయ అనే ఈ మంత్రం కైలాసం, వైకుంఠ ద్వారాలు వద్ధ ఘోషిస్తున్నాయి. సంగీతానికి మూలం ”ఓం”కారం సంగీతానికి దైవత్వాన్ని తెచ్చింది. విద్యలలో సంగీతం గొప్ప విద్య. ఓంకారం మూడు అక్షరాలు అ కార, ఉ కార మ కార స్వరూపం అని తెలుసుకొన్నాము. దీనిలో ”అ కారం” జాగ్రదావస్థలో చేసే కర్మలకు సత్త్వ గుణానికి ప్రతీక. అలాగే ఉ కారం స్వప్నావస్థ కర్మగా, రజోగుణానికి ప్రతీకగా, ఇక మ కారం సుషుప్తి అవస్థలో చేసే కర్మలకు, తమో గుణానికి ప్రతీకగా చెప్పారు. ప్రాణాయామం రెండు విధాలుగా చేస్తారు
1) ఐదు వేళ్ళతో ముక్కు చివర పట్టుకుని చేసే ప్రణవం.
2) బ్రొటన వేలుతో కుడి ముక్కు, ఉంగరపు వేలు, చిటికెన వేలుతో ఎడమ ముక్కును పట్టుకొని ఓంకారం జపించడం. గణేషుడు ప్రణవ స్వరూపుడు. ఓంకార స్వరూపుడు. ఆయన తొండం ఓంకారంనకు చిహ్నం. ”ఓంకారం లేని మంత్రం దేవుడు లేని గుడి ఒక్కటే” అని నానుడి. ఓంకారం లేకపోతే మంత్రానికి విలువ ఉండదు. అలాగే దేవుడు లేని గుడికి ఎవరూ వెళ్ళరు కదా. ఓంకారం గురించి తైత్తిరీయోపనిషత్తు, అమృతబిందోపనిషత్తు వంటి అనేక ఉపనిషత్తులలో పేర్కొన్నారు.
ఒకసారి దేవతలు ప్రజాపతి వద్దకు వెళ్ళి, విముక్తికి ఉపాయం సూచించమని అడిగారు. అపుడు ప్రజాపతి వారితో ”గాయత్రాది ఛందస్సులు అనుసరించండి ముక్తి సిద్ధిస్తుందని చెప్పారు. అయినా లభించకపోవడంతో, మళ్ళీ ప్రజాపతిని కలిసి, విషయం చెబితే ప్రణవం ధ్యానం చేయమని సూచించారు. అపుడు చాలామంది ముక్తి పొందారు.
ఓంకార క్షేత్రం: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని ఖాండ్వాకు దగ్గరగా ఉన్న మాంధాత అనే ద్వీపంలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న శివుడు ఓంకారంనకు ప్రభువు. అందుకే ఆయనకు ”ఓంకారేశ్వరుడు” అని పేరు వచ్చింది. ప్రతీ రోజు మనం ఉదయం పదినిమిషాలు, సాయంత్రం పదినిమిషాలు ఓంకారం మనుసులో ధ్యానం చేస్తే 1) మానసిక ఒత్తిడి ఉండదు. 2) ఊపిరితిత్తులకు బలాన్ని చేకూరుతుంది. 3) రక్తప్రసరణ జరిగి గుండె ఆరోగ్యానికి మంచిది. ఇలా అనేక రుగ్మతలకు చికిత్స ఓంకారం అని పెద్దలు చెబుతారు. శాస్త్రవచనం కూడా. అందుకు ప్రణవాన్ని ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.
- అనంతాత్మకుల రంగారావు